Sep 10,2023 12:08

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అనేక వస్తువులు.. కాలక్రమేణా మరుగున పడిపోతుంటాయి. వాటి స్థానంలో మరింత మెరుగైన పనితనంతో కొత్త వస్తువులు వస్తుంటాయి. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేటి ఆధునిక యుగంలో నిత్యజీవితంలో మనం ఉపయోగించిన వస్తువులు, లేదా మన పెద్దలు ఉపయోగించిన వస్తువులు.. కొత్త రూపాన్ని సంతరించుకోవడం మనం చూస్తూనే వున్నాం. కంప్యూటర్‌, రేడియో, టెలివిజన్‌, మొబైల్‌ఫోన్‌ వంటి వస్తువుల మొదటి రూపం చూసినప్పుడు వీటితో ఎలా పనిచేశారా? అని ఆశ్చర్యపడటం సహజం. అవే వస్తువులు ఇప్పుడు కొత్త సాంకేతికతను అద్దుకుని, సరికొత్త రూపంతో మనను అలరిస్తున్నాయి. ఆ కోవలోకి చెందినవే గడియారాలు కూడా. గడియారాలు అందుబాటులోకి వచ్చిన కొత్తలో నడుముకు వేలాడదీసుకునేవారు. ఆ తర్వాతికాలంలో అవే గడియారాలను కొద్ది మార్పులతో ముంజేతికి పెట్టుకునే ఆలోచనతో ఇంకోరూపాన్ని సంతరించుకున్నాయి. అదొక ఫ్యాషన్‌గా మారింది. స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత... చేతికి వాచ్‌లు ధరించడం చాలావరకూ తగ్గిపోయింది. ఇప్పుడంతా సమయం చూసుకోవాలంటే ముందుగా చూసేది మొబైల్‌ఫోన్‌నే. అయితే వాచీలు ధరించే పద్ధతిని మరింత కొత్తదనం వైపుకు తీసుకెళ్లింది జపనీస్‌ కంపెనీ క్యాసియో. ఇటీవల 'స్టాస్టో స్టాండ్‌ స్టోన్స్‌' సంస్థతో కలసి వేలికి ఉంగరాల్లా తొడుక్కునే ఈ వాచీలను అందుబాటులోకి తెచ్చింది. రకరకాల డిజైన్లు, రకరకాల మోడల్స్‌లో రూపొందించిన ఈ వాచీలను ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసింది. వేలికి ధరించే ఈ వాచీలలో క్యాలికులేటర్‌, డిజిటల్‌ డిస్‌ప్లే వంటి సౌకర్యాలూ ఉండటం విశేషం. వీటి ధరలూ ఆయా మోడల్స్‌ను బట్టి రూ.249 నుంచి మొదలవుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కొత్త ఒక వింత అన్నట్లుగా వేలికి ధరించే ఈ వాచీలు ఇప్పుడు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.