May 10,2023 07:29

ప్రస్తుత చట్ట సవరణ బిల్లును ఆదివాసీల, సాంప్రదాయ అటవీ వాసుల హక్కులపై మరో దాడిగా చూడాలి. వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి కర్బన ఉద్గారాలను తగ్గించుకునేందుకు మరిన్ని అడవులను పెంచాలనే లక్ష్యానికి ఇది పూర్తి భిన్నంగా ఉంది. కర్బన ఉద్గారాలను ఇటువంటి ఏకపక్ష, అవాస్తవిక లక్ష్యాలతో సాధించలేరు.

పార్లమెంట్‌లో ప్రతిపక్షాల జోక్యాన్ని అధికార పార్టీ అడ్డుకోవడమే కాదు, తాను కోరుకున్న బిల్లులను ఎలాంటి చర్చ లేకుండా ఆమోదింపజేసుకుంది. అటవీ సంరక్షణ చట్టం (ఎఫ్‌సిఎ)-1980 సవరణ బిల్లు విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించింది. పార్లమెంటరీ సాంప్రదాయాలను, నిబంధనలను బిజెపి ప్రభుత్వం ఎలా బుల్డోజ్‌ చేస్తున్నదీ తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ.
      ఈ బిల్లు ఆందోళన కలిగిస్తున్నది. తమ ప్రాంతంలో చేపట్టే ఏ ప్రాజెక్టుకైనా ఆయా గ్రామ సభల ఆమోదం లేకుండా చేపట్టరాదన్నది రాజ్యాంగం ప్రసాదించిన చట్టబద్ధ్ద హక్కు. ఆ హక్కును కాలరాసేందుకు ఎం.ఒ.ఇ.ఎఫ్‌.సి.సి ద్వారా ఎఫ్‌సిఎ రూల్స్‌-2003 సవరణలను మోడీ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఎంఒఇఎఫ్‌సిసిలో అత్యంత అభ్యంతరకరమైన నిబంధనలు అనేకం ఉన్నాయి. అటవీ భూములను ఇతర అవసరాల కోసం యథేచ్ఛగా మళ్లించేందుకు అడ్డుగా ఉన్న నిబంధనలకు తూట్లు పొడిచింది. సంరక్షణ ముసుగులో అడవులను ప్రైవేట్‌పరం చేయడం, వాటి నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కుదించి, కేంద్రానికి మరిన్ని అధికారాలను దఖలు పరిచేలా చట్టానికి సవరణలు ప్రతిపాదించారు. అడవులను వాణిజ్యపరమైన అవసరాలకు ఉపయోగించేందుకు, ప్రైవేటు తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఈ అటవీకరణ పథకాన్ని ముందుకు తెచ్చారు. ఈ చట్ట సవరణలను సిపిఐ(ఎం) వ్యతిరేకిస్తున్నది. ఈ మేరకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు ఒక మెమోరాండాన్ని సమర్పించింది. రాజ్యసభ సభ్యుడు ఎలమరం కరీం ఈ ప్రతిపాదిత సవరణలను రద్దుచేయాలని కోరుతూ సభలో చట్టబద్ధ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని అనుమతించినప్పటికీ చర్చకు అవకాశమివ్వలేదు.
        ప్రస్తుత చట్ట సవరణ బిల్లును ఆదివాసీల, సాంప్రదాయ అటవీ వాసుల హక్కులపై మరో దాడిగా చూడాలి. వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి కర్బన ఉద్గారాలను తగ్గించుకునేందుకు మరిన్ని అడవులను పెంచాలనే లక్ష్యానికి ఇది పూర్తి భిన్నంగా ఉంది. కర్బన ఉద్గారాలను ఇటువంటి ఏకపక్ష, అవాస్తవిక లక్ష్యాలతో సాధించలేరు.
 

                                                     ఎవరి 'ఆర్థిక అవసరాల' కోసం..?

ఈ బిల్లు ముందుమాటలో 'ఆర్థిక అవసరాలు' ప్రస్తావన ఉంది. 'అడవుల పరిరక్షణా నిర్వహణ, అడవుల పునరుద్ధరణ, పర్యావరణ రక్షణను కొనసాగించటం, అడవుల సాంస్కృతిక, సాంప్రదాయ విలువలను నిలబెట్టేందుకు అవసరమైన చట్టబద్ధ నిబంధనలను సమకూర్చుకోవాలి.'' ఇదే బిల్లు సారాంశం. ఇంతకీ ఎవరి ఆర్థిక అవసరాలు నెరవేర్చాలి? ఈ పేరుతో ప్రతిపాదిత సవరణల ద్వారా ప్రభుత్వం ప్రాజెక్టుల జాబితాను విస్తరిస్తున్నది. అటవీ రక్షణ చట్టం నియంత్రణ చట్టానికి అనుగుణంగా మినహాయించిన భూముల జాబితాను కూడా పెంచుతున్నది. 2008-2009 మధ్య కాలంలో, 2.53 లక్షల హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టుల కోసం మళ్లించడం జరిగిందని రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ మళ్లింపును చట్టబద్ధం చేయటమే ఈ బిల్లు ఉద్దేశ్యం.
 

                                               ఎఫ్‌ఆర్‌ఎ, పెసా (పిఇఎస్‌ఎ) ప్రస్తావనే లేదు.

గిరిజన ప్రజానీకం, సాంప్రదాయ అటవీ వాసుల రక్షణకు ఉద్దేశించిన ఇతర చట్టాలు, రాజ్యాంగబద్ధ గ్యారంటీలు వున్నాయి. అయితే ఇవేవీ ఆ బిల్లులో ప్రస్తావనకు రాలేదు. బిల్లు ముందుమాట ఇలా ప్రస్తావిస్తున్నది: 'అడవిపై ఆధారపడిన ప్రజానీకం పురోభివృద్ధితోపాటు, అటవీ ఆధారిత ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రయోజనాలను మెరుగుపరచాలి.'' సవరణల బిల్లు మూలంలో దీని ఊసే లేదు. ''సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు, జీవన పరిస్థితుల అభివృద్ధి''కి ఆ చట్టాలు హామీనిస్తున్నాయి. ఈ బిల్లు ఆ చట్టాల ఉల్లంఘనకు దారి తీస్తుంది.
 

                                                    మినహాయింపుల ద్వారా సరళీకరణ

మినహాయింపు అంటే... ప్రాజెక్టులకు ఆటోమాటిక్‌గా అనుమతులు మంజూరు చేయటం. అందుకు 'పర్యావరణ ప్రభావాలపై అంచనాలు, అటవీ హక్కుల చట్టం', ఎఫ్‌ఆర్‌ఎ, పెసా, డబ్ల్యు.ఎల్‌.పి.ఎ (2006 సంరణలతో)లతో నిమిత్తం లేకుండా సదరు అనుమతులను ఇవ్వాలి. కానీ, ఆయా ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టుకైనా గ్రామ సభల అనుమతి తప్పనిసరిగా అవసరమని పై చట్టాలు నిర్దేశిస్తున్నాయి.
      ఏ భూములకు, ఏ తరహా ప్రాజెక్టులకు మినహాయింపు ఇవ్వాలన్న వివరాలను క్లాజు 1ఎ (1), (2) లలో వివరంగా పొందుపరిచారు. (1)లో, 1996కి ముందు ప్రారంభించిన ప్రాజెక్టులకు, అన్ని అటవీ భూముల మళ్లింపులకు చట్టం నుండి మినహాయింపులిచ్చారు. చాలా ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్రాజెక్టులన్నింటికీ ఈ మినహాయింపు వర్తిస్తుందన్న తార్కిక వాదనలకు ఇది దారితీయవచ్చు. వాస్తవానికి, అటవీ హక్కుల చట్టం ఆమోదం పొందాక అలాంటి భూమి అంతా అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ) పరిధిలోకి వచ్చింది. ఆదివాసీలు, ఇతర సాంప్రదాయ అటవీ వాసులందరి హక్కులు పరిరక్షిస్తున్నాయి. 1996కి ముందరి ప్రాజెక్టులకు ఉన్నాయని చెప్పబడుతున్న హక్కులను ఎఫ్‌ఆర్‌ఎ ఇప్పటికీ గుర్తించటం లేదు. అందుకు అనేక ఉదాహరణలను పేర్కొనవచ్చు. ఎఫ్‌ఆర్‌ఎ, ఎఫ్‌సిఎల పరిధి నుండి అలాంటి ప్రాజెక్టులను తొలగించేందుకు ప్రస్తుత సవరణ బిల్లు 'అడవి'ని పునర్నిర్వచించేందుకు పూనుకుంది. అలాంటి ప్రాజెక్టులకు మినహాయింపు ఇవ్వటమంటే, భూ హక్కును కోల్పోతున్న బాధితుల ప్రస్తావన లేకుండానే, 'భూమి వినియోగం' ఆటోమాటిక్‌గా మారిపోతుందని అర్ధం.
         సెక్షన్‌ (2)లో.. పలు విభాగాల అటవీ భూమి మినహాయించబడింది. దానితో అటవీ భూమిలో పెద్ద భాగం ప్రభావితమౌతుంది. తద్వారా ఆదివాసులు, ఇతర అటవీ వాసుల హక్కులను పెకలించి వేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఉదాహరణకు, సరిహద్దుల నుండి 100 కిలోమీటర్ల వరకూ అటవీ భూమి ఎఫ్‌సిఎ ఆంక్షల నుండి మినహాయించారు. 13 లక్షల చదరపు కి.మీ (సుమారు 40 శాతం) భూ విస్తీర్ణంలో గణనీయమైన భాగం అటవీ భూమి నుంచి మినహాయింపు ఉందని పలువురు పరిసరాల పరిశీలనా శాస్త్రజ్ఞులు (ఎకాలజిస్టు), నిపుణుల అంచనా. ఈ మినహాయింపులన్నీ వ్యూహాత్మకమై 'జాతీయ ప్రాధాన్యతగల ప్రాజెక్టులు' లేదా 'రక్షణ సంబంధిత ప్రాజెక్టులు'' లేదా ''ప్రజా వినిమయ ప్రాజెక్టులు'' కోసమే. ఈ నిబంధన చట్టం నిషేధించని ఏ పనినైనా చేసేందుకు ట్రస్టీలకు అధికారం ఇస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకుని మినహాయింపులకు అర్హమైన దేన్నైనా, ప్రతి దాన్నీ ప్రైవేట్‌ ప్రాజెక్టులు తమ వశం చేసుకుంటాయి. అంతేగాక, 'జాతీయ ప్రాధాన్యత' లేదా 'ప్రజా ప్రయోజనం' వంటి పదాలు ప్రభుత్వ యాజమాన్యానికి మాత్రమే సూచికలు కావు. అందుకు భిన్నంగా, అవి కార్పొరేట్ల యాజమాన్యంలోని ప్రైవేటు సంస్థలకు కూడా వర్తిస్తాయి. రక్షణ రంగంతో సహా వ్యూహాత్మక రంగాలను వీటి పరం చేయాలన్నది ప్రభుత్వ విధానం. దాని ఉప సిద్ధాంతంగానే, ఎఫ్‌సిఎ ఆంక్షల పరిధిలో మినహాయింపులను ప్రతిపాదించారు. ప్రైవేటు పెట్టుబడికి ప్రోత్సాహకాల రూపంలోనే ఈ మినహాయింపులున్నాయి. ఈ మినహాయింపులు, అటవీ హక్కుల చట్టం తదితర చట్టాలన్నింటినీ ఉల్లఘిస్తున్నాయి. అవి అటవీ వాసులు ప్రధానంగా ఆదివాసీల హక్కులు, జీవనాలపై నేరుగా ప్రభావం చూపుతాయి.
        ఈ మినహాయింపులు 'అడవిలో చెట్లు తొలగించినచోట తిరిగి చెట్లు నాటే (రిఫారెస్టేషన్‌) ప్రాంతాన్ని (ప్రభుత్వ భూమి లేదా ప్రభుత్వ రికార్డుల్లోని భూమి) నిర్దిష్టంగా పేర్కొనలేదు. ఆ నిబంధన ప్రైవేటు అడవులకు ఉన్నత స్థానం కల్పించేందుకే ఉద్దేశించబడిందనేది స్పష్టం.
 

                                                                అధికార కేంద్రీకరణ

దేశంలో అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం వద్ద కేంద్రీకృతమౌతున్నాయి. ప్రధాన చట్టంలోని 2వ సెక్షన్‌కు తీసుకొస్తున్న మరో సవరణ ఈ అధికార కేంద్రీకరణను పునరావృతం చేస్తున్నది. ఇది ''అడవుల రక్షణకు ఉద్దేశించిన రిజర్వేషన్లను ఎత్తేయటం, లేదా అటవీ భూములను అటవీయేతర అవసరాలకు వినియోగించటంపై ఆంక్షలు.''కు సంబంధించినది. మినహాయింపుల విస్తరణ జాబితాలో 'అటవీ యేతర అవసరాలు', ఎకో (పరిసరాలను పరిశీలించే శాస్ట్రం) టూరిజాన్ని, ప్రైవేటు సఫారీ (అడవుల్లో జంతువుల వేట)ను చేర్చేందుకు, లేదా 'కేంద్ర ప్రభుత్వం భవిష్యత్‌లో స్పష్టంగా నిర్దేశించుకోనున్న ఇతర అవసరాలు' కూడా ఉంటాయి. సవరణ (2)లో, కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను ప్రకటించవచ్చు. ఆ కార్యక్రమాల్లో ఖనిజ నిక్షేపాలున్న ప్రదేశాల అన్వేషణ, గనుల తవ్వకాలను 'అటవీ యేతర అవసరాల' జాబితా ప్రకటన నుండి మినహాయించాలి. షరతులను కూడా నిర్ణయించాలి.
 

                                                            కేంద్ర ప్రభుత్వ మోసకారితనం

కేంద్ర ప్రభుత్వ మోసకారితనానికి ఈ బిల్లు ఒక మచ్చుతునక. ఇది అటవీ భూముల మళ్లింపును, గిరిజన హక్కులపై దాడులను చట్టబద్ధం చేస్తున్నది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 'జాతీయంగా నిర్ణయించిన సహకారాల' (ఎన్‌డిసి) అమలుకు భారత్‌ అంకితమౌతుందన్న ముసుగులో ప్రభుత్వంపై ఈ చర్యలకు తెగబడుతున్నది. ముందుమాట లోని వాదనలు, బిల్లులో ప్రతిపాదిత వాస్తవ సవరణలు పరస్పర వైరుధ్యపూరితంగా ఉన్నాయి.
        ''2030 నాటికి 2.5 నుండి 3 బిలియన్‌ టన్నుల అదనపు కర్బన సింక్‌ను (సిఒ2 సింక్‌) సృష్టించనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి అడవులను, చెట్ల విస్తీర్ణాన్ని మూడో వంతు భూమి విస్తీర్ణానికి పెంచుతామని ఘనంగా చెప్పింది. కానీ, మినహాయింపులతో ఆ లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమా ?
         2021 ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ) నివేదిక ప్రకారం భూ విస్తీర్ణంలో అటవీ ప్రాంతం 21.7 శాతం గాను, చెట్ల విస్తీర్ణం 2.9 శాతంగాను ఉన్నాయి. రెండూ కలసి భూ విస్తీర్ణంలో, మొత్తం 24.7 శాతం మాత్రమే. ఈ అంచనా కూడా అతిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కారణం ఆ విస్తర్ణంలో టీ తోటలు, పండ్ల తోటలు, ఎడారి పొదలనూ అటవీ ప్రాంతాలుగా చూపారు. అధికార అంచనాలను పరిగణనలోకి తీసుకున్నా, సమ సంయోగ యోగ్యతగల 'కర్బనపు సింకు' సృష్టికి అవసరమైన చెట్లను నాటేందుకు ఎంత భూమి అవసరమౌతుంది ?
        ఎఫ్‌ఎస్‌ఐ 2021 నివేదిక ప్రకారం.. అటవీ ప్రాంతంలో 60 శాతం, దట్టమైన అడవుల్లో 73 శాతం 218 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిని గిరిజన జిల్లాలుగా వర్గీకరించారు. అవి ఈశాన్య, తూర్పు, మధ్య భారతంలో ఉన్నాయి. ఆ ప్రాంతాలు, భారత రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్ల ద్వారా ప్రత్యేక రక్షిత ప్రాంతాల కింద నమోదయ్యాయి. వాటిలో అనేక జిల్లాలు సంపద్వంతమైన ఖనిజాలు, నీటి వనరులకు కూడా నెలవుగా ఉన్నాయి. అందుకే ఈ జిల్లాల్లో గనులు, విద్యుత్‌, జలవనరుల ప్రాజెక్టులకు అటవీ భూములు ఎక్కువగా మళ్లించబడ్డాయి.
 

                                                  ఈ ప్రమాదకరమైన బిల్లును వ్యతిరేకించాలి

మొత్తం మీద అడవులను ప్రైవేటీకరించే ఒక పెద్ద పథకంలో భాగమే ఇదంతా. 1. ఎఫ్‌సిఎ, ఎఫ్‌ఆర్‌ఎ (అడవుల సంరక్షణ బిల్లు పార్లమెంటు ముందున్నది ( అటవీ భూముల పరిధి కింద ఉన్న భూములను తిరిగి నిర్వచించే ప్రక్రియను ఇప్పటికే ఎంఒఇఎఫ్‌సిసి రాష్ట్ర అధికారులు చేపట్టారు. గుర్తింపు కలిగిన అటవీ భూములను సమీక్షించాలని కూడా ఇది కోరుతోంది). పరిధి నుండి ఈ అటవీ భూమిని బయటకు తీసుకొచ్చేందుకు యత్నించడం. దానికి అనుగుణంగా అడవులను పునర్నిర్వచించాలని చెబుతోంది. 2. అటవీ పాలనా నిర్వహణలో అటవీశాఖ ఉన్నతాధికారులు, అటవీ మాఫియా, కార్పోరేట్లకు మరింత పట్టు కల్పించేలా వీటిని పునర్నిర్మించడం లేదా. అవసరమైతే వెనక్కు మళ్లించడం చేయాలని అంటున్నది. 3. ఎఫ్‌ఆర్‌ఎ, పెసా, గ్రామ సభల అధికారాలను కుదించడం ద్వారా ప్రజాతంత్రయుత అటవీ పాలనా నిర్వహణను దెబ్బతీయాలని చూస్తున్నది.
       ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బిల్లు, గిరిజనుల హక్కులపై పరోక్ష యుద్ధాన్ని ప్రకటించడమే. ఎఫ్‌సిఎ సవరణ బిల్లు వారి అంబుల పొదిలో మరో ఆయుధం. అందుకే దీన్ని వ్యతిరేకించాలి.

వ్యాస రచయిత - సిపిఎం పౌలిట్‌ బ్యూరో సభ్యురాలు
బృందాకరత్‌

బృందాకరత్‌