Oct 13,2023 07:12

      ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని, మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలు, వసతి సదుపాయాలను కూడా విశాఖలో ఏర్పాటు చేయడానికంటూ జారీ చేసిన జీఓ 2015 చూస్తే వెనకటికెవరో 'తాటిచెట్టు ఎందుకెక్కావంటే దూడ గడ్డి కోసం' అన్న సామెత గుర్తుకు వస్తోంది. 'ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించడానికి ముఖ్యమంత్రి, మంత్రులు తరచూ ఆ ప్రాంతంలో పర్యటించాల్సి వస్తుంది. ఆ సమయాల్లో ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి పర్యటించడంతోపాటు, రాత్రి పూట కూడా అక్కడే బస చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపేందుకు ముఖ్యమంత్రి విశాఖలో బస చేస్తారు. అందువల్ల సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయి సిబ్బందికి తక్షణమే చేరవేయడం సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగడం కోసం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు, ఇతర సహాయ సీనియర్‌ అధికారులకు వసతి సౌకర్యాలను అక్కడ ఏర్పాటు చేయాల్సి వస్తోంది' అని జీఓ లో పేర్కొన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇటువంటి కృషి అవసరమని ఇప్పుడే ప్రభుత్వం గుర్తించిందా? ఇంతకుముందే గుర్తించినట్లయితే గడచిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి లేదా మంత్రులు, (ఆ యా జిల్లాలకు చెందిన లేదా ఇన్‌ఛార్జి మంత్రులు, ఉపాధ్యాయులను వేధించడమే ప్రధాన లక్ష్యంగా గలిగిన అధికారి తప్ప) ఉన్నతాధికార్లు ఎంతమంది ఎన్ని సార్లు పర్యటించారు? అక్కడ తగిన వసతి లేక వారు అదే రోజు రాత్రి అమరావతికి వెనక్కు రావడంలో ఎటువంటి ఇబ్బందులెదుర్కొన్నారు? ఇలాంటి వివరాలేమైనా ఉంటే వాటిని వెల్లడిస్తే ప్రభుత్వ లక్ష్య శుద్ధిని ప్రజలు అర్ధం చేసుకుంటారు.
         ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయన్నది నిర్వివాదాంశం. అలాగే 'ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, రవాణా సౌకర్యాల్లో వెనుకబాటు ఉందని, పెద్ద సంఖ్యలో అత్యంత వెనుకబడిన గిరిజనులు (పి.వి.టి.జి) ఈ ప్రాంతంలో ఉన్నారని జీఓలో పేర్కొన్నదీ నిజమే! అయితే రాయలసీమ లోని ఎనిమిది జిల్లాలు, నిత్య కరువు పీడితమైన ప్రకాశం, పల్నాడు జిల్లాల మాటేమిటి? రక్షిత మంచినీరు కూడా లభించని వెనుకబడిన ఆ పది జిల్లాల అభివృద్ధికి కూడా ఇటువంటి కార్యాలయాలు ఏర్పాటు చేస్తారా అన్నది సామాన్యుల ప్రశ్న. అలాంటి జీఓ ఏదీ ఇప్పుడు రాలేదు కనుక అక్కడి ప్రజల అభివృద్ధి ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత కాదనుకోవాలా? అని అంటున్నారు. చారిత్రకంగా ఉన్న ఈ వెనుకబాటును గుర్తించి, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని, ప్రోత్సాహకాలు ఇవ్వాలని జీఓ లో ఉటంకించడం బాగానే ఉంది. అదే చట్టంలో రాయలసీమ వెనుకబాటుతనం గురించి పేర్కొనడమేగాక (ఉమ్మడి) ఏడు జిల్లాలకు కేంద్రం అభివృద్ధి ప్యాకేజి ఇస్తుందని నాటి ప్రధాని నిండు పార్లమెంటుకు హామీలిచ్చారు. తొలి మూడేళ్లు మాత్రమే ఇచ్చి ఆ తరువాత ఎగ్గొట్టిన కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట్లాడని రాష్ట్ర ప్రభుత్వం జీఓ లో ఇప్పుడిలా పేర్కొనడం ద్వారా అభివృద్ధి బాధ్యతను కూడా తానే తీసుకుంటున్నానని చెప్పదలచుకున్నదా అన్నది మరో ముఖ్యమైన ప్రశ్న. అదే నిజమయితే రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి కి మరింత సాగిలబడటమే కదా !
        రాష్ట్ర అభివృద్ధికి అందునా వెనుకబడిన ప్రాంతాల బాగు కోసం అవసరమైన వ్యూహాలను నిర్ణయించుకోవడం, దానికి అనుగుణంగా మంత్రులను, అధికార యంత్రాంగాన్ని నడపడానికి ముఖ్యమంత్రికి నిర్నిబంధమైన అధికారాలున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ విద్యుక్త ధర్మమది. అయితే, అటువంటి మాటల వెనుక రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలు, రాజకీయ స్వప్రయోజనాలు ఉండరాదు. ముఖ్యమంత్రి వర్యులు చాలా కాలంగా చెబుతున్న మూడు రాజధానుల ప్రణాళిక మేరకే తాజాగా జీఓ 2015 విడుదల చేశారన్నది జనవాక్యం. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తగిన రాజధాని కూడా లేకుండా పోయిందన్నది రాష్ట్ర ప్రజల ఆవేదన. వెనుకబడిన అన్ని ప్రాంతాల పురోభివృద్ధికి తగు ప్రణాళికలు అమలు చేయడం, అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవడం అవసరం.