May 17,2023 08:36
  • ఖర్గే, రాహుల్‌ విస్తృత మంతనాలు
  • సిద్ధూ, డికెలతో కొలిక్కిరాని చర్చలు
  • సిఎం ఆశావహులతో నేడు మలి విడత భేటీ

న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై సందిగ్ధత వీడలేదు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న మాజీ సిఎం సిద్ధరామయ్య, కర్ణాటక ప్రదేశ్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షులు డికె శివకుమార్‌తో కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం మంగళవారం విడివిడిగా జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, యువనేత రాహుల్‌ గాంధీ, ఎఐసిసి ప్రధానకార్యదర్శి కెసి వేణుగోపాల్‌, నూతన ఎమ్మెల్యేల్లో కొందరు విడిగా సమావేశమై ముఖ్యమంత్రి అంశంపై మంతనాలు జరిపారు. లౌకికవాదంపై నిర్భయంగా నిలబడే నేతగానూ, ప్రజల్లో విశేషాదరణ కలిగిన నేతగానూ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే అధిష్టానం మొగ్గు చూపినట్లుగా కథనాలు వెలువడ్డాయి. అయితే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తనదైన ప్రత్యేక వ్యూహాలతో బిజెపిని మట్టికరిపించి కాంగ్రెస్‌ను విజయతీరానికి చేర్చిన నేతగా పిసిసి చీఫ్‌ డికె శివకుమార్‌కు పెరిగిన ప్రాబల్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనను కూడా అధిష్టానం కాదనలేకపోతోంది. ఈ నేపథ్యంలో 'ముఖ్యమంత్రి ఎవరు?' అనే అంశాన్ని ఢిల్లీలో ప్రకటిస్తే బావుండదని, బెంగళూరులోనే ప్రకటిస్తే మంచిదన్న అభిప్రాయానికి అధిష్టానం వచ్చినట్లు ఎఐసిసి శ్రేణులు తెలిపాయి. చర్చలు, మంతనాల సారాంశాన్ని ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి వివరించిన తర్వాత ఆమె నిర్ణయాన్ని కూడా తీసుకొని బుధవారం నాడు బెంగళూరులో ప్రకటన చేయనున్నారు. సిమ్లాలో ఉన్న సోనియా మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకోగానే ఖర్గే ఆమెను కలవనున్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించడానికి ముందు ఈ ఇద్దరు నేతలతో ఖర్గే మరోసారి సమావేశమయ్యే అవకాశముందని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
 

                                                                   శివకుమార్‌ గ్రూపు వాదన

కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద శివకుమార్‌, సిద్ధరామయ్య గ్రూపు ఎవరికి వారు తమ వాదనలను బలంగా వినిపించినట్లు తెలిసింది. పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం శివకుమార్‌నే ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఆయన గ్రూపు వాదించింది. సిద్ధరామయ్య ఇప్పటికే ఐదేళ్లు పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారని, అయితే 2018లో ఆయన నేతృత్వంలో పార్టీ ఓడిపోయిందని, ఇప్పుడు ఆయన వయస్సు 76 ఏళ్లు అయినందున కొత్తవారికి అవకాశం ఇచ్చి హుందాతనం నిలుపుకోవాలని శివకుమార్‌ గ్రూపు వాదించినట్లు తెలిసింది. 2006లో కాంగ్రెస్‌లో చేరిన సిద్ధరామయ్యకు మరోమారు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించి కెపిసిసి చీఫ్‌ (శివకుమార్‌) వంటి నిబద్ధత కలిగిన నేతను బలిపెట్టరాదని చాలా మంది సీనియర్లు వాదించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగానూ, ప్రతిపక్ష నేతగానూ పార్టీ కంటే తన స్వీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారంటూ శివకుమార్‌ అధిష్టానం ఎదుట విన్నవించినట్లు తెలిసింది. ఆయన మూలానే పార్టీలో ముఠాలు పెరిగి, 2019 జులైలో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు దారితీసిందని కూడా శివకుమార్‌ కేంద్ర నాయకత్వం ఎదుట వాపోయినట్లు సమాచారం. 'సిద్ధరామయ్య అనుచరులే ముఠాలుగా ఏర్పడి పార్టీపై చీలికలు తెచ్చారు' అని డికె శివకుమార్‌ పేర్కొన్నట్లుగా ఆయన సన్నిహితులు మీడియాకు తెలిపారు.
 

                                                     మంగళవారం మధ్యాహ్నం నుంచి మంతనాలు

అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్న డికె శివకుమార్‌ పార్టీ అధినాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఖర్గేతో సమావేశమై తనకే ఎందుకు ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టాలో శివకుమార్‌ వివరించారు. ఖర్గేతో సమావేవం అనంతరం శివకుమార్‌ మీడియా ప్రతినిధులతో మాట్లడలేదు. అంతకుముందు కెపిసిసి చీఫ్‌గా తాను రాజీనామా చేసే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ బయల్దేరే ముందు కెపిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు కథనాలు వస్తున్నాయి కదా ! దీనిపై మీ స్పందన ఏంటంటూ మీడియా అడిగిన ప్రశ్నకు శివకుమార్‌ ఘాటుగా స్పందించారు. తాను పార్టీకి వెన్నుపోటు పొడిచే రకం కాదని చెప్పారు. 'మా పార్టీయే మా తల్లి. మాకు మేముగా పార్టీని నిర్మించుకున్నాం. రాజీనామా ప్రశ్నే లేదు' అని ఆయన చెప్పారు.
 

                                                      శివకుమార్‌ తర్వాత సిద్ధరామయ్య చర్చలు

మంగళవారం సాయంత్రం శివకుమార్‌తో ఖర్గే చర్చలు జరిపిన తర్వాత అప్పటికే ఢిల్లీ చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అధిష్టానంతో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గేతో సహా పలువురు కేంద్ర నాయకులతో సిద్ధరామయ్య చర్చలు జరిపి తనదైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. కొత్తగా ఎన్నికైన 135 మంది ఎమ్మెల్యేల్లో మెజార్టీ మద్దతు తనకుందని సిద్ధరాయమ్య సోమవారం నాడే ప్రకటించారు. ఎసిఐసిసి ప్రధానకార్యదర్శి, కర్ణాటక ఇంఛార్జీ రణదీప్‌ సూర్జేవాలా, ప్రధానకార్యదర్శి (సంస్థాగత) కెసి వేణుగోపాల్‌తోనూ సిద్ధరామయ్య విడివిడిగా సమావేశమయ్యారు.
 

                                                                     రాహుల్‌, ఖర్గే మంతనాలు

కర్ణాటక వ్యవహారాన్ని సముతుల్యతతో కొలిక్కి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే నివాసానికి మంగళవారం ఉదయమే చేరుకున్నారు. సీనియర్‌ నాయకులు వేణుగోపాల్‌, సూర్జేవాలాతో కలిసి ఖర్గేతో రాహుల్‌ కర్ణాటక నాయకత్వ అంశంపై మంతనాలు జరిపారు. ఏదేమైనా సిద్ధరామయ్య, శివకుమార్‌ గ్రూపులతో ఎవ్వరి ధీమా వారిదే. అగ్రనాయకత్వం తమకంటే తమకే పట్టం కడుతుందని ఇరువురి గ్రూపులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఠాలుగా పార్టీ చీలికలై చెల్లాచెదరు అయిన పరిస్థితిల్లో డికె శివకుమార్‌ చాకచక్యంగా వ్యవహారాన్ని కొలిక్కి తీసుకొచ్చి జవసత్వాలు నింపారనీ, పార్టీ సంస్థాగత ప్రధానకార్యదర్శి కెసి వేణుగోపాల్‌ ఈ విషయాన్ని దగ్గరుండి పరిశీలించారని అందువల్ల శివకుమార్‌కే ముఖ్యమంత్రి పీఠం ఖాయమని ఆయన గ్రూపు భావిస్తోంది. వొక్కలింగాలు, లింగాయత్‌లు వంటి సామాజిక తరగతుల నుంచి కూడా శివకుమార్‌కు విశేష మద్దతు ఉందని, అందువల్లే ఆయనకే అధిక అవకాశాలున్నాయన్నది వారి అంచనా. వ్యక్తిత్వ పలుకుబడి ఆధారంగా రాజకీయాలు ప్రభావితం చేయాలనేది సిద్ధరామయ్య శైలి అని అది కాంగ్రెస్‌కు చెల్లుబాటు కాదనేది కూడా వారి వాదనగా ఉంటోంది. అయితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలు తమ నాయకుడికే మద్దతు ఇస్తున్నారని ఆయన సిద్ధరామయ్య గ్రూపు వాదిస్తోంది. మైనార్టీలు, ఓబిసిలు, దళితులను కలిసికట్టుగా 'అహిందాలు'గా తెరపైకి తీసుకొచ్చి ప్రజల్లోకి కాంగ్రెస్‌ను తీసుకెళ్లి జనాధారణ కలిగిన నేతగా సిద్ధరామయ్యకే అధిష్టానం పట్టం కడుతుందని విశ్వసిస్తున్నారు.