Oct 27,2023 07:29

ఆధునీకరణ పేరుతో దాదాపు అన్ని రైల్వే స్టేషన్లు పడగొట్టి ప్రయాణీకులకు నుంచోటానికి నీడ, కూర్చోటానికి కుర్చీలు లేకుండా చేస్తున్నారు రైల్వే వారు. పాసింజర్‌ రైళ్ళు లేక చిన్నచిన్న స్టేషన్లు గబ్బిలాలు నిలయాలుగా మారాయి. ఇంక ఈ ఆధునీకరణ ఎవరికోసం? ఆ పేరుతో కమీషన్ల కోసంగాక! గతంలో ఉన్న పాసెంజర్‌ రైళ్లను తొలగించి పేరు మార్చి ఎక్స్‌ప్రెస్‌లుగా చేశారు. గతంలో వీటిలో అన్ని బోగీలు జనరల్‌ బోగీలుగా ఉండేవి. ఇపుడు వాటికి జనరల్‌ బోగీ ఒకటి వేసి, మీ చావు మీరు చావండి అన్నట్లుగా చేసారు. వందే భారత్‌ రైళ్ళు, ఇంకేదో పేరుతో మొన్న ప్రారంభం చేశారు మోడీ. అన్నీ కూడా ఏసీ రైళ్లే. తరువాత వృద్ధులకు రాయితీ తీసివేసారు. సామన్యుడు వీటి ముఖం కూడా చూడడు. మరి ఎవరికోసం ఈ ఆధునీకరణ! కమీషన్ల కోసం గాకపోతే!! సామాన్యుడి కోసం రైళ్ళే లేనపుడు ప్రజాధనం ఎవరికోసం ఖర్చు పెడుతున్నట్లు? ఈ నాటకాలు ప్రజల గ్రహిస్తున్నారు. త్వరలో ఈ అరాచక, మతవాద పార్టీలకు ఓటర్లు బుద్ధి చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రభుత్వ ఆస్తులన్నింటిని అదానీకి, అంబానీకి అమ్మేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మార్వో కార్యాలయాలను, కలెక్టరు కార్యాలయాలను, ఖాళీ స్థలాలను అమ్మేస్తున్నది. ఇంకెందుకీ ఆధునీకరణ? ఆధునీకరించి ఎక్కువ బేరానికి అమ్ముకోటానికా! ప్రజలు ఈ మోసాన్ని తిప్పికొట్టాలి.
- నార్నె వెంకట సుబ్బయ్య