Apr 25,2023 16:00

ప్రజాశక్తి -నందిగామ (ఎన్‌టిఆర్‌) : నియోజకవర్గంలోని నాలుగు మండలాల వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహన్‌రావు మంగళవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సీహెచ్‌సీల ద్వారా రైతులకు 40 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగన్‌ మోహన్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమానికి.. అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే వారికి మేలు జరిగేలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆయా గ్రామాల్లోనే కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌( సిహెచ్‌సి) గ్రూపులను ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా 40% రాయితీతో వారికి అవసరమైన యంత్ర పరికరాలను అందజేస్తున్నట్లు తెలిపారు.

  • డ్రోన్‌ లతో సరికొత్త వ్యవసాయ విధానం ..

వ్యవసాయంలో రైతులు కొత్త టెక్నాలజీని వినియోగించుకునేలా ప్రభుత్వం వ్యవసాయ డ్రోన్లను అందుబాటులోకి తీసుకువస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. డ్రోన్‌ల ద్వారా పురుగు మందుల పిచికారి, ఎరువులు చల్లటం వలన రైతులకు సమయం ఆదా అవటంతో పాటు, వ్యవసాయ ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. డ్రోన్లను వినియోగించడంలో మండలానికి ముగ్గురు చొప్పున ప్రభుత్వం శిక్షణ ఇచ్చేందుకు కార్యచరణ రూపొందించిందని, వారి వారి విద్యార్హతలను బట్టి ఎంపిక విధానం చేపట్టి యువకులకు శిక్షణ ఇచ్చి తద్వారా క్షేత్రస్థాయిలో రైతులకు శిక్షణ ఇచ్చి వాటి వినియోగం పెంచేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల వ్యవసాయ అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.