మాడ్రిడ్ : ఆదివారం జరిగిన స్పెయిన్ ఎన్నికల్లో పచ్చిమితవాద పార్టీ 'వోక్స్'కు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు. మహిళలపై హింసను నిరోధించే చట్టాన్ని, ట్రాన్స్ జెండర్ల హక్కుల చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో రంకెలేసిన వోక్స్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి 36.5 లక్షల ఓట్లు, 52 సీట్లు రాగా, ఇప్పుడు 30 లక్షల ఓట్లు, 33 సీట్లు మాత్రమే వచ్చాయి. అర్బన్, రూరల్ రెండు చోట్లా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని మాడ్రిడ్‌లో గత సారి 6,53, 476 ఓట్లు, 7 సీట్లు రాగా, ఈ సారి 4,98, 537 ఓట్లు, 5 సీట్లు మాత్రమే వచ్చాయి. వోక్స్ పార్టీని అడ్డుకోకపోతే దేశంలో ఫాసిజం వచ్చే ప్రమాదముందని సోషలిస్టు పార్టీ (పిఎస్‌ఓఇ) నేత , ప్రధాని పెడ్రో శాంచెజ్ ఎన్నికల ప్రచారం చివరి వారంలో చేసిన హెచ్చరిక ఫలించింది. వోక్స్ పార్టీ ఓట్లు, సీట్లు తగ్గడం, శాంఛెజ్ నేతృత్వంలోని సోషలిస్టు పార్టీ బలం గతం కన్నా పెరగడమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పాశ్చాత్య మీడియా, సర్వేలు మితవాద పాపులర్ పార్టీ (పీపుల్స్ పార్టీ) 170 సీట్లు దాకా వస్తాయని అంచనా వేశాయి. దీనికి భిన్నంగా ఆ పార్టీ 136 సీట్ల వద్దే ఆగిపోయింది. అత్యధిక సీట్లు గెలుచుకున్న ఏకైక అతిపెద్ద పార్టీగా అది నిలిచినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజార్టీ 176 కి 40 సీట్ల దూరంలో ఉండిపోయింది. వోక్స్ పార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా ఇంకా 7 సీట్లు కావాలి. మరో వైపు చిన్న పార్టీల మద్దతుతో శాంఛెజ్ 176 మంది డిప్యూటీల మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తున్నారు.
సోషలిస్టు పార్టీ నాయకత్వంలో ఏర్పడే సంకీర్ణ కూటమిలో పొడెమస్ తో సహా 15 ప్రగతిశీల పార్టీల గ్రూపు సుమర్ కూడా భాగస్వామి. 1978లో నియంతృత్వ పాలనను అంతమొందించి ప్రజాస్వామ్య పరిపాలనలోకి ప్రవేశించిన స్పెయిన్‌లో మళ్లీ జాతీయోన్మాదాన్ని, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని వోక్స్ పార్టీ ప్రయత్నించింది. ఫాసిస్టు శక్తులు ప్రభుత్వంలోకి వస్తే జరిగే ఉపద్రవమేమిటో స్పెయిన్ ప్రజలకు బాగా తెలుసు. గతంలో జరిగిన ఊచకోతలు వారిని ఇప్పటికీ పీడకలలా వెంటాడుతున్నాయి. ఆనాడు ఫ్రాంకో ఫాసిస్టు ప్రభుత్వం వేలాది మందిని ఊచకోత కోసింది.










