Dec 12,2022 09:22
  • 'మాండూస్‌' దెబ్బకు అపార పంట నష్టం
  • వరి, పత్తి, మిర్చి పంటలపై తీవ్ర ప్రభావం
  • నష్టం అంచనాల్లో అధికార యంత్రాంగం

ప్రజాశక్తి- యంత్రాంగం : మాండూస్‌ తుపాను దెబ్బకు రైతు వెన్ను విరిగింది. వరి, పత్తి, మిర్చి తదితర పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట పాడైపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పంట నష్టాల అంచనాల్లో అధికార యంత్రాంగం ఉంది. బాపట్ల జిల్లా కృష్టా పశ్చిమ డెల్టా పరిధిలోని రేపల్లె, బాపట్ల వ్యవసాయ సబ్‌ డివిజన్ల పరిధిలో వర్షాలకు ముందు కోసి అరబెట్టిన 30 వేల ఎకరాల్లోపైగా వరి కంకులు నీట మునిగాయి. మాగాణి భూముల్లో కోసిన పరి ఓదెలు నీటిపై తేలియాడుతున్నాయి. మరో 40 వేల ఎకరాల్లో వరి వరి పైరు గాలులకు ఒరిగిపోయింది. పత్తి, మినుము, మిర్చి, పసుపు, ఉద్యాన పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రకాశం జిల్లాలో సాగర్‌ ఆయకట్టులో కోసిన వరి ఓదెలు తడిచి ముద్దయ్యాయి. త్రిపురాంతకం, దర్శి, తాళ్లూరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వరి ధాన్యం తడిచిపోవడంతో రంగు మారే ప్రమాదం ఉంది. పశ్చిమ ప్రాంతంలో మిర్చి పంట దెబ్బతినిపోయింది. దోర్నాల, పెద్దారవీడు ప్రాంతాల్లో మిర్చి తోటల్లో నీరు చేరి కాయలు రాలిపోయాయి.
        మినుము, బొబ్బర్లు, పొగాకు పంటకూ నష్టం వాటిల్లింది. కడప జిల్లాలోని 35 మండలాల్లో, అన్నమయ్య జిల్లాలోని ఏడు మండలాల్లో మొత్తం 9,001 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కడప జిల్లాలో పోరుమామిళ్ల, కలసపాడు, బి.కోడూరు, బి.మఠం, కాశినాయన, బద్వేల్‌, గోపవరం, అట్లూరు, సిద్ధవటం, ప్రొద్దుటూరు, పెద్దముడియం, మైదుకూరు, చాపాడు, వి.ఎన్‌పల్లి, వల్లూరు మండలాల్లోని సుమారు 30 రకాల పంటలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. 4,387 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 2,062 ఎకరాల్లో బుడ్డశనగ, 1,042 ఎకరాల్లో వరి, 1,235 ఎకరాల్లో జొన్న పంటలు నేలకొరిగాయి.
          141.5 ఎకరాల్లో పండ్ల తోటలపై ప్రభావం చూపించింది. అరటి, ఉల్లి, టమోటో పంటలకు నష్టం వాటిల్లింది. అన్నమయ్య జిల్లాలో మదనపల్లి, పీలేరు, రాజంపేట, లక్కిరెడ్డిపల్లి, మదనపల్లి, నిమ్మనపల్లి, కొరబాలకుంట, బి.కొత్తకోట, పెనగలూరు, రామాపురం మండలాల్లో వరి దెబ్బతింది. తుపాను తాకిడి ఎక్కువగా ఉన్న తిరుపతి జిల్లాలో వందలాది కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. వీరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను ఆదుకొనేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు ముందుకువచ్చాయి. జిల్లా 76 ఇళ్లు దెబ్బతిన్నాయి. 600 ఎకరాల్లోపైగా వరి పంట నీట మునిగింది. వాగులు, నదుల ఉధృతితో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మల్లిమడుగు, కల్యాణి డ్యాముల నుంచి నీటిని దిగువకు వదిలారు. సముద్రతీర ప్రాంతాలైన గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
 

                                                   'శ్రీవారి' క్షేత్రాన్ని కమ్మేసిన మంచు దుప్పటి

తిరుమల శ్రీవారి క్షేత్రంలో మంచు దుప్పటి కమ్మేసింది. చలి తీవ్రత అధికంగా పెరగడంతో శ్రీవారి సందర్శకులు వణికిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చంటి పిల్లలతో వచ్చిన సందర్శకులు గదుల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
 

                                                                సంగం వద్ద భారీగా వరద నీరు

నెల్లూరు జిల్లాలో వరి నారు మళ్లు, నార్లు దెబ్బతిన్నాయి. సంగం బ్యారేజీకి, సోమశిలకు వరద నీరు వచ్చింది. సోమశిల రెండు గేట్లు ఎత్తి 19.610 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ఉదయగిరి, వరికుంటపాడు, కందుకూరు ప్రాంతాల్లో కందులు, పొగాకు, మినుము పంటలు దెబ్బతిన్నాయి. కందుకూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో సుమారు 2,460 ఎకరాల్లో శనగ పైరుకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపారు. 33 శాతం కన్నా ఎక్కువ నష్టపోయిన రైతులకు సబ్సిడీతో శనగ విత్తనాల సరఫరాకు ప్రతిపాదనలు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
 

                                                                      హైదరాబాద్‌లో ముసురు

తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లో ముసురు వాతావరణ నెలకొంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. రాగల మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.
 

                                                                  కేరళ, కర్ణాటకల్లో ఎల్లో అలర్ట్‌

మాండూస్‌ తుపాను కారణంగా కేరళ, కర్ణాటకల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. కర్ణాటకలోని అనేక జిల్లాల్లో ఆదివారం ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిశాయి. శివమొగ్గ, హావేరి, బళ్లారి, చిక్కమగళూరు, చిత్రదుర్గ జిల్లాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాన్‌ ధాటికి తమిళనాడులో మరొకరు మృతి చెందారు. దీంతో, మృతుల సంఖ్య ఐదుకు చేరింది.