
సముద్ర తీర ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేవు. అనేక పోర్టులు, విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కొరత ఉందనే సత్యాన్ని దాచి 'బ్లూ ఎకానమీ' ద్వారా ఆర్థిక కార్యకలాపాలను అభివృద్ధి చేస్తామనడం అతిశయోక్తి అవుతుంది. లాభాల కోసం పని చేసే సంస్థలకు సముద్ర ప్రాంతాల్ని అప్పగించడం ద్వారా మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతారు. విపరీతమైన పర్యావరణ నష్టం వాటిల్లుతుంది.
అభివృద్ధి ప్రధానాశయంగా పేర్కొంటున్న 'బ్లూ ఎకానమీ పాలసీ' అందమైన అబద్ధం. అత్యంత పేద వర్గాలైన మత్స్యకారుల జీవనోపాధి దెబ్బ తీయడంతో పాటు వారిని వారి నివాసాలకు దూరం చేసే కుట్ర. ఇప్పటికే 'సాగర మాల' పేరుతో చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన కార్యకలాపాలతో మత్య్సకారుల జీవన విధానంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సముద్రాన్నే నమ్ముకుని జీవిస్తున్న లక్షలాదిమంది మత్య్సకార కుటుంబాలను వారి జీవనోపాధికి దూరం చేసి, వారి ఆవాసాలను బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్తగా 'బ్లూ ఎకానమీ పాలసీ'ని ముందుకు తెచ్చింది. సముద్ర జలాల పరిరక్షణ, పర్యావరణం, సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న ప్రజల రక్షణకు సంబంధించిన అంశాలేవీ లేకుండానే దేశంలోని సముద్ర తీరాన్ని, సముద్ర సంపదల్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌లకు అప్పగించేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. కార్పొరేట్ల సేవే లక్ష్యంగా పని చేస్తోంది.
ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం సముద్రాల నుంచే జరుగుతుంది. ప్రపంచ జనాభాలో 40 శాతం మంది ప్రజలు తీర ప్రాంతాలకు సమీపంలోనే నివసిస్తున్నారు. భారతదేశం విస్తారమైన, వైవిధ్యమైన సముద్ర భూభాగాన్ని కలిగి ఉంది. అరేబియా సముద్రం, బంగాళా ఖాతం వెంబడి కీలకమైన వివిధ ఓడరేవు నగరాలున్నాయి. మొత్తం 8,118 కి.మీ పొడవైన తీరప్రాంతం ఉంది. ప్రతి ఏటా దాదాపు 4.412 మెట్రిక్ టన్నుల చేపలు సముద్రం నుంచి ఉత్పత్తి అవుతున్నాయనే అంచనాలున్నాయి. దాదాపు 4 కోట్ల మంది ప్రజలు సముద్ర చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి ఏటా రూ.65 వేల కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని ఎగుమతుల విషయానికి వస్తే మత్య్స సంపద వాటా గణనీయమైనది.
వీటన్నిటిని గమనంలోకి తీసుకున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇంతటి ఆర్థిక పరిపుష్టి కలిగిన సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్ర సంపదల్ని తన అనుంగు కార్పోరేట్లకు కట్టబెట్టడానికి కావలసిన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే 'సాగర మాల' ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ఇది చాలదన్నట్టు తాజాగా 'బ్లూ ఎకానమీ పాలసీ'ని ముందుకు తెచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద తీర ప్రాంత దేశమైన భారత్‌లో అందమైన బీచ్‌లు, తీర ప్రాంతాలకు రవాణా సౌకర్యాల మెరుగు, ఓడరేవుల ఆధునీకరణ, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, సముద్ర కాలుష్య నివారణ, సముద్ర వనరుల సక్రమ వినియోగం వంటి అందమైన, మోసపూరితమైన అంశాలను ముందు పెట్టి 'బ్లూ ఎకానమీ పాలసీ' దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంటోంది. దేశంలోని తొమ్మిది తీర ప్రాంత రాష్ట్రాల్లోని 12 మేజర్ పోర్టులు, 200 చిన్న పోర్టులకు రవాణా సౌకర్యాల కల్పన ద్వారా వ్యాపారాన్ని పెంచాలనేది ఇందులో ప్రధానాంశం. షిప్పింగ్ పరిశ్రమ విస్తరణ ద్వారా కార్పోరేట్ శక్తులకు మరింత లాభం చేకూర్చాలని చూస్తోంది. ఆఫ్ షోర్ ఎనర్జీ ప్రొడక్షన్‌ను ప్రోత్సహించడం, ఇంధన అవసరాలను తీర్చడం అనే పేరుతో ఆయా విభాగాల్ని పూర్తిగా ప్రైవేటు శక్తులకు కట్టబెట్టాలని చూడడం మరో అంశంగా కనిపిస్తోంది. మెరైన్ బయో టెక్నాలజీ, మైనింగ్‌ల పేరుతో సముద్రం లోని ఇసుక, ఇతర ఖనిజ సంపదలపై కార్పొరేట్ శక్తులకు గుత్తాధిపత్యం కట్టబెట్టడం ఇంకో అంశం.
అయితే ప్రభుత్వం మాత్రం ఈ పాలసీ మొత్తం అభివృద్ధి కోసమే అంటోంది. ఇందుకోసం ఆ పాలసీ ముసాయిదాలో చెబుతున్న అంశాలేవీ ఆచరణకు నిలుస్తాయనడానికి తగిన చర్యలు ఉండడం లేదు. సముద్ర తీర ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేవు. అనేక పోర్టులు, విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కొరత ఉందనే సత్యాన్ని దాచి 'బ్లూ ఎకానమీ' ద్వారా ఆర్థిక కార్యకలాపాలను అభివృద్ధి చేస్తామనడం అతిశయోక్తి అవుతుంది. లాభాల కోసం పని చేసే సంస్థలకు సముద్ర ప్రాంతాల్ని అప్పగించడం ద్వారా మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతారు. విపరీతమైన పర్యావరణ నష్టం వాటిల్లుతుంది. సముద్రంతో ఇప్పటికే ఓవర్ ఫిషింగ్ అనేది ఒక పెద్ద సవాలుగా ఉంది. సాంప్రదాయ మత్య్సకారుల పాలిట ఇది శాపంగా మారుతోంది. హై సీస్ లో అంతర్జాతీయ సంస్థలకు చేపలు పట్టుకునేందుకు అవకాశం కల్పించడంతో క్రమంగా ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్‌గా పిలువబడే సముద్ర జలాల్లో చేపల నిల్వలు క్షీణించి సముద్ర పర్యావరణ వ్యవస్థకే పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. ఇది తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సముద్రాలు వ్యాపార కేంద్రాలుగా మారడంతో విపరీతమైన ఎగుమతులు, దిగుమతుల కారణంగా, సముద్రంపై ఇంధన రవాణా మూలంగా చమురు చిందటం, ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలతో కాలుష్యం పెరుగుతుంది. ఇక డీప్ శాండ్ మైనింగ్ కారణంగా సముద్ర పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగిస్తుంది. వాతావరణంలో విపరీతమైన మార్పులు పెరిగి తీరప్రాంతాల్లో తీవ్ర నష్టం జరుగుతుంది.
మరో కీలకమైన అంశం విషయానికి వస్తే ఎంతో కాలంగా భారతదేశం, శ్రీలంకల మధ్య ఫిషింగ్ వివాదం నడుస్తూనే ఉంది. ఇరు దేశాల సముద్ర జలాల మధ్య సరిహద్దు స్పష్టంగా విభజించబడలేదు. ఇది రెండు దేశాల మత్స్యకారుల మధ్య గందరగోళానికి, సంఘర్షణకు దారితీస్తూనే ఉంది. దీనికి 'బ్లూ ఎకానమీ పాలసీ' పరిష్కారం చూపించలేదు.
సస్టైనబిలిటీ సైన్స్ జర్నల్ తన సంపాదకీయంలో బ్లూ ఎకానమీపై కీలకమైన వ్యాఖ్య చేసింది. బ్లూ ఎకానమీకి సరైన నిర్వచనం లేదని పేర్కొంది. ఈ అసంబద్ధత కారణంగా ఈ పాలసీని రూపొందించి అమలు చేసే వారి అభిరుచులను బట్టి ఎంపిక చేసుకున్న లక్ష్యాలు తారుమారవుతాయని హెచ్చరించింది. మరో అంతర్జాతీయ పరిశోధన సంస్థ దీన్ని మత్య్సకారుల పాలిట విషాదకరమైన పాలసీగా పేర్కొంది. మత్స్యకారులు సముద్రాన్ని చాలా స్థిరమైన పద్ధతుల్లో ఉపయోగిస్తారని, అయితే బ్లూ ఎకానమీ పాలసీ ఇందుకు విరుద్ధమైనదని తెలిపింది. ఈ పాలసీ సముద్రాన్ని లాభదాయకమైన వనరుగానే పరిగణిస్తుందని పేర్కొంది. తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలు విధ్వంసం అవుతాయని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఏ దేశమైనా తన సముద్ర సంపదను కేవలం ఆర్థిక వనరుగానే చూడకూడదని గ్రహించాలి. సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ కోణంలోనూ చూడాల్సి ఉంటుంది. కేవలం కార్పొరేట్ల కోసం వ్యాపార కాంక్షతో...లక్షలాది మంది మత్య్సకారుల కడుపు కొట్టేలా రూపొందించిన బ్లూ ఎకానమీ పాలసీని రద్దు చేయాలి. సముద్ర తీరప్రాంతాల్లో పర్యావరణానికి హాని కలుగకుండా స్థిరమైన అభివృద్ధి కోసం అన్ని రంగాల నిపుణులతో సంప్రదింపులు జరిపి సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి.
(వ్యాసకర్త సెల్ : 9059837847)
డా|| సి.ఎన్. క్షేత్రపాల్ రెడ్డి