
- కాకినాడ జిల్లాలో 240 మినీ ఫిష్ అవుట్‌లెట్లకు ప్రతిపాదనలు
- ఇప్పటి వరకూ 48 మాత్రమే ఏర్పాటు
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : స్థానికంగా మత్స్య సంపద వినియోగాన్ని పెంచేందుకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు తీసుకొచ్చిన 'ఫిష్ ఆంధ్రా' పథకం జిల్లాలో లక్ష్యానికి దూరమవుతోంది. పథకం ప్రారంభమై రెండేళ్లయినా మినీ ఫిష్ అవుట్ లెట్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేకపోయారు. జిల్లాలో 76 కిలోమీటర్ల మేర సముద్ర తీరప్రాంతముంది. ఏటా 2.50 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. సుమారు 50 వేల కుటుంబాలు సముద్రపు వేట, చేపల విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా జిల్లాలో 28 వేల మెట్రిక్ టన్నుల సముద్రపు రొయ్యలు, చెరువుల్లో 1.20 లక్షల టన్నులు, ఉప్పు నీటి చెరువుల్లో 92 వేల మెట్రిక్ టన్నుల సీఫుడ్ ఉత్పత్తి జరుగుతోంది. 87 వేల మెట్రిక్ టన్నుల సముద్రపు చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. మంచినీటి చెరువుల్లో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలోనూ, సముద్రంలో చేపల ఉత్పత్తిలో రెండో స్థానంలోనూ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో రెండు ఆక్వా హబ్‌లు, 240 మినీ ఫిష్ ఔట్ లెట్లు ఏర్పాటు చేయాలని జిల్లా మత్స్య శాఖాధికారులు ప్రతిపాదించారు. తాజా స్వచ్ఛమైన చేపలను ప్రజలకు అందించడంతోపాటు ఆక్వా రైతులకు మార్కెటింగ్ అవకాశం కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో వీటిని 2021 డిసెంబర్‌లో శ్రీకారం చుట్టారు. గతేడాది జూన్ నాటికే వీటిని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 164 ప్రాంతాలను గుర్తించారు. 86 యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకులు గ్రౌండింగ్ చేశాయి. వీటిలో తాళ్లరేవు, పిఠాపురం, జి.మామిడాడ, యూ.కొత్తపల్లి, కరప తదితర ప్రాంతాల్లో మాత్రమే 48 మినీ ఔట్ లెట్లు ఏర్పాటయ్యాయి.
బ్యాంకు రుణంతోపాటు రాయితీలు
జనరల్ బిసిలకు 40 శాతం, ఎస్‌సి, ఎస్‌టి, మహిళలకు 60 శాతం రుణంగా అందజేస్తారు. లబ్ధిదారులు 15 శాతం తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం బ్యాంకు రుణం, రాయితీగా అందిస్తారు. ఇందులో కేంద్రం 60, రాష్ట్రం 40 శాతం ఇవ్వనున్నాయి. మినీ ఫిష్ అవుట్ లెట్ ఏర్పాటుకు యూనిట్‌కు రూ.1.70 లక్షల నుంచి రూ.3.02 లక్షల వరకూ, రెడీ టు ఈట్, రెడీ టు కుక్కింగ్ వంటి మత్స్య సంబంధిత ఆహార పదార్థాలను విక్రయించడం కోసం వాల్యూయేటెడ్ యూనిట్ల ఏర్పాటుకు రూ.10 లక్షలు, రూ.20 లక్షలు, రూ.50 లక్షల వరకూ రుణం మంజూరు చేస్తారు. వీటి ఏర్పాటుకు అధికారులే బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించాలి. జిల్లాకు రూ.10 లక్షల యూనిట్లు ఐదు, రూ.20 లక్షల యూనిట్లు రెండు, రూ.50 లక్షల యూనిట్ ఒకటి మంజూరైనా నేటికీ ఒక్కటి కూడా ఏర్పాటు కాలేదు. లక్ష్యానికి అనుగుణంగా రాయితీలు, రుణాలు సక్రమంగా ఇవ్వకపోవడమే ఇందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరికరాలు పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవడంతో అవుట్ లెట్ల ఏర్పాటు చాలావరకూ ప్రారంభ దశలోనే ఆగిపోయింది. ప్రారంభించిన షాపులకు కూడా చేపలు సరఫరా చేయడం లేదు. మరోవైపు అధికారులు నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించడంలో లోపాలు కనిపిస్తున్నాయి. దీంతో, వీటి ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. లక్ష్యానికి అనుగుణంగా యూనిట్లు ఏర్పాటయ్యేలా చూడాల్సిన అవసరం ఉందని నిరుద్యోగులు అంటున్నారు.