ఎపిలో తమ అవసరాలను బట్టి తెలంగాణ లోబిజెపి కి మద్దతు ఆఫర్ చేయడం జనసేన టీడీపీ ల వ్యూహంగా వుంది. ఎపి తెలంగాణల విభజన సమస్యలను పరిష్కరించక పోగా జటిలం చేసి ప్రయోజనం పొందాలనుకోడం ీ బిజెపి రాజకీయ కుటిలత్వం. బిజెపి మతరాజకీయాలకు బొమ్మ బొరుసు గా మజ్లీస్ కూడా అక్కడ తన ప్రభావం చూపిస్తుంది గనక మరింత అప్రమత్తత అవసరం. తన సంక్షేమ పథకాలు ,తెలంగాణ సెంటిమెంట్ గట్టెక్కిస్తుందని బిఆర్‌ఎస్ భావిస్తుండగా కర్ణాటక తరహాలో ఇక్కడా గెలుస్తామని కాంగ్రెసు నమ్మకంగా వుంది. సర్వే లు ఏం చెప్పినా తెలంగాణ ఎన్నికల పోరాటం తీవ్రంగా నే వుంటుంది. దక్షిణ భారతంలో బిజెపి, దాని అనుకూల శక్తులు కాలూనకుండా అడ్డుకోవడం కీలకమవుతుంది.
అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. నవంబరు ఏడున మొదలై డిసెంబరు 3న ఫలితాల ప్రకటనతో ముగిసే ఈ ఎన్నికలు ఇచ్చే సంకేతాల కోసం దేశమంతా ఎదురుచూస్తున్నది. తర్వాత కొద్ది వారాల్లోనే పార్లమెంటు ఎన్నికలు కూడా జరగాల్సి వుండటం అందుకు ప్రధాన కారణం. శాసనసభల, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అచ్చం ఒకే విధంగా వుండకపోయినా ఓటర్ల సరళి, పార్టీల పోకడలు అర్థం కావడానికి తప్పక ఉపయోగపడతాయి. అందులోనూ ఈ అయిదు రాష్ట్రాలలో కీలకమైన మూడు హిందీ రాష్ట్రాలు, దక్షిణాదిన తెలంగాణ వున్నందున మిశ్రమ చిత్రాన్ని ఆవిష్కరించే ప్రత్యేక అవకాశం కలుగుతున్నది. కాంగ్రెస్ బిజెపిలే మూడుచోట్ట , బిఆర్‌ఎస్ కాంగ్రెస్ ఒక చోట తలపడుతున్నాయి గనక ఇండియా వేదిక ప్రభావం కూడా తెలిసే సందర్భం. ఎంపి, రాజస్థాన్ రెండు చోట్ల ముఖ్యమంత్రి స్థాయి నేతలనే బిజెపి పక్కన పెట్టడం, పార్లమెంటు సభ్యులను ఎంఎల్‌ఎలుగా పెద్ద ఎత్తున మోహరించడం, తెలంగాణలో గట్టెక్కడం కోసం ఆంధ్రప్రదేశ్ పరిణామాలు వాడుకోవాలని టిడిపి నాయకుడు లోకేశ్‌ను పిలిపించడం వంటివి కేంద్ర పాలకుల అభద్రతను మొదటే స్పష్టం చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే వేదికలోని వామపక్షాలకు ఇతర భాగస్వాములకు తాము ప్రధానంగా వున్నచోట సీట్ల సర్దుబాటు చేయడం, అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడం సవాళ్లుగా వున్నాయి. బిజెపి మతతత్వ రాజకీయాలను మోడీ సర్కారు ఏకపక్ష పోకడలను రాష్ట్రాలపై దాడిని నిరోధించడం తక్షణ కర్తవ్యమన్న మెళకువ పెరుగుతున్నది. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలోనే న్యూస్‌క్లిక్‌పై దాడి, అరుంధతారారు వంటి ప్రముఖ రచయితపై కొత్తగా కేసులు అంతర్జాతీయంగా ఇజ్రాయిల్ దురాక్రమణలను ఖండించకపోగా వంతపాడటం, సనాతన వివాదానికి ఆజ్యం పోయడం, అయోధ్య రామాలయానికి రాజకీయ పదును పెంచడం కనిపిస్తూనే వున్నాయి. తెలుగురాష్ట్రాల్లోనే నాలుగు పాంతీయ పార్టీలతోనూ బిజెపి డబుల్ గేమ్ ట్రిబుల్‌గేమ్ దక్షిణాది క్రీడగా మారింది.
మూడు హిందీ రాష్ట్రాలు
బిజెపి కాంగ్రెస్‌లే తలపడే రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్. గతంలో ఇవి మూడూ కాంగ్రెసే గెలిచింది. ఒక్క మధ్య ప్రదేశ్‌లో మాత్రం ఫిరాయింపులతో బిజెపి సీనియర్ శివరాజ్‌సింగ్ చౌహాన్ మళ్లీ అధికారం రేపట్టినా రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ఆపగలిగారు. చత్తీస్‌గఢ్‌లో భూపేష్ బాఘెల్ కొనసాగారు .
రాజస్థాన్ : బిజెపి నాయకులు తనకు కాస్తా అవకాశముందని భావించిన రాష్ట్రం రాజస్థాన్..అయితే మాజీ ముఖ్యమంత్రి రాజవంశీకురాలు వసుంధరారాజేను ముందుకు తేలేకపోయారంటేనే పరిస్థితి మారిందనే అభిప్రాయం ఏర్పడింది. ఇక్కడ గత ముప్పై ఏళ్లలోనూ అధికారంలో ఉన్న పార్టీని తిరిగి ఎన్నుకున్నది లేదు. సచిన్‌పైలెట్ తిరుగుబాటును ఆఖరి నిముషంలో ఆపగలిగినా అసమ్మతి అలాగేవుంది. పేపర్‌లీక్‌లు, అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. అన్నిటినీ మించి మతపరమైన ఉద్రిక్తతలు వాటిలో ఆరెస్సెస్ బిజెపి పాత్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. 2002 జూన్‌లో ఒక టైలర్ తలనరకడం, 2008 పేలుళ్ల కేసులో నిందితులు విడుదల కావడం కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయంగా బిజెపి ఆరోపణలు చేస్తున్నది. పండుగలు ఉత్సవాలు అంటే చాలు మతోద్రిక్తలు పెరుగుతున్నాయి. 1993బాబరీ విధ్వంసం తర్వాత ఎన్నికల్లో బిజెపి (బైరాన్‌సింగ్ షెకావత్)ి తిరిగిఎన్నికైన రాష్ట్రం ఇది. మోడీనే ప్రధానంగా ముందుపెట్టి అధికారంలోకి రావాలని బిజెపి పథకాలు రచిస్తున్నది. లోతట్టు ప్రాంతాల్లో చొచ్చుకు పోతున్నట్టు ఆరెస్సెస్ చెప్పుకుంటున్నది. రాజ్యవర్థన్‌సింగ్ రాథోర్, దివ్యవకుమారి ,బాబాబాలక్‌నాథ్ వంటి అనేకమంది ఎంపిలను బిజెపి నిలబెట్టింది. అయితే తమ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని కాంగ్రెస్ భరోసాగా వుంది. తాను గెలిస్తే కులగణన చేపడతానని గెల్హాట్ ప్రకటించడం కూడా అనుకూల అంశంగా భావిస్తున్నారు. ఏ కాస్త తేడా వచ్చినా సచిన్ పైలెట్ తప్పక సమస్య సృష్టించడం తథ్యమే.
మధ్య ప్రదేశ్ : ఈ రాష్ట్రం కీలకమే గాక సమస్యాత్మకమైంది కూడా. గతసారి అధికాంలోకి వచ్చిన కాంగ్రెస్ జ్యోతిరాదిత్య సింధియా ఫిరాయింపు కారణంగా 2020లో అధికారంకోల్పోయింది. ఇప్పుడు బాగా అనుకూలంగా వుందని భావిస్తున్నా. సంపూర్ణ మెజార్టీ రాకపోతే కష్టమనే భయాలు వెన్నాడుతూనే వున్నాయి. మూడుసార్ల్లు మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరుసింగ్, తాజా మాజీ కమల్‌నాథ్ పార్టీ వ్యూహాలకు నాయకత్వం వహిస్తున్నారు. కమల్‌నాథ్ బిజెపి హిందూత్వ ఎత్తులను కూడా వదలిపెట్టకుండా హనుమాన్‌భక్తి వంటి పాచికలు కూడా ప్రయోగిస్తున్నారు.ఇక రాజవంశీకుడైన జ్యోతిరాదిత్య మొదటిసారి శాసనసభకు పోటీ చేస్తుంటే కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశం ఆశ్యర్యకరంగా మారింది. మధ్యలో కొద్ది మాసాలు మినహా 18 ఏళ్లనుంచి చౌహాన్ అధికారంలో వున్నారు గనక ప్రభుత్వ వ్యతిరేకత బాగా వుంది. గతంలో మోడీకి ప్రత్యామ్నాయంగా పరివార్ వర్గాలు మాట్టాడిన చౌహాన్ పేరు ఇప్పుడు ఆఖరి జాబితాలో గాని చూపించుకోలేకపోయారు. ముగ్గురు కేంద్ర మంత్రులు, ఏడుగురు ఎంపిలను కూడా బిజెపి రంగంలోకి దింపింది. చౌహాన్ తమ తదుపరి సిఎం అని బిజెపి చెప్పడం లేదుగాని ఆయన మాత్రం తాను ఫీనిక్స్ పక్షిలా పైకి లేస్తానని ప్రకటిస్తున్నారు. మరోవైపు ఆయన ప్రభుత్వం 50శాతం కమిషన్ సర్కార్ అని కమల్‌నాథ్ దెప్పిపొడుస్తున్నారు .పట్వారీల నియామకం, మహాకాల్ లోక్‌నిర్మాణం, రషన్ కార్డుల పంపిణీ వంటి కుంభకోణాలు వున్నాయి. గతంలోని వ్యాపాం ఆరోపణలు వెంటాడుతూనే వున్నాయి. 70శాతం పైగా ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడిన ఈ రాష్ట్రంలో వర్షాభావం,గిట్టుబాటు ధరలు, దిగుబడితగ్గుదల పెద్ద సవాళ్లుగానే వున్నాయి. రాష్ట్రంలో 47 గిరిజన స్థానాలున్నాయి. అంటే 20శాతం.2018లో వీటిలో31 కాంగ్రెస్‌నే గెలిపించాయి. తిరిగి అక్కడ పుంజుకోవాలని బిజెపి తంటాలుపడుతున్నా ఈ మధ్య ఓ ఆదివాసీపై బిజెపి నాయకుడు మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర నిరసనకు కారణమైంది. ఎంపి రాజస్థాన్‌లలో కొత్తతరం నాయకులను సృష్టించుకోవడం కోసం ఇదంతా జరుగుతున్నదని ఆ పార్టీ చెబుతోంది. రాష్ట్రాలలో బలమైన నాయకుల పట్టు తగ్గించి మోడీ నేరుగా నడిపించడమనే వ్యూహం కూడా ఇందులో వుంది.
చత్తీస్‌గఢ్ : గతసారి ఎన్నికైన భూపేంద్ర సింగ్ బాఘేల్ ప్రభుత్వం అయిదేళ్లు కొనసాగింది. బాఘేల్‌కు రైతుపక్షపాతి అనే పేరున్నా సమస్యలు కూడా చాలా వున్నాయి. మూడుసార్లు ఎన్నికైన రమణ్ సింగ్‌ను ఓడించారనే పేరున్నా కాంగ్రెస్‌లో అంతర్గత సవాళ్లు తక్కువ కాదు. టిఎస్ సింగ్‌దేవ్ పార్టీలో మరో నాయకుడుగా ముందుకొస్తున్నారు. హిందూత్వ తరహాను ఏదో మేరకు భూపేంద్ర వ్యూహాత్మకంగా అమలు చేస్తారనే విమర్శ కూడా వుంది. ఆయన ఒబిసి కావడం, చత్తీస్‌గఢ్ ఆత్మగౌరవ నినాదం కలసి వస్తాయని కాంగ్రెస్ ఆశిస్తున్నది. ఎంఎల్ ఎలపై వ్యతిరేకత కూడా ప్రభావం చూపిస్తుంది. బిజెపికి రమణ్ సింగ్ ఏకైక ఆధారం కాగా హిందూత్వ మాత్రమే ప్రచారాయుధంగా వుంది. డబుల్ ఇంజన్‌సర్కార్ అయితే చత్తీస్‌గఢ్‌లో మౌలిక సదుపాయాల నిర్మాణం సాధ్యమనేది ఆ పార్టీ కీలక నినాదం. సర్వీస్ కమిషన్ అక్రమాలపై ఆరోపణలు హైకోర్టుదాకా వెళ్లడం, లిక్కర్‌స్కాం వంటివాటిని బిజెపి ప్రధానంగా ప్రచారంలో పెట్టింది. వరికి గిట్టుబాటు ధర విషయంలో వాగ్దాన భంగం,దక్షిణ బస్తర్ ఉత్తరాన సుర్గూజా ప్రాంతం బొగ్గుగనుల ప్రాంతంవంటిచోట్ల పర్యావరణం, గిరిజన సంక్షేమం,తీవ్రవాదం రాష్ట్రంలోకీలకాంశాలుగా వున్నాయి.
మిజోరం : జోరాంతంగ మిజో నేషనల్ ఫ్రంట్‌కు చెందిన వారు. పదిహేనేళ్ల విరామం తర్వాత 2018లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు.మాజీ ఉగ్రవాద నాయకుడు లాల్‌తంగా సన్నిహితుడైన జోరాం తంగకు మిజో జాతీయత గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మయన్మార్ బంగ్లాదేశ్‌ల నుంచి ఇటీవల మణిపూర్ నుంచి వచ్చిన శరణార్థుల సమస్యలను పరిష్కరించడం ఆయన విజయాలుగా చెప్పుకుంటారు. తనపైన వున్న అవినీతి కేసుల నుంచి స్థానిక కోర్టులలో బయిటపడగలిగారు. ఈ అంశమే ఆయుధంగా దెబ్బతీయాలని ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూమెంట్(జెడ్‌పిఎం) నాయకుడు కాంగ్రెస ్‌నుంచి బయటకు వచ్చిన మాజీ ఐపిఎస్ లాల్‌దుమోహ భావిస్తున్నారు. లాల్ తన్వాలా నాయకత్వంలో కాంగ్రెస్ 1984 నుంచి 2013 వరకు వరసగా విజయాలు సాధించింది, మాజీ ఆర్థిక మంత్రి లాల్‌సవాలా ప్రస్తుతం కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్నారు.
తెలంగాణ
తెలంగాణ ఎన్నికల్లో తామే వస్తామనిమొదట చాలా హడావుడి చేసిన బిజెపి మునుగోడు దెబ్బ తర్వాత తోకముడిచింది. అప్పుడు దానిపై తీవ్ర విమర్శలు చేసిన బిఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ తర్వాత కాలంలో ఆ తీవ్రత తగ్గించడం, బిజెపి ఇండియా సమదూరమని ప్రకటించడం రాజకీయ సందేహాలకు కారణమైంది. ఆయన కుమార్తె ఎంఎల్‌సి కవితపై ఢిల్లీ లిక్కర్ కేసులో నవంబర్ వరకూ ఊరట లభించింది. ఇప్పటికీ కెటిఆర్, హరీశ్‌రావు వంటివారు బిజెపిపై నిప్పులు కక్కుతున్నా ఆ సందేహాలు తొలగిపోవడం కష్టమే. ఈ మధ్యనే మోడీ సభల్లో కెసిఆర్ ఒక దశలో ఎన్‌డిఎలోకి వస్తానని అనుమతి కోరితే తాను తిరస్కరించానని చెప్పారు. దాన్ని ఖండిస్తూ వారి నాయకుడు ఎంపి లక్ష్మణ్ తమ దగ్గరకు వచ్చినట్టు కెటిఆర్ చెప్పారు. మొత్తానికి తెరవెనక రాజకీయాలు చాలా నడిచినట్టు మాత్రం ప్రజలకు అర్థమైంది. ఏది ఏమైనా కాంగ్రెస్ రాకూడదని కోరుకుంటున్న బిజెపి నేతలు మతపరమైన ప్రసంగాలు చేస్తూ ఉద్రిక్తత పెంచుతున్నారు. కొన్ని సర్వేలలో కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తున్నా పోటీ తీవ్రంగానే వుండబోతున్నది. వామపక్షాలతో సీట్ల సర్దుబాటు చర్చల సంకేతాలు పంపిన కెసిఆర్ ఏకపక్షంగా అభ్యర్థుల జాబితా ప్రకటించి అది ముగిసిపోయిందని చెప్పడం విమర్శలకు గురైంది. ప్రస్తుతం కాంగ్రెస్ వామపక్షాల మధ్య కొన్ని చర్చలు జరిగినట్లు వార్తలొచ్చినా ఏవీ ఖరారు కాలేదు. కాంగ్రెస్‌కు సహజ సిద్ధమైన అంతర్గత కలహాలు, సామాజిక వర్గాల అలకలు కొనసాగుతున్నాయి. తెలుగువారుగా తెలంగాణ పరిస్థితి ఇంకోసారి మరింత వివరంగా మాట్లాడుకోవలసి వుంటుంది. అయితే ఇటీవల ఎపి రాజకీయాల ప్రభావం తెలంగాణపై అధికంగా కనిపిస్తున్నది. ఇక్కడి నాలుగు ప్రాంతీయ పార్టీలనూ గుప్పిట్లో పెట్టుకున్న బిజెపి చంద్రబాబు నాయుడు అరెస్టును అవకాశంగాతీసుకుని టిడిపిని తన వలయంలో చేర్చుకున్నది.ఎపిలో చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో మరీ ముఖ్యంగా ఐటి కారిడార్‌లో నిరసనలు అనుమతించబోమని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. .నెమ్మదిగా ఇది కులం కోణం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఆ సామాజిక వర్గం ఓట్లు అండదండలు కాంగ్రెస్‌కే వుంటాయని కథనాలు రావడంతో బిఆర్‌ఎస్ కూడా వ్యూహం మార్చింది.ఆ తర్వాత బిఆర్‌ఎస్ మంత్రులు కూడా బాబుకు అనుకూలంగా ప్రకటనలు చేశారు.
తెలంగాణ లో రాజకీయ ఆర్థిక సమస్యలు చాలా వున్నా కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా కుల మత విభజనలే వ్యూహాలు గా ముందుకు తెస్తున్నాయి. హిందూత్వ రాజకీయానికి దూషణలు దుర్భాషలు జోడించి రెచ్చిపోయిన బండి సంజరు స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిని చేశాక కొత్త ఎత్తుగడలు మొదలెట్టారు. చంద్రబాబు అరెస్టు పై లోకేష్ ను హౌంమంత్రి అమిత్ షా తో కూచోబెట్టి ఇరువైపులా పురంధరేశ్వరి కిషన్ రెడ్డి వుండటం అందులో భాగమే.ఎన్డీయే లో చేరాలని ఉబలాటపడిన టిడిపి ని రానివ్వని బిజెపి ఇప్పుడు తన అవసరానికి ఇన్ని విన్యాసాలు చేస్తోంది.
సిపిఎం ఇప్పటికే స్పష్టం చేసినట్లు ఇండియా గ్రూపులో చేరడం లేదా చేరకపోవడం టిడిపి ఇష్టం. కానీ, ామత తత్వం, ఎపికి చేసిన అన్యాయం, రాష్ట్రాల హక్కులపై దాడి వంటి విషయాలను విస్మరించి కేంద్ర బిజెపిని తీర్పరిగా చేయడం పొరపాటవుతుంది. ఎపిలో తమ అవసరాలను బట్టి తెలంగాణ లోబిజెపి కి మద్దతు ఆఫర్ చేయడం జనసేన టీడీపీ ల వ్యూహంగా వుంది. ఎపి తెలంగాణల విభజన సమస్యలను పరిష్కరించక పోగా జటిలం చేసి ప్రయోజనం పొందాలనుకోడం ీ బిజెపి రాజకీయ కుటిలత్వం. బిజెపి మతరాజకీయాలకు బొమ్మ బొరుసు గా మజ్లీస్ కూడా అక్కడ తన ప్రభావం చూపిస్తుంది గనక మరింత అప్రమత్తత అవసరం. తన సంక్షేమ పథకాలు ,తెలంగాణ సెంటిమెంట్ గట్టెక్కిస్తుందని బిఆర్‌ఎస్ భావిస్తుండగా కర్ణాటక తరహాలో ఇక్కడా గెలుస్తామని కాంగ్రెసు నమ్మకంగా వుంది. సర్వే లు ఏం చెప్పినా తెలంగాణ ఎన్నికల పోరాటం తీవ్రంగా నే వుంటుంది. దక్షిణ భారతంలో బిజెపి, దాని అనుకూల శక్తులు కాలూనకుండా అడ్డుకోవడం కీలకమవుతుంది.
తెలకపల్లి రవి