Jul 02,2023 11:31

నల్లగా, నిగనిగలాడుతూ చూడగానే నోరూరించేలా ఉంటాయి నేరేడు పండ్లు. అనాది నుంచి ఆయుర్వేదంలో మంచి ప్రాశస్త్యం కలిగిన పండు నేరేడు. దీని శాస్త్రీయ నామం 'షైజీజియం క్యుమిని'. ఇది మిర్టేసి కుటుంబానికి చెందినది. ప్రకృతి సిద్ధంగా లభించే పోషక, ఔషధ గుణాలున్న పండ్లలో నేరేడు ఒకటి. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలంగా ఉన్నాయి. ఒక్క పండే కాదు.. ఈ చెట్టు ఆకులు, బెరడు, గింజలు కూడా ఔషధీయాలే. మైగ్రేన్‌, బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు నివారించే లక్షణాలు దీనిలో ఉన్నాయి. నోటి దుర్వాసన తగ్గిస్తుంది. కాలేయం పనితీరుని మెరుగు పరచడం, రక్తక్యాన్సర్‌ కారకాలను నిరోధించే గుణాలు నేరేడులో ఉన్నాయి. గ్లైకమిక్‌ ఇండెక్స్‌ అధికంగా ఉన్నందున మధుమేహవ్యాధిని నియంత్రించడంలో ఘనాపాటి. అయితే జూన్‌, జులై నెలల్లో మాత్రమే లభ్యమయ్యే ఈ పండుని రకరకాల రుచుల్లోనూ తీసుకోవచ్చు. ఆ కొత్త రుచులేమిటో తెలుసుకుందాం.

juice

                                                                             జ్యూస్‌...

కావలసినవి : నేరేడు పండ్ల గుజ్జు - కప్పు , పంచదార - 1/4 కప్పు, ఉప్పు - 1/2 స్పూను, నల్ల ఉప్పు - 1/2 స్పూను, పచ్చిమిర్చి - అంగుళం ముక్క, నీరు - కప్పు
తయారీ : శుభ్రంగా కడిగిన నేరేడు పండ్లను విత్తనాలు తీసి గుజ్జును మాత్రమే మెత్తగా మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి. జార్‌లో నీరు, పంచదార, ఉప్పు, నల్ల ఉప్పు, పచ్చిమిర్చి ముక్క అన్నింటినీ వేసి మిక్సీ పట్టి నేరేడు గుజ్జును కలిపి ఒక్కసారి గ్రైండ్‌ చేయాలి. అంతే ఔషధ గుణాలు కలిగిన, రుచికరమైన నేరేడు పండ్ల జ్యూస్‌ రెడీ అయినట్లే. ఈ జ్యూస్‌ను గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగానూ తీసుకోవచ్చు.

tt

                                                                                 షర్బత్‌...

కావలసినవి : నేరేడు పండ్లు - కప్పు, పంచదార- కప్పు,
ఉప్పు - స్పూను, వేయించిన జీలకర్ర పొడి - 1/2 స్పూను
తయారీ : శుభ్రంగా కడిగిన నేరేడు పండ్లలో గ్లాసు నీరు పోసి స్మాష్‌ చేసి, వడకట్టాలి. జార్‌లో నీరు, పంచదార, ఉప్పు, దోరగా వేయించిన జీలకర్ర పొడి వడకట్టిన జ్యూస్‌ అన్నింటినీ మిక్స్‌ చేయాలి. దీనిని మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్‌ చేసుకుంటే చల్లని, కమ్మని నేరేడు పండ్ల షర్బత్‌ తయారైనట్లే.

033

                                                                           ఐస్‌క్రీమ్‌...

కావలసినవి : నేరేడు పండ్లు - కప్పు, పంచదార - కప్పు, పాలు - కప్పు, మిల్క్‌ పౌడర్‌ - కప్పు ,
మీగడ - కప్పు
తయారీ : నేరేడు పండ్ల గుజ్జును మాత్రమే మెత్తగా మిక్సీ పట్టాలి. వేరొక జార్‌లో పాలు, పంచదార, మిల్క్‌ పౌడర్‌, మీగడ తీసుకొని మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఆ మిశ్రమానికి నేరేడు పండ్ల గుజ్జును కలిపి ఒక్కసారి గ్రైండ్‌ చేసి, గాలి చొరబడని ఒక వెడల్పు గిన్నెలో ఈ మిశ్రమాన్ని పోసి, నేలపై రెండు సార్లు తట్టి మూతపెట్టి ఐదు గంటలపాటు డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి. అంతే పిల్లలూ, పెద్దలూ ఎంతో ఇష్టపడే నేరేడు పండు ఐస్‌క్రీమ్‌ తయారైనట్లే.

jam

                                                                                జామ్‌...

కావలసినవి : నేరేడు పండ్లు - 1/4 కేజీ, పంచదార - 50 గ్రా., నిమ్మ రసం - 2 స్పూన్లు
తయారీ : ముందుగా శుభ్రంగా కడిగిన నేరేడు పండ్లను గింజలను తొలగించి, గుజ్జును మెత్తగా మిక్సీ పట్టాలి. దానిని అడుగు మందంగా ఉన్న వెడల్పు పాత్రలోకి తీసుకొని హైఫ్లేమ్‌ మీద ఒక పొంగు వచ్చేంతవరకూ ఉడికించాలి. తర్వాత లోఫ్లేమ్‌లో ఉంచి మధ్య మధ్యలో తిప్పుతూ 30 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికేటప్పుడు పైకి తేలే నురుగును తీసివేయాలి. కొంచెం చిక్కగా అయిన తర్వాత పంచదార, నిమ్మరసం వేసి బాగా తిప్పాలి. పంచదార కరిగి పలుచగా అయిన జామ్‌ మిశ్రమం చిక్కబడి కాస్త మెరుపుతో కన్పించేంత వరకూ ఉడికించాలి. తయారైందనుకున్నప్పుడు స్పూను జామ్‌ను ఒక ప్లేట్‌ మీద వేసి పరీక్షిస్తే అంచుల వెంబడి నీరులా కన్పించకపోతే జామ్‌ పర్‌ఫెక్ట్‌గా తయారైనట్లే. చల్లారిన తర్వాత సీసాలో పెట్టుకుంటే ఆరు నెలల వరకూ ఉంటుంది. ఫ్రిజ్‌లో అయితే మరింత తాజాగా ఉంటుంది. మంచి రంగుతో షైనింగ్‌తో ఉన్న ఈ జామ్‌ బ్రెడ్‌, చపాతీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.