Nov 09,2022 09:47
  • ఎలక్టొరల్‌ బాండ్స్‌ నిబంధనలు సవరించిన కేంద్రం

న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికల్లో గెలుపుకోసం బిజెపి అడ్డదారులు తొక్కుతోంది. కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలను ఇష్టం వచ్చినట్లు మారుస్తోంది. ఎలక్టోరల్‌ బాండ్స్‌ చట్టబద్దతపై సుప్రీంకోర్టు ఒకవైపు విచారణ చేస్తోంది. మరోవైపు ఎన్నికల నిబంధనావళి అమలులో ఉంది. అయినా, ఎలక్టొరల్‌ బాండ్ల రూపంలో కార్పొరేట్‌ నిధుల ప్రవాహానికి కేంద్ర ప్రభుత్వం గేట్లు ఎత్తివేసింది. ఈ మేరకు నవంబర్‌ నెలలో కూడా బాండ్ల అమ్మకానికి అనుమతి ఇస్తూ గుట్టుచప్పుడు కాకుండా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపేలా మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంగళవారం వెలుగులోకి రావడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. 2018లో ఎలక్టొరల్‌ బాండ్స్‌ను ప్రవేశపెడుతూ జారీ చేసిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం వాటి విక్రయానికి వీలులేదు. ప్రతి ఏటా జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబర్‌ నెలల్లో ప్రతి నెల పదిరోజులు ఎలక్టోరల్‌ బాండ్లను విక్రయిస్తారు. సాధారణ ఎన్నికలు జరిగే సంవత్సరంలో అదనంగా మరో 30 రోజులు బాండ్ల ఆమ్మకానికి అవకాశం ఉంది. వీటిని కార్పొరేట్‌ సంస్థలు కొనుగోలు చేసి తమకు నచ్చిన రాజకీయపార్టీకి విరాళంగా ఇయ్యవచ్చు.
 

                                                                    తాజా సవరణ ఏమిటి ?

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ల అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల నగారా మోగినప్పటికీ ఎలక్టొరల్‌ బాండ్స్‌ నిబంధనలు కార్పొరేట్‌ సంస్థల నుండి విరాళాల సేకరణకు ఆటంకంగా మారాయి. ఆ నిబంధనల ప్రకారం జనవరిదాకా కార్పొరేట్‌ సంస్థల నుండి కొత్తగా విరాళాలు తీసుకోవడానికి వీలులేదు. దీంతో వాటిని సవరిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సవరణ ప్రకారం ఈ నెల 9వ తేదినుండి 15 వ తేది వరకు ఎలక్టోరల్‌ బాండ్లను విక్రయించవచ్చు. ఈ బాండ్లను కార్పొరేట్‌ సంస్థలు కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళంగా ఇయ్యవచ్చు. 2020-21 సంవత్సరంలో ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో వచ్చిన నిధులలో 75 శాతం బిజెపికే అందాయి. మరోవైపు ఈ ఏడాది జులైలో 389.50 కోట్ల రూపాయల విలువైన ఎలక్టొరల్‌ బాండ్ల విక్రయం జరగ్గా, అక్టోబర్‌లో 10,246 కోట్ల రూపాయల బాండ్లను కార్పొరేట్‌ సంస్థలు కొనుగోలు చేశాయి.

                                                                    అవినీతికి చట్టబద్దతే : ఏచూరి

ఎలక్టొరల్‌ బాండ్స్‌కు అనుమతించడం రాజకీయ అవినీతికి చట్టబద్దత కల్పించడమేనని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఈ మేరకు చేసిన ట్వీట్‌లో ఎలక్టోరల్‌ బాండ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వీటి రాజ్యాంగ బద్దతపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిసెంబర్‌ఆరున విచారించనుందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా విక్రయాలకు ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు.
 

                                                                       కోడ్‌ ఉల్లంఘనే : ఎడిఆర్‌

ఎన్నికల వేళ ఎలక్టొరల్‌ బాండ్స్‌కు అనుమ తించడం ఎలక్షన్‌కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఎలక్టొలర్‌ వాచ్‌డాగ్‌ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ జగదీప్‌ ఎస్‌ చొక్కార్‌ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో గేట్లు పూర్తిగా ఎత్తివేసినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు.
 

                                                              దిగ్భ్రాంతి కలిగిస్తోంది : లోకేష్‌ భత్ర

సుప్రీంకోర్టులో విచారణలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దిగ్భ్రాంతి కలిగిస్తోందని సమాచార హక్కు కార్యకర్త లోకేష్‌ భత్ర పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో దాదాపుగా సంవత్సరం మొత్తం కార్పొరేట్‌ నిధులు పార్టీలకు అందుబాటులో ఉంచినట్టైందని తెలిపారు.