
స్వీడిష్ యువ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ 2018లో 'ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్' (భవిష్యత్తు కోసం శుక్రవారాలు) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనినే 'క్లైమేట్ స్ట్రైక్' అని కూడా పిలుస్తున్నారు. అనేక దేశాల విద్యార్థులు, యువత, సంబంధిత ఉద్యమ నిర్వాహకులు పాల్గొంటున్నారు. ఈ క్యాంపైన్‌లో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీ శుక్రవారాన్ని ఎంపిక చేశారు. ఈ సంవత్సరం 'క్లైమేట్ స్ట్రైక్' చర్యలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే, గత సంవత్సరాల్లో కంటే ఎక్కువగా, వాతావరణ ప్రభావాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. గ్లోబల్ సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోందని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. వాతావరణ మార్పులు, ఇతర ప్రభావాలు ముందుగా ఊహించిన దానికంటే వేగంగా, చాలా ఎక్కువ తీవ్రతతో సంభవిస్తున్నాయి. 2015 ప్యారిస్ ఒప్పందం, 2021 గ్లాస్గో శిఖరాగ్ర సమావేశంలో వాగ్దానం చేయబడిన ఉద్గారాల తగ్గింపులు, ప్రపంచ ఉష్ణోగ్రతను 2 డిగ్రీలకు తగ్గించడం ఎక్కడా జరగలేదు. ఉష్ణోగ్రత పెరుగుదలను పక్కన పెడితే, 1.5 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతను తగ్గించాలనే లక్ష్యం కనుచూపుమేరలో నెరవేరేలా లేదు. అభివృద్ధి చెందిన దేశాలతో సహా అనేక దేశాలు గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా తీవ్రమైన వాతావరణ ప్రభావాలను ఎదుర్కొన్నాయి. ఉత్తర ఐరోపా లోని జర్మనీ, బెల్జియం, ఇటలీలలో అరుదైన భారీ వర్షాలు, వరదలు గత సంవత్సరం సంభవించాయి. తీవ్రమైన ఆస్తి, జనాభా భారీనష్టాలు దీర్ఘకాలంగా సంభవించాయి. వేడి తరంగాలు, అటవీ మంటలు, సుదీర్ఘ కరువులు యు.ఎస్, కెనడా ను కూడా నాశనం చేశాయి. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ని తాకాయి. నైరుతి యు.ఎస్.ఎ సుదీర్ఘ కరువు ఫలితంగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో ప్రజలు విపరీతమైన వర్షపాతంతో ''సూపర్ మాన్‌సూన్'' లేదా ''మాన్‌సూన్ ఆన్ స్ట్రెరాయిడ్స్'' అని పిలిచే భయంకరమైన వరదలకు గురవడం మనం చూశాం. ఇవన్నీ కలిసి 33 మిలియన్లకు పైగా ప్రజలను స్థాన భ్రంశం చెందించాయి. వాస్తవంగా చెప్పాలంటే దేశం మొత్తాన్ని ముంచెత్తాయి.
భారతదేశం, గత కొన్ని సంవత్సరాలుగా, అస్థిరమైన రుతుపవనాలు, విపరీతమైన వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. కేరళలో తీవ్రమైన వరదలు వచ్చాయి. గోదావరి, బ్రహ్మపుత్రా నదుల వరదలు అస్సాంను తీవ్రంగా ప్రభావితం చేశాయి. విపరీతమైన వర్షపాతం ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాలను కూడా పూర్తిగా ముంచెత్తింది. అయినప్పటికీ, భారతదేశంలో వాతావరణ ప్రభావాలపై ప్రభుత్వం తగినంత శ్రద్ధ చూపలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, శాస్త్ర సాంకేతిక సంస్థలు మరియు పౌర సమాజ సంస్థల పూర్తి భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే వాతావరణ స్థితిగతులకు సంబంధించిన జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించడం అత్యవసరం.
- కె.వి.వి.సత్యనారాయణ,
ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ ఎన్విరాన్మెంట్ డెస్క్ మెంబర్.