Jan 08,2023 08:14
  • రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
  • చిత్తూరు జిల్లాలో అమలులోకి
  • త్వరలో మిగిలిన జిల్లాలోనూ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్క్వాడ్‌లు అకస్మిక తనిఖీలు చేసి సిబ్బంది పనితీరు, హజరు వంటి చర్యలను పరిశీలిస్తాయిన, అవసరమైతే అక్కడికక్కడే చర్యలు కూడా తీసుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిన ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఈ దిశలో బృందాలను ఏర్పాటు చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఒకటి, రెండు రోజుల్లోనే ఈ దిశలో చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. గామ వార్డు సచివాలయాల వ్యవస్థను పటిష్టపరచాలని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఈ టీమ్‌లను ఏర్పాటు చేయాలని వివిధ జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వుల్లో సూచించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన నోటిపికేషన్‌ ప్రకారం ఆ జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి డివిజన్లకు వేర్వేరుగా ఒక్కో డివిజన్‌కు నలుగురు అధికారుల చొప్పున టీములు వేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరు, గైర్హాజరు, పని వేళల్లో ఉద్యోగుల మూమెంట్‌ రిజిస్టర్‌లను నిశితంగా పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిటీ మానిటరింగ్‌ బాధ్యతలను జిల్లా రెవెన్యూ ఆఫీసరు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు నిర్వహించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిబ్బందికి సంబందించి వీక్లీ రివ్యూలు కూడా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈనెల 6న విజయవాడలో జరిగిన కోస్తాంధ్ర రెవెన్యూ అధికారుల జోనల్‌ సమావేశంలో రెవెన్యూ అధికారులు నెలకు రెండు రోజులు గ్రామ వార్డు సచివాలయాలకు తనిఖీకి వెళ్లాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్‌డిఓ, తహసీల్దార్లను సిసిఎల్‌ఎ ఆదేశించారు. తనిఖీల సందర్భంలో రెవెన్యూకు సంబంధించి రైతుల వద్ద నుంచి మ్యుటేషన్‌ కోసం ఎన్ని దరకాస్తులు వచ్చాయి? ఎన్ని అప్రూవల్‌ చేశారు? ఎన్ని పెండింగ్‌ ఉన్నాయి? అందుకు కారణాలేమిటి? అనే అంశాలను నిశితంగా పరిశీలించాలని సిసిఎల్‌ఎ సూచించారు. తాజాగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో రెవిన్యూ అధికారులు విడిగా తనిఖీ చేస్తారా, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లలో సభ్యులుగా ఉంటారా అన్న విషయంపై చర్చ జరుగుతోంది.
 

                                                                    పనితీరుకు వెయిటేజీ

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జాబ్‌చార్టు అమలు, ఉద్యోగుల పనితీరును నెల మొత్తం అంచనా వేసేందుకు ప్రభుత్వం ఉద్యోగుల సర్వీస్‌కు సంబందించి వెయిటేజీ పర్సెంటేజీ ని లెక్క వేస్తోంది. నెలలో మొత్తం పనితీరుకు 100 శాతం మార్కుల తరహాలో వెయిటేజీ ని ప్రకటించారు. ఈ మేరకు మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి లేఖ రాసినట్లు తెలిసింది. వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ నెలలో ఎన్ని రోజులు హాజరయ్యారనే అంశానికి ఎపి సిఎం ఎంఎస్‌ యాప్‌ ద్వారా గుర్తించి వారికి 5 శాతం వెయిటేజీ, సర్వీస్‌ రిక్వెస్ట్‌కు సంబందించి మ్యుటేషన్‌, సబ్‌ డివిజన్‌ లాంటి వాటికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని స్వీకరించామని సిడిఎంఎ ఇఆర్‌పి ద్వారా సమాచారాన్ని సేకరించి 15 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ వసూలు (ప్రయివేటు ప్రాపర్టీ) డిమాండ్‌, కలెక్షన్‌లను సిడిఎంఎ ఇఆర్‌పి యాప్‌ ద్వారా పరిశీలించి వారికి 30శాతం వెయిటేజీ ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ విధానం అమల్లోకి రానుంది.

                                                         మహిళా పొలీసులకు బహు బాధ్యతలు

  • జాబ్‌ఛార్ట్‌ సిద్ధం
  • సబ్‌ఇన్‌స్పెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : సచివాలయాల్లోని మహిళా పోలీస్‌ సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం భారీ బాధ్యతలు పెడుతోంది. ఈ మేరకు వారికి జాబ్‌ ఛార్ట్‌ కూడా సిద్ధం చేసింది. ఈ విధులు నిర్వహించే వార్డు, గ్రామ సచివాలయాల మహిళా పోలీసుపై వారి పరిధిలోని సబ్‌ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షణాధికారులుగా ఉంటారు. వారు ప్రతి నెలా మహిళా పోలీసుల పనితీరుపై కీ పర్ఫార్మెన్స్‌ ఇండికేటర్లను తయారుచేస్తారు. జాబ్‌ఛార్ట్‌ ప్రకారం మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి నేరాలపైనా మహిళా పోలీసులు దృష్టి సారించాల్సి ఉంటుంది. అక్రమమద్యం రవాణా, బాలికలు, మహిళలపై వేధింపులు, గల్ఫ్‌ దేశాలను వెళ్లే మహిళలు, వారిని తీసుకువెళ్లే సంస్థలు, వ్యభిచార ఊబిలోకి దింపుతున్న ఘటనలపైనా నిఘా పెట్టాల్సి ఉంటుంది. అలాగే స్థానికంగా తప్పిపోయిన బాలికలు, యువతుల వివరాలు కూడా సేకరించాలి. వీటితోపాటు సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారి, ఇతర నేరాలకు పాల్పడే వారి వివరాలను కూడా ఎప్పటికప్పుడు సేకరించాలి. ఇవి కాకుండా ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాల బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సైబర్‌ నేరాలు, రుణ యాప్‌లు, బ్యాంకు ఫ్రాడ్‌లు, వరకట్న నిషేధం, లైంగిక వేధింపులు, పోస్కో చట్టం, లోక్‌ అదాలత్‌ వినియోగంతోపాటు దిశ చట్టం, దిశ యాప్‌ల డౌన్‌లోడ్‌ వంటి అంశాలపై ప్రజలను మహిళా పోలీసులు చైతన్య పరచాలి. ప్రేమించి మోసం చేసే వివరాలు సేకరించడం, సోషల్‌ మీడియా నేరాలు, రోడ్‌ సేఫ్టీ బాధ్యతలు కూడా అప్పగించారు. తమకు అప్పగించిన విధులకు సంబంధించి తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు వీరు రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి పనితీరు సూచికలపై నమూనాలను కూడా సిద్ధం చేశారు. వాటిని స్థానిక ఎస్సై తయారుచేయాల్సి ఉంటుంది.