Jul 10,2022 07:20

     'ఒక రైలునీ ఒక విమానాన్నీ కనిపెట్టానని/ ఉత్సాహంతో ఛాతీ విరుచుకుంటాడు మానవుడు/ కానీ మానవ జాతినే మారు మాటాడకుండా/ మసి చెయ్యగలను మరో నిమిషంలోనని/ కలరా బేసిలై-గర్వంగా లోపల్లోపల నవ్వుకుంటుంది/దేవుళ్లని తన రూపంలోనే సృష్టించుకుని/ తన భయాన్నీ కోర్కెల్ని వాళ్లకు తగిలించుకుని/ అడిగినప్పుడల్లా వరాల్నిమ్మని ఒప్పందం చేసుకుని/ పర్వాలేదని అప్రమత్తుడయ్యాడు మానవుడు/ ఏవో కొన్ని పరిశోధనలు చేసి భాష్యాలు వ్రాసి/ఇదంతా మిధ్యా అని లేని నిజం ఎక్కడో దాక్కొందనీ/ మిధ్యా సృష్టిలో భాగమైనా మేధ ద్వారానే/అన్నీ తెలుసుకోగలననుకుంటాడు మానవుడు'. మనిషి స్వాతిశయం మీద తిలక్‌ రాసిన గొప్ప కవిత ఇది! మొన్నమొన్నటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా మనిషి పురోగమనం గురించి మాత్రమే ఆలోచించేవాడు. అయితే కంటికి కనిపించని ఒక చిన్న వైరస్‌ మానవ మనుగడనే అత్యంత ప్రభావితం చేసింది. జీవితాలను కాపాడుకోవడమే పెద్ద సవాల్‌ గా మార్చింది! అప్పుడెప్పుడో తిలక్‌ తన కవితలో ప్రస్తావించిన కలరా వైరస్‌...నేడు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌తో పోల్చదగ్గదే. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా మానవులంతా ఇంట్లోనే కూర్చుండిపోయే పరిస్థితిలోకి నెట్టివేసింది కరోనా. దేశాలకు దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో జనజీవనమంతా స్తంభించింది. కరోనా వైరస్‌ మానవాళిపై దాడి చేసిన మహమ్మారి అయితే...దానికి వ్యవస్థ వైఫల్యాలు తోడవడంతో మహా విపత్తుగా పరిణమించింది. లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకున్నది. దేశాల ఆర్థిక వ్యవస్థలను, జన జీవనాన్ని చిన్నాభిన్నం చేసింది.
నిన్నా మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి కొద్ది రోజులుగా మళ్లీ వేగం పెంచింది. కాస్త తగ్గిందిలే...అని సంబరపడినంత సమయం పట్టలేదు. చాలా దేశాల్లో కరోనా ఫోర్త్‌ వేవ్‌ మొదలుకావడం ఆందోళన కలిగించే విషయం. భారత్‌ లో రోజురోజుకూ పెరుగుతున్న కొత్త కేసులకు తోడు మరో కొత్త రకం వేరియంట్‌ వెలుగు చూడటం కలవరం రేపుతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌...నిర్మూలన కాకపోగా, ఏదోక కొత్త రూపంలో పుట్టుకొస్తూనే వుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,840 కేసులు నమోదు కాగా, 43 మంది మృతి చెందారు. భారత్‌ లో కనీసం 10 రాష్ట్రాల్లో ఈ కొత్తరకం వేరియంట్‌ ను గుర్తించినట్లు ఇజ్రాయిల్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇప్పటివరకూ కరోనాకు సంబంధించిన 85 వేరియంట్లను గుర్తించినట్లు వారు వెల్లడించారు. అధికారిక లెక్కల ప్రకారం... గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ కారణంగా 54 లక్షల మంది మరణించారు. కానీ వాస్తవ మరణాలు ఇంతకు మూడు రెట్లు ఎక్కువని డబ్ల్యుహెచ్‌వో తెలిపింది. కాగా, భారత్‌ చెబుతున్న లెక్కల కంటే కరోనా మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. పాలకులు వివేచనతో నిర్ణయాలు తీసుకునివుంటే... ఇంత పెద్ద ఎత్తున మారణహోమం జరిగివుండేది కాదు. ఎవరి దయాదాక్షిణ్యాల కోసమో భిక్షగాళ్లుగా ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించేది కాదు. ఇవి వర్తమాన చరిత్రలో చెరగని సాక్ష్యాలు. 'ప్రతి మనిషిలో ప్రాణ భీతిని కలిగించావు/ ప్రతి మనిషిలో పరిశుభ్రతను రగిలించావు' అంటాడో కవి. భయాలను వీడి స్వేచ్ఛగా బతుకుతున్న ప్రజలకు...చాప కింద నీరులా విస్తరిస్తున్న కోవిడ్‌ ఫోర్త్‌ వేవ్‌ కలవరపాటుకు గురిచేస్తున్నది. 'ఎవరో వస్తారని, ఏదో చేస్తారని/ ఎదురు చూసి మోసపోకుమా/ నిజము మరచి నిదురపోకుమా' అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఈ వాస్తవికతను ఆచరణాత్మకంగా మలచుకొని...ఊపిరి తీసే కరోనాని ప్రతిఘటించాలన్న సంకల్పాన్ని మనమంతా తీసుకోవాలి. ఈ స్థితిలో ప్రజలంతా అప్రమత్తంగా వుండటంతో పాటు ధైర్యంగా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలి. 'నేటి మన స్వీయ గృహ నిర్బంధమే/ రేపటి మన ఆరోగ్య మహాభాగ్యం' అన్న సత్యం మరువకూడదు. 'అనివార్యమైతే ఆమోదించు' అంటాడు ప్రముఖ రచయిత డేల్‌ కార్నెగి. ఈ అనివార్యతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు, ప్రజలూ సన్నద్ధం కావాల్సిన సమయం ఇది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ప్రజల కర్తవ్యం. కాగా వైద్య ఆరోగ్య వ్యవస్థల్ని సర్వసన్నద్ధం చేయడం ప్రభుత్వాల బాధ్యత.