
పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు మైత్రేష్. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో, పార్ట్ టైంగా ఏదైనా పని చేయాలనుకున్నాడు. చదువుతూనే పట్టణంలోనే పేరున్న ఆటోలు బాడుగకు ఇచ్చే యజమానిని కలిసి సెలవుల్లో ఆటోను బాడుగకు ఇమ్మని అడిగాడు. మైత్రేష్ ఆధార్‌కార్డ్, రిఫరెన్స్ కోసం ఇద్దరివి మొబైల్ నంబర్లు తీసుకుని జాగ్రత్తలు చెప్పి తాళాలు మైత్రేష్ చేతికి ఇచ్చాడు. తాళాలు తీసుకున్న మైత్రేష్‌కి ఆటో డ్రైవర్లుగా నటించిన సినీ హీరోలు నాగార్జున, రజనీ కాంత్, ఎన్టీయార్ గుర్తొచ్చి గర్వంగా ఫీలయ్యాడు. అయితే వారానికే ఈ వృత్తి పూలదారి కాదని, అర్థమైపోయింది.
'గుంతలు బాబూ.. ఆటో చూసి నడుపు. మా ఇంటాయనకి గ్లుకోమా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. నాకేమో నడుము నొప్పి. జరగరానిది జరిగితే మమ్మల్ని చూసే వాళ్ళు కూడా లేరు' దీనంగా చెప్పింది ఆటోలోని వద్ధురాలు.
అలాగేనని తల ఊపి చిన్నగా ఆటోని నడుపుతున్నాడు మైత్రేష్. వానకి దారంతా గుంతలమయమై ఉంది. పట్టణానికి కిలోమీటర్ దూరంలో ఉంది ఆ కంటి ఆసుపత్రి. మంచి వైద్యం దొరుకుతుందనే పేరు ఉండటంతో ఎక్కడెక్కడి నుంచో రోగులు అక్కడికి వస్తారు. కారు సౌకర్యం ఉన్నవారు తప్పితే మిగతా అందరూ ఆటోలనే ఆశ్రయిస్తారు.
ఆలోచనల్లో ఉండగానే ఓ కారు అతివేగంగా రోడ్డు మీదికి వచ్చింది. కారు ముందు చక్రం గోతిలో పడి యాక్సిల్ విరిగిపోయింది. మరోచక్రం ఊడిపోయి, కారు పక్కకి ఒరిగి ముందుకు దూసుకెళ్ళింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో కారును అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. వెంటనే జనాలు పరిగెత్తుకుంటూ వచ్చి డ్రైవర్‌కి సహాయం చేశారు. 'రోడ్డు ఇలా ఉంటే అధికారులు, నాయకులు ఏమి చేస్తున్నారు?' అని ఆటోలోని వద్ధురాలు తిట్టిపోసింది. 'నువ్వు తిడితే ప్రపంచం మారిపోతుందా?' అని బోసి నోటితో నవ్వుతూ అన్నాడు వద్ధుడు.
ఆ రోజు రెండవ శనివారం కావడంతో బాడుగ కోసం ఎదురు చూస్తున్న మైత్రేష్‌కి రోడ్డుమీద గుంతలు దారిపొడుగునా కనిపిస్తున్నాయి. గుంతలకి ఎగిరెగిరి పడుతున్న ఓ ఆటో పెద్ద గుంతలో ఇరుక్కుపోయింది. ఆటోలోని నలుగురు ప్రయాణికులూ దిగి బండిని బలంగా నెట్టారు. బండి రోడ్డు మీదికి వచ్చి తుర్రుమంది. రోడ్డు మధ్యలో ఒకచోట ఎర్రటి బురదనీళ్ళు నిలిచి ఉన్నాయి. ట్యూషన్ వదిలారు కాబోలు, పన్నెండేళ్ళ ఇద్దరు ఆడపిల్లలు ఇంటికి వెళ్తూ అక్కడ ఆగారు. పుస్తకాల బ్యాగులు పక్కన పెట్టి నీళ్ళల్లో అటూఇటూ తిరగసాగారు. ఆ నీళ్ళనే పెద్దనదిలా భావించి 'హైహై' అంటూ ఆనందపడిపోతున్నారు.
ఇంతలో ఓ వృద్ధుడు కేటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుని, నల్ల అద్దాలు పెట్టుకుని, భార్యతో అటుగా వచ్చారు. బురద నీళ్ళలో దిగితే జ్వరం వస్తుందని పెద్దాయన భయపడుతున్నాడు. ఏమీకాదని ఆమె సర్ది చెబుతోంది. అయినా ఆయన నీళ్ళలో దిగడానికి సంశయిస్తున్నాడు. నీళ్ళల్లో ఆడుకుంటున్న పిల్లలు ఆ వృద్ధ జంట ఇబ్బందిని గమనించారు. వారిద్దరినీ కొద్దిసేపు అక్కడే ఆగమన్నారు. దారి పక్కన ఉన్న కొన్ని ఇటుకలు తీసుకొచ్చి నీళ్ళ మధ్యలో రెండు వరుసలుగా పెట్టారు. వృద్ధుడిని చెరో చేయిపట్టుకుని ఇటుకల మీద జాగ్రత్తగా నడిపిస్తూ బురద నీళ్ళను దాటించారు. పిల్లలు చేసిన సహాయానికి ఆ వృద్ధ జంట ఎంతో ఆనందపడిపోయి ఇద్దరినీ 'నిండు నూరేళ్లు పచ్చగా ఉండండ' ని ఆశీర్వదించారు.
ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన మైత్రేష్‌కు మనసు లోతుల్లో ఆనందంతో కూడిన చిన్న కదలిక వచ్చి, కించిత్ సిగ్గుగా అనిపించింది. 'సహాయం చేయాలనే ఆలోచన అంత చిన్న పిల్లలకే వచ్చినప్పుడు, నేనెందుకు నా కళ్ళ ముందరి విషయాన్ని పట్టించుకో కూడదు..! ఈరోడ్డంతా గుంతలమయం.. ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే వార్డు మెంబర్‌ని కలవాలని భావించాడు. వార్డు మెంబర్ ఇంటికి వెళ్ళి కాలింగ్‌బెల్ కొట్టాడు. వార్డ్ మెంబర్ పెంపుడు కుక్క గోళ్ళకి నైల్ పాలిష్ పెడుతున్నాడు. పనిమనిషి వచ్చి తలుపు తీసి మైత్రేష్ వచ్చిన విషయం ఏమిటని అడిగింది.
విషయం విన్న మెంబరు పెద్దగా 'వానలకి పెద్దపెద్ద ఆనకట్టలే కొట్టుకు పోతున్నాయి. మన టౌన్ రోడ్లు ఒక లెక్కా? అయినా దారిన పోయే దానయ్యలకు కూడా సమాధానమివ్వాల్సి వస్తోంది. బిజీగా ఉన్నానని చెప్పు అన్నాడు.
సరేనని ఆటో యూనియన్ ఆఫీసుకు వెళ్దామని ఆటో మళ్ళించాడు. సిగల్ పడడంతో ఆటోకి బ్రేకేశాడు. 'సిగల్ ఎప్పుడు పడబోతుందా' అని ఎదురు చూస్తున్న ఇద్దరు హిజ్రాలు మైత్రేష్ దగ్గరికి వచ్చారు. నోట్లోని బబుల్ గమ్‌ని వయ్యారంగా నములుతూ, దబాయింపుగా 'డబ్బులిరు అబ్బయ్యా' అన్నారు. 'హిజ్రాలకి కొన్ని పైసలిచ్చి ఆశీర్వాదం ఇప్పించుకుంటే మంచిదని' ఆటో ఓనర్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. పదిరూపాయల నోటు వారి చేతికి ఇచ్చాడు. వారిలో ఒకరు చప్పట్లు కొడుతూ ఉంటే ఇంకొకరు నోటుని మైత్రేష్‌కి దిగదీసి, వింతగా చూస్తున్న మైత్రేష్‌తో 'ఏరు బుల్లోడా.. దశ తిరుగుతుందిపో నీకు' అని ఆశీర్వదించాడు. చిన్నగా నవ్వాడు మైత్రేష్.
పచ్చ లైటు వెలగడంతో ఆటో స్టార్ట్ చేసి ఆటో డ్రైవర్ల యూనియన్ ఆఫీసుకు వెళ్ళాడు. ఎకరా స్థలంలో పచ్చటి చెట్ల మధ్యన ఆహ్లాదకరంగా ఉంది ఆఫీసు. ప్రధాన కార్యాలయం ముందరి సిమెంటు స్తంభం మీద పొడుగాటి పైపుకు కట్టిన ఎర్రజెండా రెపరెపలాడుతోంది. ఆఫీసు లోపల అడుగు పెట్టడంతోనే శ్రీశ్రీ, నేతాజీ, భగత్‌సింగ్ ఫోటోలు కనిపించాయి. రకరకాల పుస్తకాలు బీరువాల నిండా పేర్చి ఉన్నాయి. నాయకులెవ్వరూ అక్కడ లేరు. ధరల పెరుగుదలకు నిరసనగా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేయడానికి వెళ్ళారు. ఆఫీసు ముందర ఖాకీ డ్రెస్సు వేసుకొని ఉన్న ఒక సీనియర్ ఆటో డ్రైవర్ పేపరు చదువుతున్నాడు. 'ఏం పని మీద వచ్చావ్?' అని మైత్రేష్‌ని అడిగాడు. 'పట్టణంలో ఉన్న పెద్ద కంటి ఆసుపత్రికి వెళ్ళే రోడ్డు వానకి పూర్తిగా పాడయ్యింది. దాన్ని మన యూనియన్ తరపున బాగు చేయిద్దామని అడుగుదామని వచ్చాను' అన్నాడు మైత్రేష్.
'ఏ ఊరు నాయనా నీది!' వ్యంగంగా అని, సమాధానం కోసం ఎదురుచూడకుండానే.. 'మీ చదువుకున్నోళ్ళతో వచ్చిన తలనొప్పే ఇది. నేల మీద నిలబడరు. ఏమేమో చేయాలంటారు. అవన్నీ సినిమాల్లో సాధ్యం కానీ.. నిజ జీవితంలో కాదు. అయినా దారిన పోయే శనేశ్వరాన్ని నెత్తి మీదకు ఎందుకు తెచ్చుకుంటావు? పో.. పోవయ్యా.. వెళ్ళి బుద్ధిగా చదువుకో' అని విసుక్కుని వెళ్ళిపోయాడు. మైత్రేష్‌కి మెదడు మొద్దుబారినట్లయ్యింది.
'పెద్దాయన చెప్పేది నిజమేనా? ఇది అసాధ్యమా.. కష్ట సాధ్యమా.. అయినా ప్రయత్నిస్తే పోయేది ఏముంది.. ప్రయత్నించి చూద్దాం' అని నేరుగా హాస్టల్‌కి వెళ్ళాడు. డిప్లొమా చదివే పిల్లలందరినీ ఒకచోట చేర్చి విషయం చెప్పాడు. కొందరు 'కెవ్వుకేక' అని అరిచారు. మరి కొందరు 'ఇవన్నీ మనకెందుకురా!' అని అక్కడినుంచి జారుకున్నారు.
ఒకడైతే 'మనోడికి పబ్లిసిటీ పిచ్చి పట్టిందిరోరు' అని గట్టిగా అరుస్తూ 'అసలిది నిజమేనారా..' అంటూ, స్కూటీ మీద డుర్రుడుర్రుమంటూ ఆసుపత్రి దగ్గరకి వెళ్ళాడు. కంట్రోల్ తప్పి చిన్న గుంతలో పడ్డాడు. బట్టలన్నీ బురదతో తడిసిపోయాయి. అక్కడినుంచే మైత్రేష్‌కి ఫోన్ చేశాడు. 'అరేరు.. అర్థ గంటలో నిన్ను కలుస్తా. నా ప్యాకెట్ మనీలో నుంచి వెయ్యి రూపాయలిస్తా' అని ఫోన్ చేశాడు.
'థాంక్స్' చెప్పాడు మైత్రేష్. హాస్టల్‌లో మిగిలిన పదిమందీ తలా కొంత డబ్బు వేసుకున్నారు.
మరుసటిరోజు ఉదయం ఇద్దరు కూలీలను పిలిచి, వారితోపాటు తాము కూడా ప్యాంటులు మడిచి పనిలోకి దిగి గుంతల్ని పూడ్చసాగారు. ఆటో యూనియన్ నాయకులక ఈ విషయం తెలిసి సర్రున పది ఆటోలదాకా వచ్చి అక్కడ వాలాయి. యూనియన్ నాయకుడు నేరుగా మైత్రేష్ దగ్గరికి వచ్చి 'హలో బ్రదర్.. గుడ్ జాబ్ యూ ఆర్ డూయింగ్. వురు ఆర్ విత్ యు. తక్కువ చదువు చదివిన వాళ్ళు మాత్రమే ఈ వృత్తిని ఎన్నుకుంటారని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు. మన యూనియన్‌లో ఇంజనీరింగ్, ఎమ్‌ఏ, ఎంబిఏ, చదివిన వాళ్ళు కూడా మెంబర్లుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగమైతేనే సమాజానికి సేవ చేసే అవకాశం ఉంటుందని అనుకోవడం తప్పు. చేసేది ఏ వృత్తి అయినా మంచి పనులకు అడ్డంకి రాదు. మనసుంటే మార్గముంటుంది. ఇప్పుడు నీవు చేస్తున్న పనిలాగా..' అని షేక్‌హ్యాండ్ ఇచ్చాడు.
'చాలా సంతోషమన్నా. మేము ఇప్పుడు వేసే ఎర్ర మట్టి ఎక్కువ కాలం ఉండదు. గుల్ల, ఇసుక, సిమెంట్ కలిపి గుంతలు పూడ్చామంటే ఎక్కువకాలం ఉంటుంది. అంత డబ్బు మా వద్ద లేదు. అందుకని తాత్కాలిక ఉపశమనంగా ఎర్రమట్టి వేస్తున్నాము' అని చెప్పాడు.
డ్రైవర్లందరూ పక్కకి వెళ్లి మాట్లాడుకుని వచ్చి..
'మొత్తం ఎంత ఖర్చు అవుతుంది?' అని అడిగారు. సివిల్ ఇంజినీరింగ్ చదివే యువకులు అప్పటికప్పుడే ఎస్టిమేషన్ వేసి పాతికవేలవుతుందని తేల్చారు.
అంతే.. ఆటో డ్రైవర్లందరూ తలా రెండు వేలు చందా వేసుకున్నారు. కాంట్రాక్టర్లకు ఫోన్‌చేసి చకచకా ట్రాక్టర్లలో కావల్సినవన్నీ తెప్పించారు. పని జోరుగా నడుస్తోంది. ఇంతలో ఓ ఆటో నిండా పాలిటెక్నిక్ కాలేజీ అమ్మాయిలు వచ్చి దిగారు. 'అబ్బాయిలేనా ఇవన్నీ చేయాల్సింది. మేము చేయకూడదా? మేమూ చేస్తామని చున్నీలు నడుముకు చుట్టి పలుగూ పారా పట్టుకున్నారు. కాలేజీ పిల్లలు చేస్తున్న 'టీం వర్క్' కి దారినపోతున్న వారంతా నిలబడి, స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ చూస్తున్నట్లు చూడసాగారు. చుట్టు పక్కల కాపురముంటున్న వాళ్ళు నీళ్ళు, మజ్జిగ, పళ్ళు, తోచినవాళ్ళు తోచిన తినుబండారాలు తెచ్చిచ్చారు. మీడియా వాళ్ళు వచ్చి ఫోటోలు, చిన్నపాటి ఇంటర్వ్యూలు తీసుకున్నారు.
సాయంకాలానికి రోడ్డు మరమ్మత్తులు ఒక కొలిక్కి వచ్చాయి. రెండు రోజులుగా ఇదేపని మీద ఉన్న మైత్రేష్, ఆటో ఓనర్‌కి ఇవ్వాల్సిన రోజువారీ బాడుగ మొత్తాన్ని ఇవ్వలేదు. 'కుర్రాడు ఏమయ్యాడు, బండి ఏమయ్యింది' అని వెదుక్కుంటూ ఆటో ఓనర్ కారు తీసుకుని అక్కడికి వచ్చాడు. స్టూడెంట్స్ చేస్తున్న శ్రమదానం ఆశ్చర్యంతో చూస్తుండగానే.. మైత్రేష్ తట్టా బుట్టా పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి 'సారీ సార్' అన్నాడు.
'అరే.. ఎందుకయ్యా సారీ.. మంచిపని చేస్తున్నారు. ఇంత గొప్ప ఆలోచన చేసిన నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. రేపటినుంచీ నీవు నాకు ఆటో బాడుగ కట్టాల్సిన పనిలేదు. సమయం దొరికినప్పుడల్లా వచ్చి ఆయిల్ పోసుకుని బండి నడుపుకో.. వచ్చిన ఆదాయాన్ని పుస్తకాలకి, కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజులకు వాడుకో' అన్నాడు. యజమాని విశాల హృదయానికి ఆటో డ్రైవర్లు, స్టూడెంట్స్ అందరూ గుంపుగా చేరి చప్పట్లు కొట్టారు.
'నాది కాదయ్యా గొప్ప.. నాకెందుకులే అని.. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని, చేతులు ముడుచుకుని కూర్చోకుండా.. తనే నడుం బిగించి సామాజిక సేవ చేస్తున్న మైత్రేష్ మనందరికీ హీరో' అన్నాడు.
వెంటనే కాలేజీ కుర్రాళ్ళు చేతి రుమాళ్ళు ఊపుతూ మైత్రేష్‌ని భుజాల మీదికి ఎక్కించుకున్నారు. మిత్రులంతా ఒకటే ఈలలు..ఊళలు.. రోడ్డు పక్కనున్న కానుగపూలు కోసి మైత్రేష్‌పైకి విసిరారు అమ్మాయిలు.
మైత్రేష్ మొహం ఆనందంతో మెరుపులీనింది. 'నిజమే..' అన్నీ ప్రభుత్వమే చేయాలని ఎదురు చూడకుండా ఎవరో ఒకరు ధైర్యం చేసి 'తొలి అడుగు' వేస్తే.. వెనుక వేలమంది అనుసరిస్తారు'. అంటూ టూ వీలర్ మీద వెళ్తోన్న ఓ బ్యాంకు ఆఫీసర్ల జంట, మైత్రేష్ బృందానికి థమ్స్‌అప్ సంకేతాలిచ్చింది.
ఆర్.సి.కష్ణ స్వామి రాజు
9393662821