Feb 14,2023 07:39

        రాయలసీమ రాళ్లసీమగా మారిందని, గుక్కెడు నీటి కోసం తపిస్తుంటారని, ఉపాధి లేక గ్రామాలకు గ్రామాలు వలస పోతున్నాయని చెబుతుంటాము. కాని కృష్ణా నది నీళ్లు అటుంచగా వర్షపు నీళ్లతో పాటు పెన్నా వరద నీరు కూడా మూడేళ్ల కాలంలో 965 టియంసిలు సముద్రంపాలు కావడమే నేటి విషాదం ! వందలాది టియంసిల నీరు సముద్రంపాలు కాకుండా వాటిని ఒడిసి పట్టి నిల్వ చేసుకొనే మినీ జలాశయాలు రాయలసీమలో నిర్మించి వుంటే రెండేళ్లకొక సారైనా క్షామ పీడిత ప్రాంత ప్రజలు కొద్దిపాటి పంటలు పండించుకొనే అవకాశం లభించేది. ఎప్పుడో కాంగ్రెస్‌ హయాంలో పెన్నా నదిపై నిర్మించిన మధ్య తరహా జలాశయాలు తప్ప తదుపరి వచ్చిన ప్రభుత్వాలు పెన్నా బేసిన్‌లో కొత్తగా ఒక్క ప్రాజెక్టు నిర్మించలేదు. గండికోట గాలేరు-నగరి పథకంలో భాగంగా నిర్మింపబడింది. రాయలసీమ లోనే కాదు వర్షాభావ ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేయాలని గతంలో ఫ్యామిన్‌ కమిషన్‌ చేసిన సూచనలను ఎవరూ పట్టించుకోలేదు.
         కర్ణాటకలో పడే భారీ వర్షాలతో తరచూ పెన్నా నదిలో వచ్చే వరద నీరు పూర్తిగా నిల్వ చేసుకొనే వనరులు లేవు. కర్ణాటక నుండి అనంతపురం జిల్లాలో ప్రవేశించే పెన్నా నది ఆఖరుగా నెల్లూరు జిల్లాలో సముద్రంలో కలుస్తుంది. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ గణాంకాలు తీసుకొంటే ఈ సంవత్సరం నెల్లూరు జిల్లా లోని సోమశిల జలాశయం (పెన్నాపై ఆఖరు రిజర్వాయర్‌) నుండి 200 వందల టియంసిలు నీరు సముద్రం పాలైనది. అంత క్రితం నీటి సంవత్సరంలో అనూహ్యంగా 415 టియంసిలు నీరు అంత క్రితం సంవత్సరం 350 టియంసిలు నీరు సముద్రంలో కలసింది. పెన్నా బేసిన్‌ లో అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు ఉమ్మడి జిల్లాలున్నాయి. ఇన్ని వందల టియంసిలు నీరు సముద్రం పాలు కావడానికి బాధ్యులెవరు? పాలకులే కదా! పెన్నా నదిపై కొన్నేళ్ల క్రితం నిర్మించిన మూడు నాలుగు జలాశయాలను విస్తరించ లేకపోయినా వున్నవి వున్నట్లు పటిష్టపరిచే చర్యలు చేపట్టలేదు! శిధిలావస్థలో వున్న ఈ జలాశయాల కింద మెయిన్‌ కాలువలు డిస్ట్రిబ్యూటరీలు పరమ అధ్వానంగా వున్నాయి. రిజర్వాయర్‌లలో కొద్దిపాటి నీళ్లు వున్నా పొలాలకు పారుదల సదుపాయం లేదు. వేదవతిపై నిర్మింపబడి వున్న భైరవాణితిప్ప జలాశయంలో రెండు టిఎంసిల నీళ్లు వున్నా కాలువలు సరిగా లేవని ఇటీవల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
           గతంలో తీవ్ర వివాదాల మధ్య అయినా సోమశిల నిర్మాణం జరిగింది కాబట్టి దాని నీటి నిల్వ సామర్థ్యం 78 టియంసిలైతే ప్రస్తుతం 66.85 టియంసిలు నీరు వుంది. మరి సముద్రం పాలైన వందలాది టియంసిల నీళ్లు కూడా ''సీమ'' కెందుకు ఉపయోగ పడ లేదు? ఈ ఏడు పెన్నా బేసిన్‌ నుండి 200 టియంసిలు నీరు సముద్రం పాలైతే నేడు బేసిన్‌ లోని అన్ని జలాశయాల్లో (గండికోట గాలేరు నగరిలో భాగం) నీళ్లు పాతిక టియంసిలు కూడా వుండవు. పెన్నా నదిపై తొలి పథకం అప్పర్‌ పెన్నా (పేరూరు డ్యాం అంటారు). అప్పర్‌ పెన్నార్‌ నీటి నిల్వ సామర్థ్యం 1.81 టియంసిలైతే ప్రస్తుతం 1.45 టియంసిలు వున్నాయి. ఇన్ని నీళ్లు వున్నాయంటే ఈ రిజర్వాయర్‌ కింద కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు పరమ అధ్వానంగా వుండటమే. పెన్నా, అహోబిలం కథ మరీ దయనీయంగా వుంది. పైగా ఈ జలాశయానికి తుంగభద్ర ఎగువ కాలువ నీళ్లు కూడా వస్తాయి. 11.4 టియంసిలు నిల్వ సామర్థ్యంతో దీని నిర్మాణం జరిగితే ప్రస్తుతం 4.86 టియంసిలు నీరు వుంది. మిడ్‌ పెన్నార్‌ కథ అంతకు మించి లేదు. దీని నిల్వ సామర్థ్యం 5.17 టియంసిలైతే ప్రస్తుతం 3.39 టియంసిలు వున్నాయి. వీటన్నింటి తలదన్నే విధంగా మైలవరం జలాశయముంది. దీని నిల్వ సామర్థ్యం 9.98 టియంసిలైతే ప్రస్తుతం కేవలం 1.36 టియంసిలు వున్నాయి. ప్రభుత్వాల నిర్వాకం ఇలా వుంది.
ఇదిలా వుండగా కృష్ణానదీ జలాల్లో తమకు న్యాయమైన వాటా లేదని సీమవాసులు ఆందోళన చేస్తుంటారు. నికర జలాలు దేవుడెరుగు. కనీసం వరద జలాలనైనా నిల్వ చేసే జలాశయాలు సీమలో లేవు. శ్రీశైలం జలాశయం నుండి వందలాది టియంసిలు నీరు సాగర్‌ తదుపరి కృష్ణ బ్యారేజీ చేరి తుదకు సముద్రంలో కలిసిపోతున్నాయి.
         ఈ సంవత్సరం శ్రీశైలం జలాశయానికి వంద సంవత్సరాల రికార్డును బద్దలు చేస్తూ 2018.16 టియంసిలు నీరు వచ్చి చేరింది. ఇప్పుడు కేవలం 55.75 టియంసిలు నీరు మాత్రమే వుంది. శ్రీశైలం కింద భాగంలో నీటి అవసరం లేకున్నా రెండు రాష్ట్రాలు పోటీ పడి విద్యుదుత్పత్తి కింద వదిలేశాయి. కాని రాష్ట్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుండీ తీసుకున్న నీళ్లు కేలవం 118.72 టియంసిలు మాత్రమే. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల మేర నీరు వుంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుండి నీళ్లు తీసుకొనే వీలు వుంటుందని సీమను కోన సీమ చేస్తామని చెప్పి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎత్తిపోతల పథకం కోర్టు వివాదంలో చిక్కుకున్నది. కాని వందలాది టియంసిలు వరద నీరు శ్రీశైలం చేరినా కేవలం 118.72 మాత్రం తీసుకొన్నారంటే ప్రభుత్వ డొల్ల తనం బహిర్గతమౌతోంది. అదే విధంగా హంద్రీనీవా నుండి డిసెంబరు ఆఖరుకు కేవలం 15.21 టియంసిలు ఎత్తిపోశారు. ఫలితంగా పత్తికొండ ప్రాంతాల్లో పెట్టిన పంటలు బాగా దెబ్బ తిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.

(వ్యాసకర్త : విశ్రాంత పాత్రికేయులు,
సెల్‌ : 9848394013)
వి. శంకరయ్య

వి. శంకరయ్య