Sep 28,2022 07:05

రాష్ట్రంలో అడవుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధపడటం ఆహ్వానించదగ్గ పరిణామం. తాజాగా రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది అటవీ డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అడవుల పెంపు, పర్యవేక్షణ, పరిరక్షణ మరింత సులభమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఒకప్పుడు రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లాలో ఒకటిగా ఉన్న పశ్చిమ గోదావరి (భీమవరం జిల్లా కేంద్రం) పునర్విభజన పుణ్యమా అని అడవులు లేని జిల్లాగా రికార్డుల కెక్కింది. ఈ జిల్లాలో కూడా రక్షిత అటవీ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక అటవీ డివిజన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అదే సమయంలో నిరుపయోగంగా మారిన ఆరు డివిజన్లను మూసివేయనుంది. రాష్ట్రంలో అటవీ డివిజన్లతో పాటు, సిబ్బందిని కూడా పెంచాలని గతంలోనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ దిశలో ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. తాజాగా జిల్లాల పునర్‌విభజనతో పరిపాలనాపరమైన సమస్యలు కూడా ముందుకు రావడం, సీనియర్‌ అధికారులు కూడా ఈ మేరకు సిఫార్సులు చేయడం, అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా 2030 నాటికి అడవుల విస్తీర్ణాన్ని తప్పనిసరిగా పెంచాల్సి ఉండటంతో ఈ దిశలో చర్యలు అనివార్యమైనాయి.
          కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్టు (ఐఎస్‌ఎఫ్‌ఆర్‌)-2021 ప్రకారం కూడా 647 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. మన తరువాతి స్థానంలో తెలంగాణ (632 చ.కిమీ) ఒడిషా (537 చ.కిమీ)లు వరుసగా ఉన్నాయి. అదే సమయంలో ఈ లెక్కల్లోని వాస్తవికతపై వ్యక్తమవుతున్న అనుమానాలను కూడా కొట్టిపారేయలేం. రాష్ట్రంలో ఒకదాని తరువాత ఒకటిగా ఆవిష్కృతమవుతున్న దృశ్యాలు ఈ సందేహాలనే బలపరుస్తున్నాయి. దట్టమైన అడవికి, అక్కడ విస్తరించిన జీవావరణానికి పెద్దపులిని సాక్ష్యంగా చెబుతారు. ఇటీవల కాలంలో పులులు, చిరుత పులులు కూడా జనావాసాలపై పడటం చూశాం. ఏనుగులు, ఎలుగుబంట్లు పొలాల్లోకి, గ్రామాలపైకి రావడం సాధారణ విషయంగా మారిపోయింది. విచ్చలవిడిగా అడవులు నరికేయడంతో వాటినే ఆవాసంగా చేసుకుని బతికే ఒకరకమైన చీమలు ఊళ్లపై దండయాత్ర చేస్తున్న సంఘటనలు కొన్ని నెలల క్రితం తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చాయి. తాజాగా మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోనూ చీమల దాడితో జనం బెంబేలెత్తుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అడవి పచ్చగా ఉంటే, వన్యప్రాణులు గ్రామాలపై పడిన సంఘటనలు గతంలో చూశామా ?
         సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సిఎస్‌ఇ) చేసిన అధ్యయనం ప్రకారం దేశ వ్యాప్తంగా 25.87 మిలియన్‌ హెక్టార్ల (6.39 కోట్ల ఎకరాలు) నమోదైన అటవీ భూమి (రికార్డెడ్‌ ఫారెస్ట్‌ ఏరియా-ఆర్‌ఎఫ్‌ఎ) మాయమైంది. ఇది దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ విస్తీర్ణంతో దాదాపు సమానం! తెలుగు రాష్ట్రాలతో పాట దేశ వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరిగిందంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ఆధారంగానే సిఎస్‌ఇ ఈ నిర్ధారణ చేయడం గమనార్హం. ఇలా మాయమైన రికార్డెడ్‌ ఫారెస్ట్‌ ఏరియా మన రాష్ట్రంలో 13,01,900 హెక్టార్లు! అంటే రాష్ట్రంలోని మొత్తం ఆర్‌ఎఫ్‌ఎలో ఇది సుమారుగా 35 శాతం! వివిధ పేర్లతో కొన్ని సంవత్సరాలుగా చేపడుతున్న చెట్లను పెంచే కార్యక్రమాల ద్వారా విస్తరించిన హరిత ప్రాంతాన్ని కూడా అడవులుగా గణించడం వల్ల అటవీ విస్తీర్ణం పెరుగుతున్నట్లు చూపుతున్నారని ఆ అధ్యయన సారాంశం! ఈ తరహా జిమ్మిక్కుల వల్ల కాగితాలపై అడవుల విస్తీర్ణం పెరగవచ్చు కానీ, పర్యావరణ, జీవావరణ పరిరక్షణ వంటి లక్ష్యాలు నెరవేరవు. వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించడం, తద్వారా భూతాపాన్ని నియంత్రించడం వంటి అంశాలు ఆచరణకు ఆమడ దూరంలోనే మిగులుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన అటవీ చట్టంలోని సవరణలు ఆచరణలో కార్పొరేట్లకు అడవులను కట్టబెట్టడానికే ఉపయోగపడతాయి. రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేసేది అవే విధానాలు కావడంతో నిజమైన పరిరక్షణ ప్రశ్నార్ధకంగా మారింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాలనాపరమైన కార్యక్రమాలతో పాటు, గిరి బిడ్డలకు అడవులపై హక్కులను దఖలు పరచాలి. వారిపై విధించిన అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలి. అప్పుడే వన సంపద నిజమైన జాతి సంపదగా మారుతుంది ! మానవాళి రక్షణకు దోహదపడుతుంది.