- రూ.2.95 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : వార్షిక బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దే కసరత్తు జరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు ఇప్పటికే మెరుగులు దిద్దగా, దానికి తుది రూపునిచ్చేందుకు ముఖ్యమంత్రి వద్దకు బడ్జెట్ ఫైలు పంపించేందుకు కూడా ఆర్థికశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్వల్పంగా మార్పులు, చేర్పులకు కూడా ముఖ్యమంత్రి సూచనలు చేసే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. మొత్తమ్మీద ఈసారి బడ్జెట్ రూ.2.95 లక్షల కోట్ల వరకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధించిన బడ్జెట్‌ను ప్రాథమికంగా సిద్ధంచేసి ముఖ్యమంత్రి పేషీకి అందించినట్లు తెలిసింది. అక్కడ దీనిని అధ్యయనం చేసి తుది బడ్జెట్ అంకెల కోసం ముఖ్యమంత్రికి సమర్పిస్తారని సమాచారం. రెవెన్యూ వ్యయమే కీలకంగా ఉంటున్న ఈ బడ్జెట్‌లో గతం కన్నా ఎక్కువగానే సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేస్తున్నట్లు తెలిసింది. గతేడాది మొత్తం రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఒక్క రెవెన్యూ వ్యయానికే రూ.2.08 లక్షల కోట్ల వరకు కేటాయింపులు చేశారు. అదే వచ్చే బడ్జెట్‌లో రూ.2.38 లక్షల కోట్ల వరకు కేటాయింపులు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ కేటాయింపులపైనే ముఖ్యమంత్రి మరోసారి అధికారులతో చర్చించి తుది అంకెలను ఖరారు చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల సంఖ్యపై కోతలు పడుతున్నట్లు వస్తున్న విమర్శలపైనా ఆర్థికశాఖ, ముఖ్యమంత్రి కార్యాలయాలు దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల బడ్జెట్ కావడంతో ప్రజల నుంచి విమర్శలు పెరగకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులకు సూచనలు వెళ్లినట్లు తెలిసింది. లబ్ధిదారుల సంఖ్య, వారికి కేటాయించే నిధుల్లో భారీగా అంతరం లేకుండా బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దాలని కూడా సూచనలు వెళ్లినట్లు తెలిసింది. మొత్తం ప్రక్రియను 15వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించడం గమనార్హం.










