Jul 04,2023 07:05

          పోలవరం ప్రాజెక్టు చాలా సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రధాన ఎజెండాగా వుంది. ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు అని సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ ఉత్పత్తికి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ప్రచారం చేశారు. ప్రాజెక్టుని మా హయాంలో పూర్తిచేస్తామంటే మా హయాంలో ప్రారంభిస్తామని గొప్పలకు పోయి మరీ మాట్లాడడం మనం చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాలు, ప్రధాన ప్రతిపక్షాలు చెప్పింది చెబుతున్నది....ప్రాజెక్టు ఎత్తు, పొడవు, వాలు, డ్యామ్‌ నిధులు...వీటి గురించే. కానీ నేడు చర్చించాల్సింది సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల గురించి.
         పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని సి.పి.యం ఆధ్వర్యంలో జూన్‌ 20వ తేదీ నుండి జులై 4 వరకు చేపట్టిన 'మహా పాదయాత్ర' గ్రామాల సరిహద్దులు దాటుకుంటూ చైతన్య పరుస్తూ నేడు విజయవాడకు చేరనుంది.
          ప్రభుత్వ లెక్కల ప్రకారమే 8 మండలాలు, 222 పంచాయతీలు, 373 గ్రామాలు, 1,06,000 కుటుంబాలు నీట మునుగుతాయి. లక్షల జనాభా నీట మునిగి ఆస్తులు, సంపద పోగొట్టుకుంటున్నా వీరి సంక్షేమాన్ని, పునరావాసాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అత్యంత విషాదం. 2018 డి.పి.ఆర్‌. ప్రకారం ప్రాజెక్టు ఖర్చు రూ. 55.656 కోట్లు. ఇందులో పునరావాసం కోసం ఖర్చు చేయాల్సింది రూ. 33,000 కోట్లు కానీ ఖర్చు చేసింది రూ. 7000 కోట్లు మాత్రమే. ఎక్కువ శాతం నిర్మాణానికే ఖర్చు చేస్తున్నారు. మరి నిర్వాసితుల సంగతేంటి? సర్వస్వం త్యాగం చేసిన గిరిజనులు, అడవి బిడ్డల పరిస్థితి ఏంటి? అందుకే పునరావాసం పూర్తయిన తరువాతే ప్రాజెక్టు కట్టాలి.
         పోలవరం ప్రాజెక్టు ద్వారా చాలా ప్రయోజనాలు చేకూరతాయనేది ఎంత వాస్తవమో నిర్వాసితులు నష్టపోతారన్నది అంతే నిజం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 25 రకాల మౌలిక వసతులు కల్పించాలి. కానీ అవెక్కడా నిర్వాసితుల కాలనీల్లో కనిపించవు. ఏ నిర్వాసిత కాలనీలో కూడా శ్మశానవాటికలు కనిపించవు. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం నిర్వాసిత కాలనీల్లో అధ్వాన పరిస్థితులున్నాయి. ఇళ్ళ శ్లాబులు వర్షం వస్తే కారిపోతున్నాయి. నిర్మాణ సంస్థలు కాసుల కక్కుర్తితో నాణ్యత లేకుండా నిర్మించాయి. విద్య, వైద్యం సదుపాయాలు లేవు. గడప గడపకు వైసిపి పేరుతో గత కొంత కాలంగా హడావుడి చేస్తున్నారు. కానీ రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు నిర్వాసిత కాలనీల్లో అడుగు పెట్టడం లేదు. ఈ గడపలకు ఎందుకు రావడం లేదు. నిర్వాసితులు నిలదీస్తారని భయమా ?
        ప్రతి సంవత్సరం వరద వస్తుంది. 2022 జులై నెలలో వచ్చిన వరద వేరు. ఇది పాలకుల నిర్లక్ష్యం కారణంగా వచ్చిన వరద. కాంటూరు లెక్కలన్నీ తప్పని ఈ వరదలతో తేలిపోయింది. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా వరద ప్రాంతాలను ముంపు ప్రాంతాల జాబితాలోకి చేర్చాలని ప్రజలు కోరుతున్నారు. వరదలో పశువులు కొట్టుకుపోయాయి. పంటపొలాలు మునిగిపోయాయి. 33 రోజులు ఎందరో ఇళ్ళు నానిపోయి పడిపోయాయి. విలువైన వస్తువులు పాడైపోయాయి. ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం నుండి అందిన సహాయం రూ.2 వేలు మాత్రమే. ఇళ్ళు కూలిపోయినవారికి రూ.10 వేలు అందించారు. అది కూడా అరకొరగానే అందించారు. అందులోను రేకుల షెడ్డుకి ఇవ్వలేదు.
        ముంపు గ్రామాల ప్రజల కష్టాలు ఇలా ఉంటే ఊళ్లు ఖాళీ చేసి వచ్చిన నిర్వాసిత కాలనీలో బతుకుతున్న గిరిజనుల పరిస్థితి ఘోరంగా తయారైంది. వారు నిర్వాసిత కాలనీలకు వచ్చి 2 సంవత్సరాలైంది. రావాల్సిన ప్యాకేజీ డబ్బులు ఇంకా రాలేదు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. 'చూస్తాం ప్రభుత్వం ప్యాకేజీ డబ్బులు ఇవ్వకుంటే మరలా తిరిగి మా గ్రామాలకు వెళ్ళిపోతాం. పరిహారం ఇస్తుందో, మమ్మల్ని గోదారిలో ముంచేస్తుందో ప్రభుత్వమే తేల్చుకుంటుంద'ని ఆవేదన చెందుతున్నారు.
         సాధారణంగా తుఫాన్లు సముద్రాల్లో పుడతాయి. కానీ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల ఇదే వైఖరి కొనసాగిస్తే, వదిలేస్తే, ఉదాసీనత ఇలాగే కొనసాగితే తుఫాన్‌ పుట్టేది సముద్రంలో కాదు. గోదారి నదిలో. ఆ తుఫాన్‌ పేరు నిర్వాసితుల ఉద్యమం. ఈ తుఫాన్‌ ప్రజల్ని ఐక్యం చేసి పాలకులను వణికించి అమరావతి దగ్గర తీరం దాటుతుంది జాగ్రత్త. ఇది హెచ్చరిక కాదు. వాస్తవం. గిరిజనులే కదా అణచివేద్దాం, తొక్కేద్దాం అంటే కుదరదు. ఎందుకంటే ఇది చరిత్ర. ఇదే గిరిజనులకు ప్రభుత్వ పెత్తందారులకి జరుగుతున్న అసలైన వర్గపోరాటం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

(వ్యాసకర్త డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు)
వై. రాము

వై. రాము