Oct 17,2022 09:19

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలపై ప్రతిఘటన పోరాటాలను ఉధృతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 24వ జాతీయ మహాసభ ఆదివారం తీర్మానించింది. కార్పొరేట్లకు, అతి ధనవంతులకు అనుకూలంగా, పేద, సామాన్య ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న వినాశకర విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. మహాసభలో చేసిన తీర్మానాలను మహాసభ ప్రాంగణం మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు కె నారాయణ, అమర్‌జిత్‌ కౌర్‌, అతుల్‌ కుమార్‌ అంజన్‌, కె రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు విడుదల చేశారు. ఆర్థిక విధానాలపై చేసిన తీర్మానంలోని ముఖ్యాంశాలు... దేశంలో 1991లో మొదలైన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు మోడీ వచ్చాక ఈ ఎనిమిదేళ్లల్లో దూకుడుగా అమలవుతున్నాయి. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, కోవిడ్‌ విపత్తు మన ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాయి. అనాలోచిత లాక్‌డౌన్‌లతో వలస కార్మికులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రజారోగ్య వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. కోవిడ్‌తో 47 లక్షల మంది చనిపోయారని డబ్ల్యుహెచ్‌ఒ తెలపగా, ప్రభుత్వ రిపోర్టు పది రెట్లు తక్కువ చూపించింది. హెల్త్‌కేర్‌కు బడ్జెట్‌లో కేవలం 2 శాతమే కేటాయింపులు చేసింది. వైద్య ఖర్చులు భరించలేక ఆరున్నర కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు దిగజారారు. మానవాభివృద్ధి సూచిలో ఇండియా 133, గ్లోబల్‌ హంగర్‌ సూచిలో 107వ స్థానంలో ఉంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక కంటే దిగువనుంది.
 

                                                                      కార్పొరేట్లకు దోచిపెట్టారు

కార్పొరేట్‌ కంపెనీల పన్ను 30 నుంచి 22 శాతానికి, కొత్త ఉత్పత్తి కంపెనీల ట్యాక్స్‌ 25 నుంచి 15 శాతానికి మోడీ సర్కారు తగ్గించింది. బడా కార్పొరేట్లు బ్యాంకులకు రూ.లక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టేందుకు తన వంతు సహకరించింది. దాంతో బ్యాంకులు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఆక్స్‌ఫాం ఇండియా నివేదిక ప్రకారం 2021లో దేశంలో అత్యంత సంపన్న కుటుంబాల సంపద రికార్డు స్థాయిలో పెరిగింది. పది మంది చేతుల్లో 57 శాతం సంపద కేంద్రీకృతంకాగా, దిగువ సగం మంది చేతుల్లో 13 శాతం సంపద ఉందని తెలిపింది. మన దేశాన్ని 'చాలా అసమాతల దేశం'గా అభివర్ణించింది. కోడిడ్‌ వేళ 84 శాతం ప్రజల ఆదాయాలు క్షీణించగా, బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. లేబర్‌ బూరో రిపోర్టు మేరకు జనాభాలో 25 శాతం మంది 19-29 ఏళ్ల వయసు కలిగిన యువత ఉన్నారు. ఈ ఏడాది నాటికి నిరుద్యోగిత 34 శాతానికి పెరుగుతుంది.కానీ కేంద్రం అగ్నిపథ్‌ పేరిట సైన్యంలో కాంట్రాక్టు పద్ధతిలో నింపుతోంది.
 

                                                                         ప్రభుత్వరంగం ధ్వంసం

ప్రభుత్వరంగం మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక కాగా బ్యాంకులు, ఎల్‌ఐసి, రక్షణ రంగ ఫ్యాక్టరీలు, అన్నింటినీ మోడీ సర్కారు ప్రైవేటీకరిస్తోంది. మోనిటైజేషన్‌ ప్రాజెక్టును ముందుకు తెచ్చింది. కార్మిక చట్టాల రద్దు, లేబర్‌ కోడ్స్‌తో కార్మికుల హక్కులకు హాని తలపెట్టింది. మన జిడిపి తగ్గుతుందని అంతర్జాతీయ సంస్థలు చెప్పాయి. రూపాయి విలువ పడిపోతోంది. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వరంగాన్ని ప్రోత్సహించాలని మహాసభ డిమాండ్‌ చేస్తోంది. మన ఆర్థిక వ్యవస్థను, మన దేశాన్ని రక్షించుకునేందుకు బిజెపి ప్రభుత్వ ఆర్థిక విధానాలను ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలి. అంతకంటే ప్రత్యామ్నాయం లేదు..