Feb 28,2023 07:29

           పవర్‌ ఎక్సేంజిలో విద్యుత్‌ అమ్మకపు ధర గరిష్ట పరిమితి యూనిట్‌కు రూ.50 గా కేంద్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (సిఇఆర్‌సి) నిర్ణయించడం ప్రజలకు పెనుభారం. ప్రభుత్వాల ప్రైవేటీకరణ విధానాలతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పంపిణీ సంస్థల (డిస్కం)కు శరాఘాతం. ధర గరిష్ట పరిమితి ఇప్పుడున్న రూ.12 నుంచి ఎకాయెకిన రూ.50 చేయడం ప్రైవేటు విద్యుత్‌ కంపెనీల ఒత్తిడి మేరకే జరిగింది. కార్పొరేట్ల లాభాల కోసం పరితపిస్తున్న మోడీ ప్రభుత్వ కనుసన్నల్లోనే సిఇఆర్‌సి ధర పెంచి ఇండియా ఎనర్జీ ఎక్సేంజికి అనుమతిచ్చింది. సాధారణంగా ప్రతి ఏడాదీ వేసవిలో పవర్‌కు డిమాండ్‌ ఏర్పడుతుంది. సరిగ్గా వేసవి ముంగిట ధర పెంచడం కార్పొరేట్లకు కాసులు పోగేసుకునే వెసులుబాటు కల్పించడమే. నిరుడు వేసవిలో దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీకి భారీ డిమాండ్‌ నెలకొనగా యూనిట్‌ రూ.20 దాటిపోయింది. పలు డిస్కంలు అంతపెట్టి కొనలేక చేతులెత్తేశాయి. ఆ సమయంలో జోక్యం చేసుకున్న సిఇఆర్‌సి రూ.12 పరిమితి విధించింది. ఇప్పుడా పరిమితిని ఏకంగా రూ.50 చేసింది. రూ.12 ధర తమకు గిట్టుబాటు కావడం లేదని అదానీ, రత్నగిరి సహా ప్రైవేటు సంస్థలు పట్టుబట్టిన దరిమిలా ఎనర్జీ ఎక్సేంజి సిఇఆర్‌సిని ధర పెంచాలని కోరింది. విచారించిన సిఇఆర్‌సి అమ్మకపు ధర పరిమితి రూ.50కి పెంచింది.
           దిగుమతి చేసుకునే బొగ్గు, గ్యాస్‌, బ్యాటరీ ఆధారిత పవర్‌కే పెంచిన ధర పరిమితి వర్తిస్తుందని సిఇఆర్‌సి ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ భవిష్యత్తులో డిస్కంలు అపరిమిత భారాలు మోయాల్సే ఉంటుంది. ఎక్కువ ధరలకు కరెంట్‌ కొనుగోలు చేస్తే ఆ భారాలు ట్రూఅప్‌, శ్లాబుల్లో మతలబుల వంటి రూపాల్లో వినియోగదారుల నెత్తినే పడతాయి. ప్రస్తుతం గరిష్ట పరిమితి రూ.12 ఉండగానే మన రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్లలో ఏడు సార్లు వివిధ రూపాల్లో చార్జీలు పెంచి రూ.16 వేల కోట్లకుపైన ప్రజల నెత్తిన అదనంగా మోదింది. ఇదే సమయంలో డిస్కంలు రూ.50 వేల కోట్ల అప్పులు మూటగట్టుకున్నాయి. డిస్కంల సంక్షోభానికి ప్రైవేటు విద్యుత్‌ కొనుగోలు భారం ఒక కారణమైతే, ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు, ఇతర బకాయిల వంటివి సకాలంలో అందక పోవడం ఇంకో కారణం. ఇప్పుడే ఇలా ఉంటే, ప్రైవేటు నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌ ధర రూ.50 అయితే పరిస్థితి ఇంకెంతగా కుదేలవుతుందో ఊహించడానికి భయమేస్తోంది. ఎప్పుడో కొని పంపిణీ చేసిన విద్యుత్‌కు కొన్నేళ్ల తర్వాత ట్రూఅప్‌ చార్జీలను ప్రజల నుంచి గోళ్లూడగొట్టి గుంజుతున్నారు. ఇక నుంచి ప్రతి నెలా ఛార్జీలు పెంచుతామంటున్నారు. ఇవి చాలదన్నట్లు రూ.60 వేలున్న ట్రాన్స్‌ఫార్మర్‌ను రూ.1.30 లక్షలకు కొనుగోలు చేస్తున్నారు. అందు నిమిత్తం ఒకే కంపెనీకి రూ.2,600 కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు. ఇటువంటి అవినీతి, అక్రమాల మూల్యం చివరికి వినియోగదారులే చెల్లించుకోవాలి.
          దేశంలో 1990వ దశకంలో సరళీకరణ విధానాలు మొదలయ్యాక ప్రపంచబ్యాంక్‌ ఆదేశాలతో విద్యుత్‌ సంస్కరణలు అంకురించాయి. నయా-ఉదారవాదం ఊపందుకున్నాక కీలకమైన విద్యుత్‌ రంగంలో దేశ, విదేశీ కార్పొరేట్ల ఆధిపత్యం పెరిగింది. మన రాష్ట్రం ప్రయోగశాలగా మారింది. విద్యుత్‌ నియంత్రణ కమిషన్లు ఉన్నా వాటి తీర్పులు, ఆదేశాలు అంతిమంగా కార్పొరేట్లకే అనుకూలిస్తున్నాయి. ప్రభుత్వరంగంలో విద్యుదుత్పత్తి సంస్థలను పడుకోబెట్టి వాటి ఉత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గించి సహాయ నిరాకరణను పాటిస్తున్నాయి ప్రభుత్వాలు. సబ్సిడీల ఎగవేతకు పాల్పడుతున్నాయి. ఇదే సమయంలో పవర్‌ పర్చేజి అగ్రిమెంట్ల (పిపిఎ)తో ప్రైవేటు విద్యుత్‌ సంస్థల నుంచి అధిక ధరలకు కరెంట్‌ను కొనుగోలు చేసి వాటి దోపిడీకి దన్నుగా నిలుస్తున్నాయి. అందువల్ల ఒనగూడే నష్టాలను వినియోగదారులకు చార్జీల పెంపుదలతో బదిలీ చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం వినాశకర విద్యుత్‌ సంస్కరణల బిల్లుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్‌కు మంగళం పాడే దిశగా పయనిస్తోంది. ప్రజా వ్యతిరేక విద్యుత్‌ సంస్కరణలను ప్రతిఘటిస్తూ నాడు జరిగిన బషీర్‌బాగ్‌ ఉద్యమ స్ఫూర్తి దేశమంతటా రగలాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే ప్రభుత్వాలు దిగొస్తాయి.