Oct 13,2023 08:33

జెరూసలెం : మితవాద ప్రధానిగా బెంజిమిన్‌ నెతన్యాహు నేతృత్వంలో యుద్ధ సమయంలో జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రకటించింది. మాజీ రక్షణ మంత్రి, మిలటరీ చీఫ్‌ బెన్నీ గంట్జా, నెతన్యాహుతో కలిసి ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన చేశారు. ఐదుగురు సభ్యులతో' యుద్ధ పరిస్థితుల నిర్వహణా' మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మంత్రివర్గంలో నెతన్యాహు, గాంట్జా, ప్రస్తుత రక్షణ మంత్రి యోవా గలాంట్‌లతో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు పరిశీలక సభ్యులుగా వుంటారు. యుద్ధం కొనసాగుతున్నంత కాలమూ యుద్ధానికి సంబంధించి ఎలాంటి చట్టాలు కానీ, నిర్ణయాలు తీసుకోవడంగానీ ప్రభుత్వం చేయదని ఆ ప్రకటన పేర్కొంది. మితవాద, అతివాద-సాంప్రదాయ పార్టీలతో కలగలిసిన ఈ జాతీయ ఐక్యతా ప్రభుత్వం ఎంతకాలం నిలబడుతుందనేది ప్రశ్నార్థకమే. ఆస్పత్రుల్లో సరఫరాలు తగ్గిపోతుండడం, మరికొన్ని గంటల్లో విద్యుత్‌ సరఫరాలు నిలిచిపోతాయని భావించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

                                                                ప్రారంభమైన 'ఆపరేషన్‌ అజయ్'

ఇజ్రాయిల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం 'ఆపరేషన్‌ అజయ్' పేరుతో తరలింపు ప్రక్రియ గురువారం చేపట్టింది. విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఈ తరలింపు ప్రక్రియను పర్యవేక్షి స్తున్నారు. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశామని, ఇతర ఏర్పాట్లన్నీ జరుగుతున్నా యన్నారు. ఇజ్రాయిల్‌లో 18వేల మంది భారతీయులు వున్నారు. వీరిలో ఐటి ఉద్యోగులు, వజ్రాల వ్యాపారులు, విద్యార్ధులు, కేర్‌ గివర్స్‌గా పనిచేస్తున్నవారు వున్నారు. 'ముందు వచ్చిన వారిని ముందుగా తీసుకెళ్ళడం' అనే పద్దతిపై 230మంది భారతీయులను తీసుకుని గురువారం రాత్రి మొదటి విమానం బయలు దేరింది. భారత్‌కు వచ్చే భారతీయులు టిక్కెట్‌ ఫీజు చెల్లించనక్కరలేదు. భారత ప్రభుత్వమే ఆ ఖర్చును భరిస్తుంది. భారతీయుల భద్రత కోసం ఇజ్రాయిల్‌ అన్ని చర్యలు తీసుకుంటుందని ఇజ్రాయిల్‌లో భారత రాయబారి సంజీవ్‌ సింగ్లా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.