
ప్రాణాధార మందులు తయారుచేసే ఫార్మా పరిశ్రమలు అక్కడ పనిచేసే ఉద్యోగుల, సిబ్బంది ప్రాణాలను తోడేసే మృత్యుకుహరాలుగా మారడం దారుణం. యాజమాన్యాల తప్పిదాలు, డెవలపర్‌గా ఉన్న సంస్థ నిర్లక్ష్యం, తనిఖీలు నిర్వహించి ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన పలు విభాగాల అధికార యంత్రాంగం వైఫల్యం... వెరసి విలువైన ప్రాణాలను బలిగొంటున్నాయి. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ లారస్ ల్యాబ్స్‌లో తాజా ప్రమాదం నలుగురిని బలిగొనడం, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం బాధాకరం. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే... మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం చెల్లించడం, గంభీర ఉపన్యాసాలు చెప్పి చేతులు దులుపుకోవడం ఆయా కంపెనీల యాజమాన్యాలకు, ఉన్నతాధికారులకు, పాలకులకు పరిపాటిగా మారిపోయింది. ఈ ఏడాదిలోనే ఈ ఫార్మాసిటీలో పది ప్రమాదాలు జరిగాయంటేనే నిర్లక్ష్యం ఏ మేరకు మేటలు వేసిందో అర్థం చేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో మూడు వేల ఎకరాల్లో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. పెద్దపెద్ద కొలిమిలతో పనిచేసే పరిశ్రమలకు కూడా... సొంతంగా ఒక్క అగ్ని మాపక వాహనం కూడా లేదంటే భద్రతపై వాటి నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
పరిశ్రమల్లో భారీ ప్రమాదాలను గుర్తు చేసుకుంటేనే మానవ ప్రాణాల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో కళ్లకు కడుతుంది. రెండేళ్ల క్రితం ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువులు లీకై పరిసర ప్రాంతాలకు చెందిన 12 మంది మరణించగా, వందలాదిమంది ఆసుపత్రి పాలైన ఘటనను తలచుకుంటేనే కలవరం కలుగుతుంది. పరవాడ ఫార్మాసిటీ లోనే అజిక బయోఫోర్‌లో ఐదేళ్ల క్రితం నాటి ప్రమాదంలో ఐదుగురు, సాయినార్ ఫార్మాలో గత ఏడాది మరో ఘటనలో ముగ్గురు బలయ్యారు. సీడ్స్ దుస్తుల పరిశ్రమలో విషవాయువులు లీకై 200 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకూ పరవాడ ఫార్మాసిటీ లోని ఔషధ పరిశ్రమల్లో జరిగిన 70 ప్రమాదాల్లో 49 మంది ప్రాణాలు కోల్పోగా, 93 మంది క్షతగాత్రులయ్యారు. ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు పరిసర గ్రామాల ప్రజలు సైతం ఈ ప్రమాదాల పట్ల, లీకవుతున్న విషవాయువులు, వ్యర్థజలాల పట్ల ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులుసైతం విషవాయువులను పీల్చి అనేక జబ్బులకు గురవుతున్నారు.
పరిశ్రమల్లో ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫైర్ డిపార్ట్‌మెంట్, బాయిలర్ ఇన్‌స్పెక్టర్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టాల్సి ఉంది. ఎప్పటికప్పుడు నివేదికలను రూపొందించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్ట్లాలి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయడం మినహాయిస్తే... ప్రమాద కారణాలపై నివేదికలను విడుదల చేసిన పరిస్థితి కూడా లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట ప్రభుత్వ శాఖల నుండి జరగవలసిన తనిఖీలు దాదాపు నిలిపివేశారు. దాంతో కంపెనీల ఇష్టారాజ్యంగా ఉంది. ఫార్మా పరిశ్రమల్లో వినియోగించే హానికరమైన రసాయనాలపై ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించడం, రక్షణ పరికరాలు సమకూర్చడం తదితర చర్యలన్నింటినీ పరిశ్రమలు గాలికొదిలేశాయి. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ రసాయనాలను శుద్ధి చేయడం, పర్యావరణ పరిరక్షణకు, వాతావరణంలో విషవాయువుల మోతాదును తగ్గించడానికి గ్రీన్ బెల్ట్‌ను ఏర్పాటు చేయడం, రహదారులను నిర్మించడం... లాంటి చర్యలను డెవలపర్‌గా ఉన్న సంస్థ చేపట్టాలి. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థ రసాయనాలను కొంతమేర శుద్ధి చేయకుండానే సమీపంలోని చెరువుల్లోకి, సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల భూగర్భజలాలు విషతుల్యమవుతున్నాయని, అర్ధరాత్రి సమయంలో విషవాయువులను విడిచిపెడుతున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటికైనా... ఉద్యోగుల, సిబ్బంది ప్రాణాలను కాపాడటం... పరిసర ప్రాంతాల వారికి సైతం కాలుష్యం నుంచి ఉపశమనం కలిగించేందుకు అవసరమైన అన్ని చర్యలను పరిశ్రమల యాజమాన్యాలు, సెజ్ డెవలపర్ సంస్థ చేపట్టాలి. చట్టబద్ధంగా, అన్ని ప్రమాణాలను పాటిస్తున్నారో లేదో ప్రభుత్వ అధికారులు తనిఖీ చేసి పర్యవేక్షించాలి. కార్మికుల ప్రాణాలకు, ప్రజల జీవనానికి అవసరమైన పర్యావరణాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత. అందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి.