Dec 18,2022 07:20

          ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించి తమ దాష్టికాన్ని ప్రదర్శిస్తూ రైతుల మెడకు ఉరితాళ్లు బిగించే ప్రయత్నం చేస్తోంది. అమత్‌ జల్‌ పేరుతో మున్సిపల్‌ సంస్కరణల్లో భాగంగా విజయవాడ మధురానగర్‌ ప్రాంతంలో ఇంటి కుళాయిలకు మీటర్లు బిగించడం ప్రారంభమైంది. ఇంటి యజమానులకు చెప్పకుండా, వారి అనుమతి లేకుండా ఏకపక్షంగా నీటి మీటర్ల బిగింపు ప్రారంభించారు. దీనిపై వామపక్షాలు, పౌర, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.. మంచినీరు ప్రజల హక్కు, సరఫరా ప్రభుత్వ బాధ్యత అని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. సహజ వనరులపై ప్రభుత్వ పెత్తనం, ఆదాయ వనరుగా పరిగణించటం తగదు. నీటి మీటర్ల వల్ల భారం ఉండదని పాలకులు, అధికారులు చెబుతున్నా, భవిష్యత్తులో ప్రజలపై తీవ్ర భారం పడుతుంది. 24 గంటలు నీటి సరఫరా పేరుతో నీటి మీటర్లు పెట్టడం సరికాదు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో బిందెలు, బకెట్లలో నీళ్లు కొనుక్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే విద్యుత్‌ మీటర్లు, విద్యుత్‌ చార్జీల భారాన్ని ప్రజలు మోయ లేకపోతున్నారు, వెెంటనే నీటి మీటర్ల ఏర్పాటు ఆపాలి. ఇళ్లలో పెట్టిన మీటర్లు తొలగించాలని, లేకపోతే ఆందోళన తప్పదని, మీటర్లు జనమే తొలగిస్తారని చెబుతున్నారు. నీటి మీటర్లు బిగించిన ఇళ్లను నిర్వాసితుల సంక్షేమ సంఘం నాయకులు, వామపక్ష నాయకులు పరిశీలించి మాట్లాడినప్పుడు స్థానికులు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచారని, ఏనాడూ లేని విధంగా చెత్త పై పన్ను వేశారని, ఇప్పుడు మంచినీటితో వ్యాపారం చేసి ఖజానా నింపుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించటం దారుణమని మండిపడుతున్నారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు పౌరసదుపాయాలను, స్వచ్ఛమైన మంచినీటి సరఫరాను గాలికొదిలేసి.. పన్నులు వసూలు చేసే సంస్థలుగా ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి. గతంలో నీటి మీటర్లు పెట్టడానికి ప్రయత్నించినప్పుడు వామపక్షాలు, స్థానిక ప్రజలు పోరాడి అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాము. మళ్ళీ ప్రజాభీష్టానికి భిన్నంగా నీటి మీటర్లు బిగించడం ప్రజా వ్యతిరేక చర్య. గడప గడపకు వచ్చే ప్రజా ప్రతినిధులు నీటి మీటర్లపై ప్రజలకు సమాధానం చెప్పాలి.
 

- డా యం. సురేష్‌ బాబు,
బి. నాగేంద్ర ప్రసాద్‌,
రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌