Jan 10,2023 07:41

ఈ విదేశీ వాణిజ్య చెల్లింపుల లోటు పెరగడంతో అది దేశంలో వడ్డీరేట్ల పెరుగుదలకు దారి తీస్తుంది. మన వాణిజ్య చెల్లింపుల లోటును తగ్గించుకోవాలంటే మరింతగా విదేశీ పెట్టుబడులను మన దేశానికి ఆకర్షించాలి. మరోపక్క దేశీయ డిమాండ్‌ ను పెరగనివ్వకుండా అరికట్టాలి. ఇంకోపక్క పడిపోతున్న రూపాయి మారకపు విలువ ఇక్కడ ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీయకుండా నిరోధించాలి. ఇవన్నీ నెరవేరాలంటే నయా ఉదారవాదం దగ్గర ఒక్కటే మందు ఉంది. మాంద్యాన్ని పెంచడం, నిరుద్యోగాన్ని పెంచడం. దీనినే మరింత ఉధృతంగా ఇక్కడ పాటిస్తారు. దాని ఫలితంగా వృద్ధిరేటు మరింతగా పడిపోతుంది. ఒకపక్క ఆర్థిక వ్యవస్థలో మాంద్యం, మరోపక్క విదేశీ చెల్లింపుల లోటు రెండూ పెరగడం మన ఆర్థిక వ్యవస్థకు మరింత చెడ్డ రోజులు దాపురించనున్నాయని సూచిస్తోంది.

భారత దేశపు విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు 2022 జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి 36.4 బిలియన్ల డాలర్లకు చేరింది. ఇది మన జిడిపిలో 4.4 శాతం. గత తొమ్మిది సంవత్సరాలలో ఇదే అత్యధిక లోటు. 2012 అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో 32.6 బిలియన్ల లోటు ఉంది. అది అప్పటి మన జిడిపిలో 6.7 శాతం. 2022 ఏప్రిల్‌-జూన్‌ కాలానికి 18.2 బిలియన్లు (జిడిపిలో 2.2 శాతం) ఉన్న లోటు ఆ తర్వాత త్రైమాసికానికి రెట్టింపు అయిపోయింది. అదే ఏడాది క్రితం చూస్తే, 2021 జులై-సెప్టెంబర్‌ కాలంలో 9.7 బిలియన్లు (జిడిపిలో 1.3 శాతం) ఉన్న లోటు ఏడాది తిరిగేసరికి మూడు రెట్లు కన్నా ఎక్కువగా పెరిగింది.
          విదేశీ వ్యాపార చెల్లింపులో లోటు పరిమాణం పెరిగిపోవడం ఒక్కటే సమస్య కాదు. ఈ విషయంలో ఆందోళన చెందవలసిన అంశాలు ఇతరత్రా కూడా ఉన్నాయి. గత త్రైమాసికానికన్నా ఈ మూడు నెలల కాలంలో ఒక్కసారి ఏకంగా 18.2 బిలియన్లు పెరిగిపోవడం వెనక ప్రధాన కారణం సరుకుల వ్యాపారంలో పెరిగిపోయిన లోటు. అంటే మనం దిగుమతి చేసుకునే సరుకులకు చెల్లించవలసినదాని కన్నా ఎగుమతుల ద్వారా ఆర్జించినది ఈ మూడు నెలల్లోనే 18.2 బిలియన్ల మేరకు తక్కువగా ఉందన్నమాట. సరుకుల ఎగుమతుల విలువకు, దిగుమతుల విలువకు మధ్య తేడా 63 బిలియన్ల నుండి 83.5 బిలియన్లకు పెరిగింది. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగిపోయినందు వలన మనం దిగుమతి చేసుకునే ముడి చమురు బిల్లు పెరిగిపోయింది. ఇది మొదటి కారణం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తంగానే మందగించినందు వలన మన ఎగుమతులు మరీ చప్పబడిపోయి తగ్గిపోయాయి. దీనివలన ఎగుమతుల ద్వారా రావలసిన ఆదాయం తగ్గింది. ఇది రెండో కారణం.
            రూపాయి డాలరుతో పోల్చితే బలహీనపడిపోవడం ముఖ్య కారణం అని కొందరు ఆర్థికరంగ వ్యాఖ్యాతలు అంటున్నారు. ఈ వాదన తప్పు. వాస్తవానికి మన రూపాయి విలువ తగ్గితే దానివలన వాణిజ్య లోటు తగ్గాలి (రూపాయి విలువ పడిపోతే అప్పుడు దిగుమతుల ఖరీదు పెరుగుతుంది. ఆ కారణంగా దిగుమతులు తగ్గిపోతాయి. అప్పుడు వాణిజ్య లోటు తగ్గుతుంది.). ఆ వ్యాఖ్యాతలు మన దేశీయ డిమాండ్‌ బాగా పెరిగినందువలన దిగుమతులు పెరిగాయని, అందువలన వాణిజ్య లోటు పెరిగిందని రెండో కారణంగా చూపుతున్నారు. కాని అంత స్పష్టంగా మన దేశీయ డిమాండ్‌ పెరిగిపోయిన దాఖలాలు ఏమీ లేవు. నిజానికి ఈ కాలంలో మన జిడిపి పెరుగుదల బాగా తక్కువగా ఉంది. అందుచేత దేశీయ డిమాండ్‌ పెరిగిపోయిందని చెప్పడం అవాస్తవమే అవుతుంది.
           మన వాణిజ్య లోటు పెరగడానికి ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఒక కారణంగా రిజర్వు బ్యాంకు చూపుతోంది. ఈ యుద్ధం అంత త్వరగా ముగిసిపోయే వ్యవహారం కాదు. అదేదో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో వచ్చిన వివాదం వంటిది కాదు. సామ్రాజ్యవాదం ప్రపంచం మీద పట్టు బిగించాలన్న ప్రయత్నంలో భాగంగా దీనిని చూడాలి. అందుచేత ఆ యుద్ధాన్ని తొందరగా పరిష్కరించడానికి చేసే ప్రయత్నాలను సామ్రాజ్యవాదం ముందుకు సాగనివ్వదు. ఇక ద్రవ్యోల్బణం పెరగడం అనేది ఈ యుద్ధానికన్నా ముందే మొదలైన ధోరణి. అది సంపన్న పెట్టుబడిదారీ దేశాల ఆర్థిక వ్యవస్థలమీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. దానినుండి బైట పడడానికి ఆ దేశాలు ఆర్థిక మాంద్యాన్ని, నిరుద్యోగాన్ని పెంచడం మార్గంగా ఎంచుకున్నారు. అందుచేత ఈ ద్రవ్యోల్బణం నుండి బైట పడడానికి కూడా ఎక్కువ కాలమే పడుతుంది. అంటే, 2022 జులై-సెప్టెంబర్‌ లో కనిపించిన ఈ విదేశీ వాణిజ్య చెల్లింపుల లోటు అనేది మరికొంతకాలం పాటు కొనసాగుతుంది.
           మన రూపాయి మారకపు విలువ 2022లో చాలా వేగంగా పడిపోయింది. దాదాపు 10 శాతం పడిపోయింది. మామూలుగానైతే ఈ విధంగా రూపాయి మారకపు రేటు పడిపోతే విదేశీ చెల్లింపుల లోటు తగ్గుతుంది. కాని ఆ విధంగా జరగడానికి కొంత కాలం పడుతుంది. అందుచేత ఇప్పుడు ఒకపక్క వాణిజ్య లోటు పెరుగుతూ, మరోవైపు రూపాయి మారకపు రేటు పడిపోతూ వుండడం అనే రెండు ధోరణులు ఏకకాలంలో కొన్నాళ్ళు కొనసాగనున్నాయి. భారీగా విదేశీ చెల్లింపుల లోటు పెరగగానే మార్కెట్‌లో మదుపుదారులు రూపాయి మారకం రేటు త్వరలో తగ్గబోతోందని అంచనాలకు వస్తారు. దాని ఫలితంగా మామూలుగా తగ్గేదానికన్నా ఎక్కువ స్థాయిలో రూపాయి మారకపు రేటు తగ్గిపోవడం మొదలౌతుంది. అందువలన ఇక్కడ ఉన్న ద్రవ్య పెట్టుబడులు బైటకు తరలిపోవడం పెరుగుతుంది. అది లోటును మరింత పెంచుతుంది. ఆ తర్వాత రూపాయి మారకపు రేటు తగ్గిన కారణంగా విదేశీ చెల్లింపుల లోటు తగ్గడం అనేది ఏ మోతాదులో జరిగినప్పటికీ, దాని ప్రభావం లోటును పెద్దగా తగ్గించేదిగా ఉండదు. అటువంటప్పుడు మన రూపాయి మారకపు రేటు నిరంతరాయంగా పడిపోయే దశలోకి మనం అడుగు పెడతాం (ఇప్పటికే ఆసియా దేశాల కరెన్సీలలోకెల్లా అత్యంత బలహీనమైనవాటిలో ఒకటిగా మన రూపాయి ఉంది.). అదే గనుక జరిగితే మనం అదుపు తప్పిన ద్రవ్యోల్బణం చెలరేగే పరిస్థితులను చవిచూడవలసి వస్తుంది.
           మన దగ్గర విదేశీ మారకపు నిల్వలు భారీగానే ఉన్నాయి గనుక ఈ పరిస్థితిని ఏదోవిధంగా తట్టుకుని నిలబడగలుగుతాం అని అనుకోడానికి లేదు. రూపాయి మారకపు విలువ పడిపోకుండా నిలబెట్టడానికి రిజర్వుబ్యాంకు తనవద్ద ఉన్న డాలరు నిల్వలను ఇప్పటివరకూ దాదాపు 100 బిలియన్ల మేరకు ఖర్చు చేసింది. అయినా రూపాయి మారకపు రేటు పడిపోవడం ఆగలేదు. 2022 జులై-సెప్టెంబర్‌ మూడు నెలల కాలంలోనే 25 బిలియన్ల డాలర్ల మేరకు మన విదేశీ నిల్వలు కరిగిపోయాయి. దీనిని బట్టి మన డాలరు నిల్వలను మార్కెట్‌ లోకి అదనంగా విడుదల చేసినంత మాత్రాన రూపాయి మారకపు విలువ పడిపోకుండా ఆపలేము అని స్పష్టం ఔతున్నది. అంతేకాదు. ఇలా అదనంగా విడుదల చేయడం వలన స్పెక్యులేటర్లలో మన రూపాయి మారకపు విలువ మరింత పడిపోనుంది అన్న అంచనాకు బలం పెరుగుతుంది. అందుచేత మనదగ్గర డాలరు నిల్వలు ఎక్కువగా ఉన్నంతమాత్రాన మన విదేశీ చెల్లింపుల లోటును పెరిగిపోకుండా ఆపలేము అని బోధపడుతోంది.
            ఇక మూడో అంశం: ఈ లోటు పెరిగిపోవడం అన్నది మన దేశ జిడిపి వృద్ధిరేటు బాగా తక్కువగా ఉన్న సమయంలో సంభవించింది. 2021-22 ఆర్థిక సంవత్సరపు మొదటి మూడు నెలల కాలం నాటి వృద్ధిరేటు తో పోల్చితే 2022-23 ఆర్థిక సంవత్సరపు మొదటి మూడు నెలల కాలంలో వృద్ధిరేటు 13.5 శాతంగా నమోదైంది. కోవిడ్‌ అనంతర కాలంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్నట్టు ఇది తెలియజేస్తోంది. ఐతే రెండో త్రైమాసిక కాలం (జులై-సెప్టెంబర్‌) పోల్చి చూస్తే వృద్ధిరేటు కేవలం 6.3 శాతమే ఉంది. ఉత్పత్తిలో వాస్తవ వృద్ధిని సూచించే స్థూల అదనపు సంపద (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌) లో వృద్ధి ఇంకా తక్కువగా, 5.6 శాతమే ఉంది. దీనికి కారణం సరుకుల ఉత్పత్తి రంగం (మాన్యుఫాక్చరింగ్‌)లో వృద్ధి మందగించడమే. ఈ రంగంలో మందగమనం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇప్పుడు విదేశీ చెల్లింపుల లోటు పెరగడంతో (ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరగడంతో) ఈ సరుకుల ఉత్పత్తి రంగంలోని మందగమనం ఇంకా పెరగనుంది. ఒకపక్క వృద్ధిరేటు తగ్గుతున్నా చెల్లింపుల లోటు పెరుగుతూనేవుంది.
           ఈ విదేశీ వాణిజ్య చెల్లింపుల లోటు పెరగడంతో అది దేశంలో వడ్డీరేట్ల పెరుగుదలకు దారి తీస్తుంది. మన వాణిజ్య చెల్లింపుల లోటును తగ్గించుకోవాలంటే మరింతగా విదేశీ పెట్టుబడులను మన దేశానికి ఆకర్షించాలి. మరోపక్క దేశీయ డిమాండ్‌ ను పెరగనివ్వకుండా అరికట్టాలి. ఇంకోపక్క పడిపోతున్న రూపాయి మారకపు విలువ ఇక్కడ ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీయకుండా నిరోధించాలి. ఇవన్నీ నెరవేరాలంటే నయా ఉదారవాదం దగ్గర ఒక్కటే మందు ఉంది. మాంద్యాన్ని పెంచడం, నిరుద్యోగాన్ని పెంచడం. దీనినే మరింత ఉధృతంగా ఇక్కడ పాటిస్తారు. దాని ఫలితంగా వృద్ధిరేటు మరింతగా పడిపోతుంది. ఒకపక్క ఆర్ధిక వ్యవస్థలో మాంద్యం, మరోపక్క విదేశీ చెల్లింపుల లోటు రెండూ పెరగడం మన ఆర్థిక వ్యవస్థకు మరింత చెడ్డ రోజులు దాపురించనున్నాయని సూచిస్తోంది.
            ఇదేమంత తీవ్రమైన సమస్య కాదని, 2012-13 లో కూడా మన వాణిజ్యలోటు బాగా పెరిగిపోయినప్పటికీ, దాని తాకిడిని జయప్రదంగా తట్టుకుని ముందుకు సాగగలిగామని, ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుందని కొందరు వాదించవచ్చు.
            అప్పటికి, ఇప్పటికి పరిస్థితుల్లో మౌలికమైన తేడా ఉంది. 2012-13 నాటికి లేని తీవ్ర ద్రవ్యోల్బణం నేడు ఉంది. ఇది ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ మొత్తం మీద నెలకొని వుంది. అందుకనే అన్ని దేశాల్లోనూ వడ్డీరేట్లు పెంచివేయడం జరుగుతోంది. దాని ఫలితంగా మొత్తం ప్రపంచం మాంద్యంలోకి కూరుకుపోతోంది. 2012-13లో తక్కిన దేశాల్లో వడ్డీ రేట్లు పెరగలేదు. కాని అప్పుడు మన రిజర్వుబ్యాంకు ఇక్కడ వడ్డీరేట్లను పెంచింది. దాని వలన మన దేశానికి విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వచ్చి మనం ఇబ్బందుల నుండి బైటపడగలిగాం. ఇప్పుడు అన్ని దేశాల్లోను వడ్డీ రేట్లు పెంచుతున్నందువలన మన దేశానికి రావడానికి విదేశీ పెట్టుబడులకు ప్రత్యేకమైన ఆకర్షణ ఏమీ లేదు. ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్నందువలన ప్రస్తుతం మనదేశంలో ఏర్పడిన విదేశీ వాణిజ్య చెల్లింపుల లోటు ఎక్కువకాలం ఇలాగే కొనసాగే ప్రమాదం ఉంది. దాని కారణంగా ఇక్కడ ఆర్థిక సంక్షోభం మరింత ముదిరిపోనుంది.
           నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం ఎటువంటి చిక్కుల వలలో ఇరుక్కుపోయి వుందో ప్రస్తుత పరిస్థితి సూచిస్తోంది. పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద ఆధిపత్యానికి తీవ్రమైన సవాళ్ళు ఎదురౌతున్నాయి. ఈ నయా ఉదారవాద చట్రం నుండి బైటపడడానికి అవకాశాలు పెరుగుతున్నాయని ఈ పరిస్థితి సూచిస్తోంది. అటువంటి అవకాశం వచ్చినప్పుడే మన దేశం దానిని అందిపుచ్చుకోగలగాలి. కాని మన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించడం పోయి నయా ఉదారవాద విధానాలనే అంటకాగుతోంది. అప్పులు చేసి మరీ కార్పొరేట్లకు బెయిల్‌ ఔట్‌ ప్యాకేజీలు అందిస్తోంది. ఈ వైఖరి కారణంగా మన దేశం ఎదుర్కుంటున్న ఆర్థిక సంక్షోభం రానున్న కాలంలో మరింత ముదిరిపోయే ప్రమాదం ఉంది.

(స్వేచ్ఛానువాదం)
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌