Mar 12,2023 07:56

       ఈగ కథ చాలా మందికి గుర్తుండే వుంటుంది. ఒకరోజు ఇల్లు అలుకుతుండగా, ఈగ తన పేరు మర్చిపోతుంది. తన పేరేమిటో తెలుసుకుందామని పెరట్లోకి వస్తుంది. అక్కడ లేగదూడ ఎదురౌతుంది. దాన్ని ఆపి-'ఛెంగున ఎగిరే లేగమ్మా/ నా పేరేమిటో చెప్పమ్మా' అంటుంది. నాకేం తెలుసు, మా అమ్మనడుగు అంటుంది. ఈగ ఎగురుతూ వెళ్లి ఆవు ముందు వాలుతుంది. 'ఛెంగున ఎగిరే లేగమ్మా/ లేగను కన్నా ఆవమ్మా/ నాపేరేమిటో చెప్పమ్మా' అంటుంది. చివరకు ఎలాగో తెలుసుకుంటుంది. ఈగలాగే ఓ ఇల్లాలూ ఇల్లలుకుతూ తన పేరు మర్చిపోయింది. 'నా పేరేమిటి?' అని తెగ ఆలోచించింది. ఎదురింటి గోడకు వేలాడే నేమ్‌బోర్డులోని పేరులాగే నాకూ ఓ పేరుండాలే అని, తన పిల్లల్ని అడుగుతుంది. భర్తను అడుగుతుంది. తల్లిదండ్రులనూ అడుగుతుంది. తనను ముద్దుగా పిలిచే పేరు తప్ప అసలు పేరేమిటో ఎవరూ చెప్పలేదు. దారిలో కనిపించిన తన చిన్ననాటి స్నేహితురాలు 'శారదా' అని పేరుపెట్టి పిలవడంతో... తన పేరేమిటో తెలుస్తుంది. అలెక్స్‌ హేలీ 'రూట్స్‌'లో తన పూర్వీకుల చరిత్ర తెలుసుకోడానికి పడినంత తాపత్రయం...పి.సత్యవతి రాసిన 'ఇల్లలకగానే పండగౌనా?' కథలోని ఈమె కూడా అంతే తాపత్రయ పడుతుంది. ఇల్లు, పిల్లలు, భర్త సేవలో తలమునకలై... తన అస్తిత్వాన్ని, పేరును కూడా మర్చిపోతుంది. ఇక 'భలే భలే మగాడివోరు' సినిమాలో హీరో మతిమరుపుతో ఎదుర్కొనే సమస్యలు అన్నీఇన్నీ కావు.
          సాధారణంగా నిత్యజీవితంలో ఏదో చెయ్యాలనుకొని మర్చిపోవడం, ఎంతకీ గుర్తురాకపోవడం చాలామంది ఎదుర్కొనే సమస్యే. 'మతి చెడితే గతి చెడుతుంది. గతి చెడితే గమ్యం చెడుతుంది' అన్నది సామెత. మతిమరుపు చాలా రకాలుగా కనిపిస్తుంది. మానసికంగా ఎక్కువ ఇబ్బందులు కలిగిస్తుంది. కూరలో వేసే ఉప్పు దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకూ ఏదీ సక్రమంగా చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి సన్నగిల్లుతుంది. తనవల్ల ఇతరులకు కలిగే ఇబ్బందినీ గుర్తించలేరు. మాట్లాడుతున్నప్పుడు పదాల కోసం వెతుక్కోవడం, చదువుతున్నప్పుడు విషయం అర్థం కాకపోవడం, మాటిమాటికి వస్తువుల కోసం వెతుక్కోవడం, వస్తువులు పోయాయని అంటుండడం, బయటికి వెళ్లినప్పుడు తిరిగి రావడానికి ఇబ్బందిపడటం, క్రమంగా తన సన్నిహితులను సైతం గుర్తించలేకపోవడం వంటివి జరుగుతుంటాయి. తాజాగా దేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు వున్న కోటి మందికి పైగా వృద్ధులు మతిమరుపుతో బాధపడుతున్నారని 'న్యూరో ఎపిడెమియాలజీ' జర్నల్‌ వెల్లడించింది. అమెరికా, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలతో పాటు భారత్‌లోనూ ఈ వ్యాధి అధికంగానే వుంది. 2050 నాటికి దేశంలో 60 ఏళ్లు నిండినవారు మొత్తం దేశ జనాభాలో 19.1 శాతం వుంటారని అంచనా. వృద్ధుల జనాభా పెరుగుదలతో పాటు ఈ వ్యాధి బాధితులు కూడా పెద్ద సంఖ్యలో పెరుగుతారు. ముఖ్యంగా మహిళలు, నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
         మనిషి అంటేనే జ్ఞాపకాల సమాహారం. జ్ఞాపకాల తోడు లేకపోతే జీవితమే మోడువారుతుంది. మన ప్రతి కదలికా, ప్రతి మాటా, ప్రతి పనీ వీటితో ముడిపడే వుంటుంది. అంత కీలకమైన జ్ఞాపకశక్తిని తుడిచిపేట్టేదే మతిమరుపు. వయసు మీద పడుతున్న కొద్దీ ఎంతోకొంత మతిమరుపు సహజమే. అలాగని తేలిగ్గా కొట్టేయడానికి లేదు. 'నిన్నటి దు:ఖం జ్ఞాపకం వుంటేనే, నేటి ఆనందంలో మాధుర్యం గుబాళిస్తుంది' అంటాడో కవి. ఇవేవీ గుర్తే లేనప్పుడు ఇక మాధుర్యం గుబాళించడమనే మాటే వుండదు. ఇప్పటి జీవనశైలిలో వృద్ధులకే కాదు... పిల్లలకు, యువతకు సైతం మతిమరుపు ఒక జాడ్యంలా మారింది. జన్యుపరంగా కొందరికి త్వరగా రావొచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలతో పాటు యువతలోనూ కనిపిస్తోంది. అధిక ఒత్తిడే దీనికి కారణమంటున్నారు నిపుణులు. అయితే, జీవనశైలి మార్పులతో కొంతవరకు దీన్ని అధిగమించొచ్చు. సంగీతం వినిపించడం, పుస్తక పఠనం, రాయడం, బొమ్మలు గీయడం, ఆటలు ఆడటం, పజిళ్లు పూరించడం వంటివి మెదడును చురుగ్గా వుంచుతాయి, ఆలోచింపజేస్తాయి. దీనివల్ల మతిమరుపు మన దరి చేరదు. ఒక బలహీనత నుంచి మనం పారిపోలేనప్పుడు... నిలుచున్న చోటు నుంచే దానిని ఎదిరించాలి.