Sep 17,2023 08:44

పండుగలంటే అందరికీ ఇష్టమే. ఆ రోజు చేసుకునే పిండివంటలు పండుగ వెనుక ఉన్న ఉద్దేశ్యంతో ముడిపడి ఉంటాయి. ఋతువులు మారుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వినాయక చవితి సందర్భంగా చేసే పిండి వంటలు బియ్యం, అటుకులు, బెల్లం, పచ్చికొబ్బరి, శనగలు ఇలా కొన్ని ప్రత్యేక పదార్ధాలనుపయోగించి చేస్తారు. ముఖ్యంగా నూనె వాడకం ఎక్కువ లేకుండా, ఆవిరిమీద ఉడికించి చేసే వాటికి ప్రాధాన్యతనిస్తారు. వర్షాకాలంలో జీర్ణశక్తి కాస్త మందగిస్తుందనే భావనే దీనికి కారణం. మరి అన్ని మార్పులతో పాటు కుడుములు లేదా ఉండ్రాళ్ళు కూడా కొత్త రుచుల్లో చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాం.

రవ్వ ఉండ్రాళ్ళు..

1

కావలసినవి : బియ్యపు రవ్వ - కప్పు, ఉప్పు - స్పూను, నానిన పెసరపప్పు - 2 స్పూన్లు, పచ్చికొబ్బరి తురుము - 3 స్పూన్లు, నూనె - 2 స్పూన్లు, ఆవాలు - స్పూను, జీలకర్ర - స్పూను, ఎండుమిర్చి - 3, కరివేపాకు - 2 రెబ్బలు, కొంచెం ఇంగువ (ఇష్టమైతే)
తయారీ : వెడల్పు గిన్నెలో బియ్యపు రవ్వను దోరగా వేయించాలి. మంచి వాసన వచ్చేటప్పుడు కప్పు నీళ్ళు, కల్లుప్పు వేసి మీడియం ఫ్లేం మీద ఉడికించాలి. తర్వాత తాలింపు పెట్టి స్టౌ ఆపేసిన తర్వాత పచ్చికొబ్బరి తురుము వేసి ఆ వేడితోనే వేయించాలి. ఉడికిన రవ్వలో రెండు పచ్చిమిర్చి సన్నని తరుగు, కొంచెం కొత్తిమీర, నానిని పెసరపప్పు, తాలింపు మిశ్రమం వేసి రవ్వకు బాగా పట్టేటట్లు గట్టిగా కలుపుకోవాలి. దీనిని (కావలసిన ఆకారంలో) ఉండ్రాళ్ళుగా చేసుకుని ఆవిరిమీద ఉడికించాలి. అంతే ఘుమఘుమలాడే రవ్వ ఉండ్రాళ్లు రెడీ.

సజ్జ కుడుములు..

2

కావలసినవి : సజ్జలు - కప్పు, ఎండు కొబ్బరి పొడి - 4 స్పూన్లు, బెల్లం తురుము - కప్పు, యాలకల పొడి - స్పూను, నెయ్యి - స్పూను
తయారీ : ముందుగా ఐదారు గంటలు నానిన సజ్జలను వడకట్టుకొని మెత్తగా పిండి పట్టాలి. పిండిలో ఎండు కొబ్బరి పొడి, బెల్లం తురుము, యాలకల పొడి వేసి బాగా కలిపితే ముద్దగా అవుతుంది. దీనికి నీటితో పనిలేకుండానే కుడుములుగా చేసి ఆవిరిమీద ఉడికించాలి. అంతే ఆరోగ్యకరమైన సజ్జ కుడుములు రెడీ.

పెసర కుడుములు..

1

కావలసినవి : ముడి పెసలు - , నీళ్ళు - 31/4 కప్పు, పచ్చికొబ్బరి తురుము - సగం చిప్ప, బెల్లం తురుము - కప్పు, యాలకల పొడి - స్పూను, నెయ్యి - స్పూను:: బియ్యం పిండి - 11/2 కప్పు, విస్తరాకులు
తయారీ : ముందుగా పెసలను దోరగా వేయించి నీళ్లుపోసి కుక్కర్‌లో నాలుగైదు విజిల్స్‌ వచ్చేంత వరకూ ఉడికించి కొంచెం పలుకుగా మెదుపుకోవాలి. దీనిలో పచ్చికొబ్బరి తురుము, బెల్లం తురుము, యాలకల పొడి, నెయ్యి వేసి కలుపుతూ ముద్దగా అయ్యేంతవరకూ ఉడికించాలి.
తర్వాత ఒక పాత్రలో బియ్యం పిండి, చిటికెడు ఉప్పువేసి నీటితో దోశల పిండిలా జారుగా కలుపుకోవాలి. నాన్‌స్టిక్‌పాన్‌లో ఈ పిండిని తీసుకొని కలుపుతూ ముద్దగా అయ్యేంతవరకూ ఉడికించి చల్లార్చాలి. విస్తరాకుల్లో ఈ పిండిని పెట్టి పలుచగా ఒత్తాలి. దీనిలో పెసర ముద్దను ఉంచి ఆకుతో సహా పిండి అంచులు కలిసేలా వంచి ఆవిరిమీద ఉడికించాలి. ఈ రుచికరమైన పెసర కుడుములను నేతితో తింటే చాలా రుచిగా ఉంటాయి. (విస్తరాకులను కడిగి తీసుకుంటే శుభ్రంగానూ ఉంటాయి, మెత్తగా అయి విరిగిపోకుండా వంగుతాయి)