
'దయచేసి గేటు వేయండి' బారెడంత నోరుతెరిచి లిఫ్ట్ అన్నిఫ్లోర్లనూ వేడుకుంటోంది.. అంతకు ఒక్క నిమిషం ముందు పోలీస్ జీప్ ఆగీ ఆగగానే.. అపార్ట్ మెంట్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం పిడుగులా పడింది..
అమ్మోరుపూనినట్టు ఉన్నట్టుండి టీవీలకు పెద్దసౌండ్‌తో బిగ్ బ్రేకింగ్ పూనకం మొదలైంది. అప్పటిదాకా ప్రసారమవుతోన్న కార్యక్రమాలను నిలిపేసి ఆ న్యూస్ టెంప్లేట్‌ను చెవులు హోరెత్తేలా పదేపదే ప్రసారం చేస్తున్నాయి. ఏచానెల్‌కు ఆచానెల్ తమదే ఎక్స్‌క్లూజివ్ అని బోర్డు వేళాడ గట్టుకుంటున్నాయి..
ఖాదర్ చనిపోయాడన్న వార్త క్షణాల వ్యవధిలో మార్మోగింది.. తను ప్రముఖ కథా రచయిత కావటం న్యూస్ చానెళ్లు అటెన్షన్ పే చేస్తున్నాయి.. ఒక్కసారిగా మీడియా హైలెట్ చేయటంతో అతనెవరో తెలుసుకోవాల్సిన అవసరం లేనోళ్లకూ తెలిసిపోయి రొండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది..
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం వాహనాలు పది పదిహేను నిమిషాల వ్యవధిలో వచ్చిచేరాక గుండెకొట్టుకుంటున్న శబ్దం ఆ ఫ్లాట్స్‌లో కొందరికి స్పష్టంగా వినిపిస్తోంది.. స్నైఫర్ డాగ్ వాసన పసిగడుతూ అక్కడక్కడే తిరుగుతోంది.. తలెత్తి అపుడపుడూ పైకి చూస్తోంది.. అక్కడినుంచి వెళ్లబోతూ మళ్లీవెనక్కు వస్తోంది..
'ముందుగా ఎవరు చూసారు'
ఖంగుమని మోగిన సీఐ గొంతు కారిడార్ వైపు కదలగానే.. క్లూస్ టీం పని మొదలయ్యింది..
టీషర్ట్, జీన్స్ షార్ట్‌తో ఉన్న డెడ్ బాడీ హాల్లో బోర్లా పడుంది.. పొట్ట కిందినుంచి సిరారంగు కొంతదూరం ప్రవహించి ఆరిపోయుంది.. అది రక్తమే అన్నంతగా నీచు వాసనొస్తోంది.. అబ్ స్ట్రాక్ట్ పెయింటింగ్ చిత్రించినట్టు గోడమీద నల్లసిరా రంగు ధారలుగా కారింది.. ఫ్లోర్ మీద సీసా పగిలినట్టు గాజుపెంకులు మెరుస్తున్నాయి.. బూటుకాలితో తొక్కినట్టుగా ఇంకు పిల్లర్ మరోచోట పడుంది..
'టర్న్ ద బాడీ'
క్లూస్ టీం అధికారి ఆదేశించగానే బోర్లా ఉన్న మృత దేహాన్ని కానిస్టేబుల్ వెల్లకిలా తిప్పాడు.. అప్పటివరకూ అతని చాతీలో బలంగా దిగబడున్న పెన్ను నేలపైపడింది.. చిట్లిపోయి ఉన్న పాళీ ఇంకా సిరా రంగులోనే ఉంది.. సీలింగ్ ఫ్యాన్ ఎప్పటినుంచో ఇంకా తిరుగుతోంది.. గాలికి అక్కడున్న ఏ ఫోర్ సైజ్ పేపర్లు రెపరెపలాడుతున్నాయి.. కొన్ని పేపర్లమీద ఏవో రాతలు ఉన్నాయి... అలా అక్షరాలున్న ఒకపేపర్ మీద మాత్రం ఇంకు గుమ్మరించినట్టుంది.. ఇంకు అలుముకోవటం వల్ల రాసున్నది ఏంటో స్పష్టంగా కనపడటం లేదు.. హాల్లో డెడ్‌బాడీ వాసన తప్ప మరేమీ పసిగట్టలేకపోతోంది డాగ్.. ఈకేసు తమ అవసరత పరిధిలోది కాకపోవచ్చు అనుకుంటున్నాడు డాగ్ స్క్వాడ్ హెడ్.
'ఎనీ క్లూస్'.. హాల్లోకి వస్తూ అడిగాడు సీఐ..
'ఫ్యాన్ స్విచ్, రెగ్యులేటర్ సహా అన్ని ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశాను సార్.. లేటర్ విరు ఫైండ్' అని బదులిచ్చాడు క్లూస్ టీం ఇంచార్జ్..
'అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ ఉన్నారా' సీఐ అడిగేసరికి...
'హా నేనే సార్' .. అంటూ గుంపులోంచి ముందుకొచ్చాడు అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ ఆనందరావు..
'మెయింటనెన్స్ ఫీజ్ కలెక్ట్ చేస్తుంటారా ఫ్లాట్ ఓనర్స్ నుంచీ'..
'హా చేస్తాం సార్'..
'సీసీ కెమెరాలున్నాయా'.. 'హా ఉన్నాయి సార్'..
'సరే.. అవసరమైతే ఫుటేజ్ అడుగుతాం ఇవ్వండి'
'హా సార్' అని గంభీరంగా అన్నా.. ఎందుకో అతనికి ఆ క్షణం చెమటలు పోశారు'.. సీఐ అదేం పట్టించుకోకుండా 'ఓకే పోస్ట్ మార్టంకు పంపించండి' అని సిబ్బందిని ఆదేశించాక..
'ఎఫ్‌ఐఆర్‌లో వివరాలు నమోదు చేయాలి నువ్వు స్టేషన్‌కు రా' అని ఖాదర్ ఇంట్లో పనిమైనిషి మంగయ్యను ఆదేసిస్తూ లిఫ్ట్ వైపు నడిచాడు.. ఆవెంటనే సైరన్లు మోగిస్తూ ఒక్కో వాహనం కదలగానే అప్పటివరకూ అక్కడ సాగుతున్న గుసగుసతీగలకు మాటల పూలుపూస్తున్నాయి..
బబబ
'ఖాదర్ బాబు సార్ ఆయన పేరు' పోలీస్ స్టేషన్‌లో రైటర్ మొదటి ప్రశ్నకు బదులిచ్చాడు మంగయ్య..
'ఈ కథలు, గిదలు కాకుండ ఇంక ఏం జేశేటోడు'..
'సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అండీ, గానీ కరోనా టైముల కొలువు బొయ్యిందంట'
'అచ్చా.. పెండ్లి గిండ్లి అయ్యుండెనా'..
'హా.. ఆరు నెల్ల కిందనే లగ్గం అయ్యిందిగానీ ఏవోగొడవలల్ల పెండ్లాం ఇడిశివెట్టి పోయింది'..
'ఇప్పుడేం చేయట్లేదా పని గిని'
'ఉద్యోగంపోయాక కతలురాసుకొనుడులోనే గడుపుతన్నడు'
'ఫ్లాట్‌లో ఒక్కడే ఉంటున్నాడా'..
'హా, అవును గామె ఎల్లిపోయినప్పటిసంది'..
'అతన్ని కలవనీకి మాట్లాడేటందుకు ఎవలన్నా ఫ్లాట్‌కి అచ్చేటోళ్లా'
'ఎవళో అస్తున్నట్టు అనిపించేటిది గానీ నాకు ఎవలూ ఎపుడూ అవుపళ్లే'..
'గదేంది'..
'గా సార్ ఎక్కువ టైం బెడ్ రూంలో తలుపేసుకొని రాసుకుంటుండే.. లోపలకెల్లి మాత్రం ఎవలెవలో ఆయినతోని వాదిస్తున్నట్టు ఇనపడ్తుండేటిది.. గా విషయం మీద ఆయనతో ఒక్కొసారి ఒక్కో మతపోళ్లు గొడవ పడుతున్నట్టు వాళ్ల బాస యాసల్ని బట్టి అనిపించేటిది.. గాయన బెడ్ రూం తలుపు తెరుసుకొని అచ్చేప్పుడు గమనిస్తే లోపల ఎవళ అలికిడీ ఉండేటిది గాదు'..
'ఎవరు అని నువ్వు అడగలేదా అతన్ని'..
'గట్ల అడుగుడు ఇదాయకం గాదుగదా'.. ఆమాట వినగానే రైటర్ మొహం అవమానంతో ఎరుపెక్కింది..
'మీది ఏ ఊరు'..
రామాపురం సార్.. ఆపేరు వినగానే రైటర్‌కు ఏదో స్ఫురించింది..
'ఖాదర్ భార్య ఊరు కూడా అదే అన్నావ్ కదూ'..
'హా సార్ మేడం గారే నన్ను పనిలో పెట్టుకున్నారు'..
'ఆయిన చనిపోయిన ముందురోజు నువ్వు ఫ్లాట్‌కి బోలేదా'..
'లేదండీ నేను అంతకుముంగల రొండురోజుల కిందట్నే మా ఊరు బోయిన'..
'అంత సడెన్‌గా ఎందుకు వెళ్లాల్సొచ్చింది'.. అని ప్రశ్నిస్తున్నప్పుడు.. ఇంటర్ కం మోగింది. సీఐ కాల్‌చేసి ఏదో ఫైల్ తీసుకురమ్మనటంతో లేచి అటువైపెళ్లాడు..
***
కొద్ది రోజుల తరువాత.. సీఐకి ఏసీపీ ఫోన్ చేశాడు..
'మొన్నటి కేస్ ప్రోగ్రెస్ ఏంటి? ఈనెల్లో క్రైం మీటింగ్ ఉంది సీపీ గారికి రిపోర్ట్ చేయాలి కదా'
'నోప్రోగ్రెస్ సార్ ఇప్పటికీ మిస్టీరియస్‌గానే ఉంది.. పెన్ను చాతీలో బలంగా దిగబడటం వల్లే చచ్చిపోయాడని మెడికల్ రిపోర్ట్ వచ్చింది.. అది మర్డరా సూసైడో అర్థం కావట్లేదు'
'వాట్ ఎబౌట్ క్లూస్'
'ఒక్క క్లూకూడా సస్పెక్టబుల్‌గా లేదు సార్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నార్మల్.. ఇంట్లో అన్ని ఫింగర్ ప్రింట్స్ డెడ్ బాడీ ఫింగర్ ప్రింట్స్‌తోనే మ్యాచ్ అయ్యాయి.. కానీ ఆరోజు ఆ హాల్లో ఏదో గొడవ తోపులాట జరిగినట్టు ఎవిడెన్స్ ఉన్నాయి'
'సీసీ పుటేజ్ చూశారా'.. 'దేరీజ్ నో రికార్డెడ్ సార్'
'వ్వాట్'.. 'హా సార్ అపార్ట్ మెంట్‌లో సీసీ క్యాంస్ పనిచేయక చాలా కాలం అయ్యింది'
'ఈజ్ ఇట్ ప్రీ ప్లాన్'.. 'మేబీనాట్ సార్'.. 'హౌ యూ క్లియర్' ?
'అతని ఫ్లాట్‌లోని ఆ హాల్లో మాత్రం సీసీ వర్క్ చేస్తోంది సార్.. అందులో ఏదీ అబ్ నార్మల్ సీన్ లేదు'..
'బట్ హిజ్ డెత్ ఈజ్ నాట్ నార్మల్.. ఏదో మిస్టరీ ఉంది.. మరింత డెప్త్‌గా ఇన్వెస్ట్ గేట్ చేయండి' సున్నితంగా హెచ్చరిస్తూ ఫోన్ కట్ చేశాడు ఏసీపీ..
బబబ
లోతైన విచారణ కోసం సీల్ చేసిన అతని ఫ్లాట్‌లోకి మరోసారి ప్రవేశించాడు సీఐ తన సిబ్బందితో.. ఒక్క ఆధారమన్నా తప్పక దొరుకి తీరుతుందన్న తన ఉద్యోగ అనుభవంతో శోధిస్తున్నాడు.. అలా అతని డైరీ చూస్తున్నప్పుడు ఒకపేజీలో రాసున్నది చదివి ఆశ్చర్యపోయాడు.. అది కొటేషనా, కవితా, వ్యక్తిగత జీవితపు స్టేట్‌మెంటా అని ఆలోచిస్తుండగా ఖాదర్ భార్య గుర్తొచ్చింది. వెంటనే వాళ్ల ఊరు బయల్దేరాడు..
***
'మీపేరు'.. ప్రశ్నించాడు సీఐ.. 'ధనలక్ష్మి'.. అనగానే ఆశ్చర్యపోయాడు..
'హా.. మాది లవ్ మ్యారేజ్.. అతని చదువు, ఉద్యోగం, మంచితనం నచ్చి పెళ్లిచేసుకున్నా.. కానీ'.. అని అంటుండగా ఆమెవైపు మరింత ఆసక్తిగా చూశాడు..
'నా అభిప్రాయాలకు అతను పూర్తి వ్యతిరేకం' అని ఆమె పూర్తి చేయగానే..
'మీది లవ్ మ్యారేజ్ కదా.. లవ్ అంటే ఇద్దరూ లైక్ మైండెడ్ అయ్యుంటారు కదా'.. అంటుండగా.. 'హా లైక్.. తను ఎరుపు భావజాలికుడు, నాది దానిలా కనిపించే ఆరెంజ్'.. ఇంకా ఏవేవో చెప్పాక తను ఆగింది.. అర్థం కాలేదా అన్నట్టు.. 'పూర్తిగా అర్థం అయ్యింది' అనుకుంటూ.. సీఐ సిటీకి తిరుగు ప్రయాణమయ్యాడు..
***
రాత్రి పన్నెండు దాటింది పోలీస్ స్టేషన్ నిశ్శబ్దంగా ఉంది.. ఇంతలో కిటికీల్లోంచి గాలి బలంగా తోసుకురావటంతో డెత్ ఇన్సిడెంట్ జరిగిన ఫ్లాట్ నుంచి తీసుకొచ్చిన పేపర్లు రెపరెపలాడాయి.. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా వాటిని వెంట తీసుకొచ్చారు..
కథకు సంబంధించి సంభాషణలు రాసున్న ఆ కాగితాల్లో ఒకదానిపై ఇంకు పులిమినట్టుంది. దాని అడుగున కనపడీ కనపడనట్టు.. 'రక్తం తాగే రాక్షసుడు, పరమ కిరాతకుడు, మోస్ట్ కన్నింగ్ ఫెలో, పసిమొగ్గల్ని చిదిమేసే కామాంధుడు వాడిపేరు సురేష్' అన్న ఇంట్రో రాసుంది.. ఇంతలో ఆ అక్షరాల్లోంచి ఒక వ్యక్తి ఆకారం బయటికొచ్చింది.. అతను పేపర్‌లో రాసి ఉన్నది చదువుతూ పెద్దగా నవ్వసాగాడు.. కానీ ఆ శబ్దం ఎవరికీ వినిపించట్లేదు.. కాగితాన్ని మరింత తీక్షణంగా చూస్తూ గతంలోకెళ్లాడు..
'పశువును వధించటమే కసాయిత్వం అంటే రోజూ ఎన్ని చిత్ర హింసలో ఈదేశంలో మరి వాళ్ల కత్తులచేతలకు ఏపేరు పెడదాం'.. మెరుపులాంటి ఫ్లాట్‌లైన్ తట్టాక కథను ఎలా డెవలప్ చేయాలో ఆలోచిస్తున్నాడు ఖాదర్..
'కొత్తగా మొదలుపెట్టిందేమీలేదు రసూల్ అతను పాతబస్తీలో కబేళా నడుపుతుంటాడు.. మెహర్‌ను కరిగించి కొన్ని ఆవుల్ని కొనితెస్తుండగా వెంటపడి, దాడిచేసి గోశాలకు తరలించుకు పోయారు.. ఇపుడు రసూల్ మాంసదేహం వేళాడగట్టిన గడ్డి అయ్యింది'.. తన కథలో ప్రధానమైన రసూల్ పాత్రను ఎలివేట్ చేస్తుండగా.. ఏదోమంద దూసుకొస్తున్నట్టు పెద్దపెద్దగా అరుపులు కేకలు, హెచ్చరికలు వినిపించాయి.. ఏంటోనని అక్కడినుంచి లేచి బయటకెళ్లిచూస్తే ఎవరూ లేరు.. ఎంతవెతికినా ఎవరూ కనిపించలేదు.. అయినా హెచ్చరికలు బూతు తిట్లవుతున్నాయి.. మళ్లీ గదిలోకొస్తూ అప్పటివరకూ తను రాసివెళ్లిన కాగితాలు గాలికి కొట్టుకుపోతాయేమోనని మరో పుస్తకం బరువు పెట్టాడు. ఆ వెంటనే.. అరుపులు కేకలు ఆగిపోయాయి.. ఏంటో అర్థం కాకపోయినా గొడవ ఆగింది అంతే చాలు అనుకున్నాడు.. అనుకోని డిస్ట్రబెన్స్‌కు గురికావడంతో కథ కొనసాగించే మూడ్ పోయి లైట్ ఆర్పేసి పడుకున్నాడు..
రొండురోజుల తరువాత ఎప్పటిలా తన బెడ్ రూంలో కూర్చోని మరోకొత్త కథకు క్యారెక్టరైజేషన్స్ రాస్తున్నాడు.. కథలైన్ తట్టిన వెంటనే నేరుగా కథ రాయడు, తనునేర్చుకున్న స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్‌ను అనుసరించి ఒకో పాత్రస్వభావాల్ని ఒకో కాగితంపై హైలెట్ చేస్తాడు. ఆ తరువాత పాయింట్స్ ఆధారంగా కథ నడుపుతాడు.. హాల్లో టీవీలో రీడర్ చదువుతున్న వార్త కర్ణాటక కళాశాలల్లో జరుగుతున్న మత రచ్చకు సంబందించి అతనిలో స్టోరీలైన్ ఆలోచిస్తున్నాడు..
'ఇలాగే కొనసాగితే వీళ్లభయంతో మా మగపిల్లలకు ఇకపై సుంతీలూ ఉండవేమో.. అయినా మా రక్తం మాత్రం ఈమట్టికి ఎన్నడూ తలాక్ చెప్పదు'..అని రాసుకున్న లైన్‌కు అనుగుణంగా కథ ఆలోచిస్తున్నాడు..
'వాడు, షేక్, మహ్మద్, సయ్యద్, ఇలా ఇకపై మా ఇళ్లపేర్లను చెరిపేస్తాడు. ఇకపై మమ్మల్ని మేం ఎలా గుర్తుపట్టుకోవాలో'.. అని మొదటి వాక్యం ప్రారంభిస్తూ కొత్త కథలో దుష్టపాత్ర మతవిద్వేషపు రాక్షసగుణాల బుల్లెట్ పాయింట్స్ రాస్తుండటం పూర్తవుతుండగా అకస్మాత్తుగా ఆ కాగితంలో నుంచి బయటికొచ్చాడొకడు.. తను సృష్టించే పాత్రలతో సంభాషించటం కొత్తేం కాదు ఖదీర్‌కు. కానీ ఈసారెందుకో వణుకుతున్న కంఠంతో అడిగాడు
'ఏరు ఎవరు నువ్వు'..
'నువ్వు సృష్టిస్తున్న సురేష్‌ని'.. అనగానే మరింత భయమేసింది ఖాదర్ కి..
'ఎ..ఏ.. ఎందుకొచ్చవ్' అడిగాడు..
'నన్ను దుష్టుడని ఎందుకు అంటున్నావ్, నాక్యారెక్టర్‌ని మత విద్వేషిగా ఎందుకు చిత్రిస్తున్నావ్' అని సురేష్ నిలదీస్తుండగా..
'నువ్వు మైనారిటీల పట్ల క్రూరత్వం చూపుతున్నావ్, వాళ్లు ఏంతినాలో, ఏం ధరించాలో నువ్వే శాసిస్తున్నావ్, నీ ఆజ్ఞలు పాటించకపోతే వేధిస్తున్నావ్.. లౌకికదేశం అని విగ్రహాల ఎదుట సందేశాలిస్తూనే.. అలౌకికత్వం ప్రదర్శిస్తున్నావ్' అన్నాడు ఖాదర్ ధైర్యంగా.. ఆమాటలు వినగానే సురేష్ రెండడుగులు ముందుకేసి వస్తూ..
'ఏది నచ్చుతుందో, ఏదినచ్చదో చెప్పే హక్కు, అధికారం నీ ఇంట్లో నీకు ఎలా ఉంటుందో మాకూ అలాగే ఉంది.. ఇది మాదేశం.. మిమ్మల్ని వ్యతిరేకించే నా చర్యలు నా మతస్తులకు నా హీరోఇజం.. మాకు నువ్వు విలనిజం ఆపాదించటానికి వీల్లేదు.. ఇది రామరాజ్యం ఇక్కడంతా రాముళ్లే ఉండాలి రావణులని ముద్రించటానికి వీళ్లేదు.. ఇది నాహుకుం.. నచ్చనోళ్లు ఈ దేశం విడిచిపోండి'.. అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి మాయమయ్యాడు..
కళ్లు మూసి తెరిచేంతలో అతను వెళ్లిపోవటంతో సురేష్‌ను ఆవరించిన భయం తగ్గింది..
కొద్దిరోజుల తరువాత.. హాల్లో కూర్చొని రాసుకుంటున్నాడు..
'త్రివర్ణం నాదేశ సమగ్రతా చిహ్నం. కానీ అందులో రొండు రంగుల్ని చెరిపేసి ఆ ఒకేఒక్క రంగు ఆపాదించే కుట్ర జరుగుతోంది.. బాణాలు, శూలాలే కాదు, పువ్వూ భయపెడుతోంది, పులులు ఇపుడు ఆవుతోలుతో పుడుతున్నాయి' అని కథను మళ్లీ కొనసాగిస్తుండగా.. ఈసారి కాగితం లోనుంచి గర్జించాడు సురేష్..
'రేరు.. అంత చెప్పినా నీకు బుద్ధిరాలేదురా'.. అని ఆవేశంతో ఊగిపోతూ ఇంకు బాటిల్ తీసుకొని ఖాదర్ రాస్తున్న కాగితాలపై పోశాడు. అతనిపై దాడికి యత్నిస్తుండగా హఠాత్ పరిణామానికి భయపడి ఖాదర్ వెనక్కు చూస్తూ బెడ్‌రూంలోకి పరుగెత్తబోయాడు.. అది పసిగట్టి సురేష్ తన చేతిలోని ఇంకు బాటిల్ అతని తలకు తగిలేలా బలంగా విసిరాడు. కానీ అది గురితప్పి ఎదురుగా ఉన్న గోడకుతగిలి మిగిలిన ఇంకు గోడమీద కారింది.. కోపం చల్లారని సురేష్ ఖాదర్ వైపు పరుగెత్తి మెడపట్టుకున్నాడు.. విడిపించుకునేందుకు పెనుగులాడుతున్నా పట్టు వదలటం లేదు.. అప్పటివరకూ ఖాదర్ రాస్తున్న ఇంకు పెన్నును పిడికిట్లో పట్టుకొని వెళ్లి చాతీలో బలంగా గుచ్చగానే అతను మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు.. బోర్లాపడిన అతని దేహం నుండి రక్తం వస్తుండటం చూసి..
'ఇక్కడ బతకాలంటే మాకాళ్లను చూస్తూబతకాలి. మీ తలలెగరేస్తే.. ఇదుగో ఈగతే పడుతుంది' అంటూ మాయం అయ్యాడు..
అలా ఖాదర్‌ను ఎందుకు చంపింది ఎలా కసితీర్చుకున్నదీ గుర్తు తెచ్చుకొని మరింత గట్టిగా నవ్వాడు సురేష్.. కోడికూత వినపడటంతో అతను గతం నుంచి మళ్ళీ కాగితంలోకి మాయమయ్యాడు..
రచయిత సృష్టించిన పాత్ర రచయితనే చంపేసింది. భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడాలేని స్వేచ్ఛాయుత స్థితి అది..
కొంతసేపటికి ఆ కాగితం గాలికెగిరి నేలమీద పడింది.. ఫ్యాను గాలికి గదిలో అది అటూ ఇటూ కదిలాక ఉదయం తొమ్మిదింటికి స్టేషన్లో సందడి మొదలయ్యింది.. స్వీపర్ స్టేషన్‌ను ఊడుస్తోంది.. సీఐ ఫోన్ రింగ్ అయ్యింది.
'నమస్తే ధనలక్ష్మి గారు చెప్పండి' అన్నాడు..
'సార్ ఖాదర్‌కు నా మొదటి ప్రేమకానుకగా నేనిచ్చిన రెండు తులాల బంగారు పాళీ పెన్నును తిరిగి ఇప్పించగలరా' అని అడుగుతోంది..
శ్రీనివాస్ సూఫీ
9346611455