Jul 02,2023 09:06

పండ్లు, కూరగాయలపై స్టిక్కరా?! ఔను.. చీరలు, వంట పాత్రలు, వాటర్‌ బాటిల్స్‌ మీద అయితే వాటి ధర, క్వాలిటీకి సంబంధించిన వివరాలతో ఆ స్టిక్కర్స్‌ అతికిస్తారని తెలుసు. చివరికి తినే పండ్లు.. కూరగాయల మీదా ఇప్పుడు వేసేస్తున్నారు.. కొన్ని పండ్లు కొనేటప్పుడు చూస్తే, వాటిమీద స్టిక్కర్లు అతికించి ఉంటాయి. ఆ వస్తువు రేటు, కోడ్‌ నంబర్లు, ఇంగ్లీషు అక్షరాలు, క్యుఆర్‌ కోడ్స్‌ ఇలా రకరకాల సింబల్స్‌ కనిపిస్తాయి. మనం రేటు వరకే చూస్తాం. మిగిలిన వాటిని పట్టించుకోం. పట్టించుకున్నా మనకు అర్థం కాదు. కానీ పండ్ల మీద మాత్రం నంబర్లు, ఇంగ్లీషు అక్షరాలు ఉంటాయి. తినే పండ్ల మీద ఈ స్టిక్కర్లేంటి..? వాటిమీద నంబర్లేంటి..? అనిపిస్తుంది కదూ..! లోతుల్లోకి వెళితే ఆ కథాకమామిషు ఏమిటి..? అసలు ఆ స్టిక్కర్స్‌ని ఎవరు, ఎందుకు అతికించారు? ఆ నంబర్లు వేటికి సంకేతం? కొనేటప్పుడు ఆ స్టిక్కర్స్‌ ఏవిధంగా మనకు సహకరిస్తాయి..? ఇలాంటి వివరాలు తెలుసుకుందాం.

22

టీవల పండ్లు మన ఆహార ప్రక్రియలో కీలకంగా మారాయి. ఆరోగ్య రీత్యా పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అదేక్రమంలో మార్కెట్‌ నుంచి తెచ్చేటప్పుడు వాటిపై స్టిక్కర్స్‌ అతికించి ఉండటం చూస్తూంటాం. వాటిపై నంబర్లు, ఇంగ్లీషు అక్షరాలు, ఇతర గుర్తులు.. గీతలు.. ఏవేవో కోడ్స్‌ ఉంటాయి. ఎక్కువగా యాపిల్‌, పియర్స్‌, బత్తాయి, కివీ లాంటి పండ్ల మీద ఈ స్టిక్కర్లు దర్శనమిస్తాయి మనకు. కొంతమంది ఈ రకమైన పండ్లు మాత్రమే మంచివి, ఇవి మన ప్రాంతాలలో దొరికేవి కాదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటాయని భావిస్తారు. అవి కొనడానికి ఎక్కువ ఖర్చు పెట్టేందుకూ వెనకాడరు. మరికొందరు ఆ స్టిక్కర్లను తీసి పడేశామా.. పండు తినేశామా..అంతవరకే పరిమితమౌతారు. కానీ ఆ నంబర్లు మనకు అనేక విషయాల్ని చెబుతాయంటున్నారు నిపుణులు.
 

                                                                    సంఖ్యలే సూచికలా..?!

వివరాల్లోకి వెళితే.. పండ్లపై ఉండే స్టిక్కర్‌ మీద నంబర్లు, ఇంగ్లీషు అక్షరాలు, తదితర గుర్తులు మనం చూస్తాం. ఆ నంబర్లను గమనిస్తే.. మూడు లేదా నాలుగు నంబరుతో మొదలైన సంఖ్య ఉంటే.. సహజసిద్ధమైన ఎరువులు, కృత్రిమ రసాయనాలు రెండింటినీ ఉపయోగించి, పండించిన పండ్లని అర్థం. సాధారణంగా 20వ శతాబ్దంలో వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల ఆధారంగా నూతన పద్ధతులనుపయోగించి ఈ విధమైన పండ్లను పండించారు.
            పండు స్టిక్కర్‌పై ఐదు అంకెల సంఖ్య ఉండి, తొమ్మిదితో ప్రారంభమైతే.. అది పూర్తిగా సేంద్రీయ ఎరువులు ఉపయోగించి, సహజసిద్ధమైన పద్ధతిలో పండించారని అర్థం. ఇందులో ఎలాంటి కృత్రిమ రసాయనాలు, ఎరువులు వాడరు. ఇవి ఎలాంటి హానీ కలిగించవు. పూర్తిగా సురక్షితమైనవి.
           ఒకవేళ స్టిక్కర్‌పై ఐదు అంకెల సంఖ్య ఎనిమిది అంకెతో ప్రారంభమైతే.. అప్పుడు దానిని జన్యుపరంగా సవరించినట్లు, లేదా జన్యుమార్పిడి చేసిన పండ్లు అని అర్థం. వాటిని తింటే.. ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి. అనారోగ్యం కలిగే అవకాశమూ ఉంది. కాబట్టి.. వాటిని కొనకపోవడమూ.. తినకపోవడమే మంచిది. ఇలాంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచాలి. ఇది చట్టబద్ధం చేయకూడని ప్రక్రియ.
అంతేకాదు.. వీటిపై మనకు కనిపించే ఈ స్టిక్కర్‌లు ఇంకా సూచించేదేమిటంటే.. ఆయా పదార్థాలు - సేంద్రియ రకమా.. రసాయనమా, వాటి ఉత్పత్తి, పరిమాణం, పెరుగుదల తదితర వివరాలనూ తెలియచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
 

                                                                                  చట్టం..

దేశ వ్యాపితంగా ఈ వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ఆహార భద్రత-ప్రమాణాల చట్టం (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ఒకటి ఉంది. అది 23 ఆగస్టు 2006న భారత రాష్ట్రపతి ఆమోదాన్ని పొందింది. ఇది ఆహార ఉత్పత్తి - వినియోగాల నియంత్రణకు సంబంధించిన ప్రాథమిక చట్టం.
 

                                                                                లోగో ...

ప్రపంచంలో అనేక దేశాలలో పండ్లు, కూరగాయలపై ఇటువంటి స్టిక్కర్లను అతికిస్తారు. ఇది పండు నాణ్యత, ధర, పండును పండించే విధానం తెలిపే సమాచారాన్ని సూచిస్తుంది. కానీ మన దేశంలో యధేచ్ఛగా ఈ స్టిక్కర్లను వాడేస్తున్నారని.. అలాంటివి కొని మోసపోవద్దని స్వయంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. మరేవి కొనాలి.. ఏవి కొనకూడదు.. అని ఎలా తెలుస్తుందని సందేహమా?
          ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకు ప్రభుత్వ గుర్తింపు కలిగి.. లైసెన్స్‌ నంబర్‌ అథారిటీతో ఏర్పడిన లోగో ఒకటి ఉంది. నీలం, నారింజ, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న అక్షరాలు, అడ్డు గీతలు, ఆకుతో కూడిన ఒక చెర్రీ పండు ఈ లోగోలో ఉంటాయి. లోగో ఉన్న స్టిక్కర్స్‌ ఉంటే.. ఆ పండు లేదా పదార్థం ప్రభుత్వం చేత పరీక్షింపబడింది. నిరభ్యంతరంగా తినటానికి అనుకూలమైనది అని అర్థం. మరి దేఖో లోగో.. ఖావో ఖావో.
 

                                                                                     స్లోగన్‌..

(సాహి భోజనం- బెహ్తర్‌ జీవన్‌) 'పోషకాహారం.. మెరుగైన జీవితం' అనే నినాదం ఈ చట్టం ఉద్దేశ్యం. స్టిక్కర్ల ద్వారా ఆయా పదార్థాల వివరాలు మనకు అర్థమౌతాయి. పళ్ళు, కూరగాయల గురించి ప్రజా సంప్రదింపులు, ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడం, విశ్లేషణ, అంచనా, నిర్వహణ, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ ఇవన్నీ ఈ చట్టంలో పొందుపరచబడి ఉన్నాయి మరి. ఈ సూత్రాల ఆధారంగానే ఈ చట్టం పనిచేయాలి. అంటే ఆహార పదార్థాలు సురక్షితమైనవా కాదా అనే విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని మనను హెచ్చరిస్తుందన్న మాట.
 

                                                                                   జర జాగ్రత్త..!

సూపర్‌ మార్కెట్‌లు, షాపులు, రోడ్ల పక్కన బుట్టల్లో పెట్టి అమ్మేచోట కూడా మనకు కనిపిస్తాయి స్టిక్కర్ల పండ్లు. వాటిలో వేటిని కొనాలో.. వేటిని కొనకూడదో నిర్ణయించుకోవాలంటే పై వివరాలు మనకు తెలిసుండాల్సిందే.. కొన్నిసార్లు ఈ స్టిక్కర్లను మారుస్తారట. లేదా ఆ స్టిక్కర్‌ కింద పుచ్చు దాగి ఉంటుంది కూడా. కాబట్టి స్టిక్కర్‌ ఉంది కదా అని కొనేయొచ్చు.. ఆపై తినేయొచ్చు అనుకోవడానికి లేదు. అందుకే జాగ్రత్తగా గమనించి, మసలుకోవాలి మనం.
           కల్తీ అనేది జల్దీగా పాకిపోతుంది. అలాంటి ఆహార పదార్థాలు తింటే దవాఖాన చుట్టూ తిరగక తప్పదు. వ్యాపారీకరణ పెరిగింది. చిత్తంలో కాస్త చెత్త ఆలోచనలు రావొచ్చు. వాటిని నివారించడానికే ఈ స్టిక్కర్‌ల హంగామా. దీనిద్వారా నాణ్యమైనవి ఏవో తెలుసుకొని వేటిని కొనాలో.. వేటిని కొనకూడదో నిర్ణయించుకోవాలి మరి.
 

                                          మరి జర జాగరూకతతో ఉందాం..! పండమ్మ బొట్టు సంగతి నలుగురితో చెబుదాం..!

                                                                            చట్టం..బాధ్యత..

ఆహారభద్రత చట్టమే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ. అంటే ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా. ఇది మన దేశంలో ఆహార పదార్థాలకు సంబంధించిన చట్టాలన్నీ ఒకే తాటిపై నడిచేలా చేస్తుంది. సైన్స్‌ ఆధారిత ప్రమాణాలతో కూడిన ఆహార పదార్థాల తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకం, దిగుమతి ప్రజలకు అనుకూలంగా ఉండాలనే దిశగా ఈ చట్టం పనిచేస్తుంది. అంటే ఏ వ్యక్తి అయినా స్వయంగాగానీ, అతని తరపున మరే ఇతర వ్యక్తిగానీ.. కల్తీ పదార్థాలను అమ్మినా, తయారుచేసినా, నిల్వ చేసినా, పంపిణీ చేసినా, దిగుమతి చేసినా చట్టరీత్యా నేరం. అలాంటివారిని శిక్షించి, (లక్ష రూపాయల) జరిమానా విధిస్తుంది భద్రతా చట్టం.

- టి. టాన్య
70958 58888