Oct 09,2022 10:38

సాగర ఘోషకు
తీరం అతలాకుతలం
జీవిత ఆటుపోట్లకు
పండుటాకుల పరేషాన్‌ !

నైతిక విలువలన్నీ తరిగి..
విత్తానికే ఎత్తుపీట వేసి..
అయినోళ్లే అనాథల్ని చేయగా..
మలిసంధ్యలో మనో వేదనలు !

ఆరోగ్య సమస్యల కుప్పలు
ఆర్థిక సంక్షోభాల్లో వృద్ధులు
సంతానమే దూరమై దుఃఖాలు
ముసలి ముతక బతుకు వెతలు !

డిజిటల్‌ యుగపు పోకడలు
ఖరీదైన కార్పొరేట్‌ చదువులు
సాఫ్ట్‌వేర్‌ వడ్డించిన కొలువులు
వేతనమే లక్ష్యంగా కాళ్లకు రెక్కలు !

సంతానమే సముద్రాలు దాట..
మనవళ్లు మనువరాళ్లు కానరాక..
ఆత్మీయ హస్తాల
స్పర్శ భాగ్యమే లేక..
వృద్ధాశ్రమాలే గతైన
నిన్నటి వీరులు !

కన్నోళ్లు కడుపులో పెట్టుకొని..
మనుమళ్లే తాతకు ఊతకర్రలై..
అయ్యవ్వల అనుభవ రెక్కలతో..
ఆకాశ అంచులు ముద్దాడుదాం !

వయోవృద్ధులు జాతి గురుతులు
పండుటాకులు
అనుభవ పునాదులు
మలిసంధ్య యోధుల మార్గదర్శనాలు
కావాలి నేటి యువతకు చుక్కానులు !
 

మధుపాళీ
9949700037