
మన దేశంలో ఇప్పుడు ఓ విచిత్రమైన వాతావరణం నెలకొని ఉంది. దక్షిణాది, కొన్ని ఇతర రాష్ట్రాలూ వర్షాభావంతో సతమతమవుతుంటే- ఉత్తరాది రాష్ట్రాలు కొన్ని రికార్డు స్థాయి వర్షాలూ వరదలతో విలవిల్లాడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో లక్షల కోట్ల ఆస్తి నష్టంతో గజగజ వణుకుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్లో నిర్మాణంలో వున్న ఒక టన్నెల్ కూలిపోయి, పదుల సంఖ్యలో కార్మికులు అందులో చిక్కుకుని చనిపోయారు. కొండ చరియలు విరిగిపడి, కొన్నిచోట్ల వంతెనలు కొట్టుకుపోయి, వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాదాపు వెయ్యి రైళ్లు రద్దయి, ప్రయాణాలు ఆగిపోయాయి. 45 ఏళ్ల తరువాత యమునా నదిలో తీవ్రస్థాయిలో వరద పోటెత్తింది. ఢిల్లీలోని అనేక జనావాసాలను ముంచెత్తింది. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం సైతం వరద తాకిడికి గురైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి, వీధుల్లోకి, ఆవాసాల్లోకి వరద నీరు చొచ్చుకు వచ్చి, రవాణా సదుపాయాలు స్తంభించిపోయి, నిత్యావసర సరుకులు అందకుండా పోయి...వరద ప్రాంతాల్లోని ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం.
2013 ఉత్తరాఖండ్ ఆకస్మిక వరదలు తరువాత ప్రతి ఏటా ఏదొక చోట ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను చూస్తూనే ఉన్నాం. చెన్నరు, బెంగళూరు, ముంబయి వంటి మహా నగరాలు వరదల్లో చిక్కుకుపోవడం, కార్లు, బస్సులు వంటి వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోవడం చూశాం. ఇలా వరస వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు అప్పటికప్పుడు హడావిడి చేయడంగా కాక, శాశ్వత పరిష్కారాలను కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులకు మూలమేమిటో శాస్త్రీయంగా పరిశీలించటం; ఆధునిక విజ్ఞానాన్ని, సాధారణ వివేకాన్ని ఉపయోగించటం చాలా అవసరం. కానీ, వర్షాల కోసం యజ్ఞాలు చేసి, వరదలకు దేవతల శాపాలే కారణమని ప్రవచించే పార్టీల, నాయకుల ఏలుబడిలో ఉన్నాం మనం. నదుల వ్యవస్థకు సంబంధించి ఒక సమగ్రమైన ప్రణాళిక కానీ, కట్టుదిట్టమైన కార్యాచరణ కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదు.
సరళీకరణ విధానాలు ప్రారంభమయ్యాక దేశంలో ప్రకృతి వనరులు కార్పొరేట్ల వ్యాపార చెరలోకి వెళ్లిపోయాయి. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా, విధ్వంసకరంగా చేపడుతున్న చర్యలు వాతావరణ సమతుల్యాన్ని విపరీతంగా దెబ్బతీస్తున్నాయని శాస్త్రజ్ఞులు ఎప్పటినుంచో చెబుతున్నారు. నివారణా మార్గాలను, పరిష్కార సూత్రాలను అనేక నివేదికల్లో వల్లె వేస్తూనే ఉన్నారు. కానీ, పాలకులు పట్టించుకున్నది ఎక్కడీ రియల్ ఎస్టేటు వ్యాపారం విస్తరించి, పట్టణాలు, నగరాల్లోని నీటి ప్రవాహ మార్గాలు పెద్దఎత్తున ఆక్రమణకు గురయ్యాయి. వాగులూ వంకలను, చెరువులను స్వార్థంతో కప్పేసి, నివాస నిలయాలుగా మార్చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోనూ చెట్ల నరికివేత విపరీతంగా సాగి, నివాసాలు వెలుస్తున్నాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాల కాలుష్యం పర్యావరణానికి తీరని హాని కలిగిస్తూనే ఉంది. వీటన్నిటి పర్యవసానంగా హిమాలయాల్లో బగిని వంటి మంచు ప్రాంతాలు కరగటం, ప్రకృతి అదుపు తప్పి అతివృష్టిగానో, అనావృష్టిగానో విరుచుకుపడడం మామూలై పోయింది !
ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రజలు బయటపడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ఢిల్లీ నగరంలోనే పీఠం వేసిన కేంద్ర పాలక వ్యవస్థ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వయంగా కోరినప్పటికీ సహాయక చర్యల్లోకి దిగలేదు. విపత్తు సమయాల్లోనూ వికృత రాజకీయాలకు పాల్పడ్డం ప్రజాస్వామిక చర్య అనిపించుకోదు. దేశ ప్రధాని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం యావత్తూ కదలి, వరద బాధితులకు భరోసా ఇవ్వాలి. తిండి, నీరు, నివాస యోగ్యత కల్పించి, అన్ని విధాలా ఆదుకోవాలి. తరువాత శాశ్వత ప్రాతిపదికన అవసరమైన చోట చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మించటం, కొండవాలు ప్రాంతాల్లో రక్షణ గోడల ఏర్పాటు, ప్రవాహ మార్గాల్లో ఆక్రమణలను అరికట్టటం వంటి చర్యలు తీసుకోవాలి. ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని, వ్యవస్థలను బలోపేతం చేయాలి. వాటి సమన్వయంతో, శాస్త్రీయమైన ఆచరణతో మాత్రమే వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి మనల్ని మనం రక్షించుకోగలం.