- డిబిటిలో సేల్స్ ఎంటర్ చేయని ఫలితం
- కంపెనీలకు కేంద్రం సబ్సిడీ నిలిపివేత
- దాంతో ఫెర్టిలైజర్స్‌ను ఆపిన సంస్థలు
- కొరత ఎదుర్కొంటున్న రబీ రైతు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతు భరోసా కేంద్రాలకు (ఆర్‌బికె) ఎరువుల కంపెనీలు ఎరువుల సరఫరా నిలిపేశాయి. ప్రధానంగా యూరియా సరఫరాను ఆపేసినట్లు తెలుస్తోంది. ఆర్‌బికెలు కేంద్రం ప్రవేశపెట్టిన నగదు బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్- డిబిటి) విధానాన్ని సక్రమంగా అమలు చేయనందున కంపెనీలు ఎరువుల సరఫరాను నిలిపేసినట్లు చెబుతున్నారు. ఎరువులన్నింటిలోకి ఒక్క యూరియాను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బికెలలో విక్రయిస్తుండటంతో కంపెనీలు కక్షపూరితంగా ఎరువుల సరఫరాకు కోతలు పెడుతున్నాయన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అటు కంపెనీలు ఇటు ప్రభుత్వం మధ్య రబీ రైతులను ఎరువుల కొరత వేధిస్తోంది. ఇప్పటికే రబీ పంటలు ఒక మోస్తరుగా సాగు చేసిన నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఎరువుల సమస్య ఎక్కువగా ఉంది. ఆర్‌బికెలకు దాదాపు నెల రోజులుగా యూరియా, ఇతర ఎరువుల సరఫరా నిలిచిపోయింది. నిల్వలు నిండుకున్నాయి. ప్రభుత్వ ఆర్‌బికెలలో ఎరువులకు కొరత నెలకొనడంతో అవకాశంగా తీసుకున్న ప్రైవేటు డీలర్లు అధిక రేట్లను రైతుల నుంచి గుంజుతున్నారు.
ఇ-పోస్ తంటా
ఎరువుల సబ్సిడీ పాలసీలో కేంద్రం డిబిటిని ప్రవేశపెట్టింది. గతంలో ఎరువుల సబ్సిడీలను కంపెనీలకు ప్రణాళికాబద్ధంగా చెల్లించేది. డిబిటి విధానంలో ఇ-పోస్ యంత్రాల్లో నమోదైన సేల్స్ ప్రకారం ఏ రోజుకారోజు సబ్సిడీలను కంపెనీలకు బదిలీ చేస్తోంది. రైతులు ఎరువులు కొనేటప్పుడే ఆధార్ బేస్‌గా బయోమెట్రిక్ వేలిముద్రలు వేయాలి. మన రాష్ట్రంలో వైసిపి సర్కారు ప్రతి గ్రామంలో ఆర్‌బికె నెలకొల్పి అక్కడే ఎరువులు విక్రయిస్తోంది. ముఖ్యంగా యూరియానే అధికంగా అందుబాటులో ఉంచుతోంది. ఆర్‌బికెలకు ఎపి మార్క్‌ఫెడ్ ద్వారా ఎరువులు సరఫరా అవుతున్నాయి. ఆర్‌బికెలు, మార్క్‌ఫెడ్ మధ్యలో కొన్ని మండలాలకొక స్టోరేజి హబ్ ఉంది. ఆర్‌బికె సిబ్బంది రైతులకు ఎరువులు విక్రయిస్తున్నారు. కానీ పైనుంచి సరైన పర్యవేక్షణ లేక రైతుల నుంచి ఇ-పోస్ మిషన్లలో వేలిముద్రలు సక్రమంగా తీసుకోవట్లేదు. దాంతో ఎరువుల కంపెనీలకు ఆర్‌బికెలలో సేల్స్‌పై కేంద్రం నుంచి సబ్సిడీ పడట్లేదు. ఆ కారణం చూపించి కంపెనీలు మార్క్‌ఫెడ్‌కు ఎరువుల సరఫరా తగ్గించాయి. ఇంకో విషయమేమంటే ఆర్‌బికెలకు, హబ్‌లకు లైసెన్స్‌లు, జిఎస్‌టి ఐడిలు లేవు. అందువలన ఇ-పోస్ యంత్రాల్లో సేల్స్ నేరుగా రికార్డ్ కావట్లేదు. పైలెట్ ప్రాజెక్టు కింద ఆర్‌బికెలకు, హబ్‌లకు లైసెన్స్‌లు, జిఎస్‌టి ఐడిల ప్రక్రియ మొదలుపెట్టారు.
నడుస్తున్న వార్
ఎరువుల కంపెనీలు, ప్రభుత్వం మధ్య కొన్నాళ్లగా వార్ నడుస్తోంది. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను కంపెనీల వారీగా వర్గీకరించి సక్రమంగా సరఫరా, పంపిణీ చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర వ్యవసాయశాఖదే. ఆర్‌బికెల కోసమని రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో సగం మార్క్‌ఫెడ్‌కు ఇస్తున్నారు. ఒక్కోక్క ప్రాంతంలో 60-75 శాతం కూడా తీసుకుంటున్నట్లు కంపెనీలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, చాలా ప్రైవేటు కంపెనీలు యూరియాతో లింక్ పెట్టి కాంప్లెక్స్, ఇతర బయో ఎరువులను రైతులకు బలవంతంగా అంటగడుతున్నాయి.
ప్రభుత్వం ఎక్కువ యూరియా తీసుకోవడంతో తమ లాభాలకు గండిపడుతోందని గుర్రుగా ఉన్న కొన్ని కంపెనీలు ఉద్దేశపూర్వకంగా మార్క్‌ఫెడ్, ఆర్‌బికెలకు ఎరువులు ఇవ్వట్లేదని ఆరోపణలొస్తున్నాయి. కాగా కంపెనీల, అధికారుల, డీలర్ల వాదన మరోలా ఉంది. ప్రకాశం, నెల్లూరు వంటి చోట్ల రైతులు మూడు నెలలకు అవసరమైన యూరియాను దొరకదేమోనని ముందే ఒకేసారి కొనిపెట్టుకోవడం వలన కొరత నెలకొందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, కంపెనీల కక్ష సాధింపుపై కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం సజావుగా స్పందించట్లేదని విమర్శలొస్తున్నాయి.










