
సంపన్న వర్గాలకు ప్రజల సంపదను కట్టబెడుతూ, శ్రామికులను కష్టపెడుతున్న విధానాలపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న శ్రమజీవుల ప్రతిఘటన దేశంలోని పలు ప్రాంతాల్లో ముందుకురావడం స్వాగతించదగినది. ప్రపంచవ్యాప్తంగా ఐటి కంపెనీలు లక్షలాదిమంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వాటిలో ఆసియాలో, ప్రత్యేకించి భారత్‌లో తొలగించిన వారే అధికం. ఇన్నాళ్లూ...మెరుగైన వేతనాలతో ఉద్యోగాలు చేసిన వారంతా ఇప్పుడు తమ భవిష్యత్ పట్ల తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇజ్రాయిల్... ఇలా పలు దేశాల్లో రైల్వే ఉద్యోగుల నుంచి విమానయానరంగ వేతన జీవుల వరకూ, నర్సుల నుంచి డాక్టర్లు, ఐటి, పోస్టల్ ఉద్యోగుల వరకూ దేశవ్యాప్త సమ్మెల బాట పట్టారు. ఉద్యోగాల నుంచి తొలగించొద్దని, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఓవైపు సంక్షోభంలో కూరుకుపోతున్నా... మరింతగా సంపన్న వర్గాలకు దోచిపెడుతూ...ఉద్యోగుల వేతనాలు, సౌకర్యాల్లో కోతపెట్టడంపై ఆగ్రహావేశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెన్షన్ సంబంధిత ఆందోళనలు ఉధృతం కావడం గమనార్హం.
మోడీ సర్కారుపై అలుపెరగని పోరాటం చేసి నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేలా చేసిన రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యోగ, కార్మిక వర్గాలు తమ ఉద్యమాలను ఉత్సాహంగా సాగిస్తున్నారు. దేశమంతటా గల కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర శ్రామిక ప్రజానీకం ఏప్రిల్ 5న చలో పార్లమెంటు పేరిట మహోద్యమానికి సిద్ధమవుతున్నారు. పాత పెన్షన్ విధానం (ఒపిఎస్) స్థానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సిపిఎస్) తీసుకొచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వ విధానంపై ఉద్యోగులు దేశవ్యాప్తంగా గళమెత్తుతున్నారు. దీంతో...ఒపిఎస్‌ను తిరిగి ప్రవేశపెడతామని హామీ ఇచ్చి, అమలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ముందుకొస్తున్నాయి. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయానికి ఈ హామీ దోహదం చేసిందని విశ్లేషణలున్నాయి. అధికారంలోకి రాగానే, తొలి సంతకం దాని మీదే ఆ ప్రభుత్వం పెట్టింది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్... ఇలా చాలా రాష్ట్రాలు ఒపిఎస్ అమలుకు కసరత్తును ప్రారంభించాయి. ఇంత జరుగుతున్నా... సిపిఎస్ కింద జమయిన ఉద్యోగుల చందాల సొమ్ము విషయంలో కేంద్రం మొండి వైఖరి కొనసాగిస్తోంది. రాష్ట్రప్రభుత్వాలు చెల్లించిన సొమ్మును ఇప్పుడు తిరిగి ఇచ్చేది లేదని, ఉద్యోగ విరమణ తర్వాతే ఆ డబ్బు ఉద్యోగుల చేతికి వస్తుందని తాజాగా ప్రకటించింది.
వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగుల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ఉద్యోగులంతా డిఎ పెంచాలంటూ 48 గంటల పెన్‌డౌన్‌ను కొనసాగిస్తున్నారు. తామేం బిచ్చగాళ్లం కాదంటూ 3 శాతం డిఎ పెంచుతామన్న మమతా ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో యోగి సర్కారు అవలంబిస్తున్న మొండి వైఖరిపై ఉద్యోగుల్లో ఆగ్రహ జ్వాల రగులుతోంది. వేలాదిమంది శిక్షామిత్రలు తమను రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయసును పెంచాలని లక్నోలో భారీ సభ నిర్వహించారు. ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోకుండా, ఉపాధ్యాయులు చేసే పనే చేస్తున్న తమకు రూ.10 వేలు వేతనమే ఇవ్వడమేమిటని వారు నిలదీస్తున్నారు. మరో బిజెపి పాలిత రాష్ట్రం కర్ణాటకలో అంగన్‌వాడీ ఉద్యోగులు అలుపెరగని పోరాటం చేసి గ్రాట్యూటీ హామీ పొందారు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో విద్యుత్‌రంగ ఉద్యోగులు ఉద్యమించి ప్రయివేటీకరణను నిలువరించగలిగారు. చీలిక తీసుకొచ్చి ఈ ఉద్యమాలను దారిమళ్లించేందుకు మతోన్మాద విద్వేష రాజకీయాలను మరింత ఉధృతంగా కాషాయ మూకలు తీసుకొస్తున్నాయి. గోగూండాలు రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు మైనారిటీ యువకులను కిడ్నాప్ చేసి, హర్యానాలో సజీవ దహనం చేసిన ఘటన ఇందుకు తాజా ఉదాహరణ. ఇటువంటి చీలికలను తిప్పికొట్టి రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో... ఐక్యంగా ఉద్యోగులు, కార్మికులు, శ్రమజీవులందరూ దేశవ్యాప్తంగా మరిన్ని పోరాటాలు సాగించాలి. సంపన్న వర్గాలకు దోచిపెడుతూ.. తమ హక్కులను హరిస్తున్న కార్పొరేట్ - మతతత్వ కూటమి భరతం పట్టాలి.