ప్రజాశక్తి-కాకినాడ : సంక్షేమ కార్యక్రమాలను మత్స్యకారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ఎంపీ వంగా గీత సూచించారు. మత్స్యకారుల సంక్షేమంతో పాటు వారి జీవన స్థితిగతులలో సుస్థిరమైన అభివృద్ది సాధనకు రాష్ట్ర ప్రభుత్వం ఫిష్షింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ కేంద్రాల నిర్మాణాలను చేపడుతోందని వంగా గీత తెలియజేశారు. మంగళవారం బాపట్ల జిల్లా నిజాంపట్నంలో నిర్వహించిన ఐదవ విడత వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో రాష్ట్రంలోని లక్షా 23 వేల 519 మంది మత్స్యకార కుటుంబాలకు ఈ ఏడాది వేట నిషేధ కాలంలో జీవన భృతి నిమిత్తం ఒక్కక్కరికీ 10 వేల రూపాయల చొప్పున 123.52 కోట్ల ఆర్థిక సహాయాన్ని, డా.బిఆర్‌అంబేత్కర్-కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసి పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు 107.91 కోట్ల సహాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాలకు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలు నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వరా కాకినాడ ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా, జడ్ పి చైర్మన్ విపర్తి వేణగోపాలరావు, కుడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ మెరుగు పద్మలత వీక్షించి, అనంతరం జిల్లా లబ్ది దారులకు ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ పొడవైన తీరరేఖ కలిగిన మన రాష్ట్రంలో సముద్ర వేటపై జీవనం సాగిస్తున్న మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రతి కష్టంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. వేట నిషేధ కాలంలో గతం లో ఇచ్చినట్లు ఆరకొర సహాయం కాకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ఏటా 10 వేల రూపాయల చొప్పున ఐదు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం అందించిందన్నారు. అలాగే ప్రమాద వశాత్తు సముద్ర వేటలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించి ఆదుకుంటోందని తెలిపారు. మర పడవలకు డీజిల్ సబ్సీడి పెంచడంతో బాటు, ఆక్వా రైతులకు యూనిట్ రూ.1-50పై లకే విద్యుత్ సరఫరా అందిస్తోందన్నారు. సామాజికంగా ఇతర పేద వర్గాలకు అందించే ఆన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పోర్టులు, ఫిష్షింగ్ హార్బర్లు, లాండింగ్ సెంటర్ల నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మత్స్యకారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపి ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖధికారి పి.సత్యన్నారాయణ, సహాయ సంచాలకులు కె.శ్రావణి, కె.కరుణాకరరావు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, లబ్దిదారులు పాల్గొన్నారు.










