- అసంఘటిత రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి
- ప్రాంతాల వారీగా పరిశోధనలు జరగాలి
(వల్లభనేని సురేష్)
''దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి ఇటీవల కాలంలో ఒకశాతం కూడా లేదు. ప్రకృతి విపత్తుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. విపత్తులను తట్టుకునే విధంగా వంగడాలను రూపొందించే పరిశోధనలో దేశం వెనుకబడి ఉంది. ఏ పంటకూ మద్దతు ధర దక్కటం లేదు. మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువగా ఉంది. రైతులకు గిట్టుబాటు కల్పించే విషయంలో ప్రభుత్వ మద్దతు అవసరం ఉంది. అది ఒక వరికే గాకుండా అన్ని రకాల పంటలకూ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీలోనూ, అసంఘటిత రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచడం ద్వారానే మెరుగైన అభివృద్ధిని సాధించగలం'' అని ప్రముఖ సామాజికార్థికవేత్త, ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్, ఇక్ఫారు ఆచార్యులు, వ్యవసాయ ధరల నిర్ణాయక మండలి మాజీ ఛైర్మన్ సూర్యదేవర మహేంద్రదేవ్ తెలిపారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా తుమ్మపూడి వచ్చిన సందర్భంగా ప్రజాశక్తితో ఆయన అభిప్రాయాలు పంచుకున్నారు...
దేశంలో వ్యవసాయరంగ పరిస్థితి ఏమిటి ?
జాతీయ స్థాయిలో వ్యవసాయరంగ అభివృద్ధి సరిగాలేదు. అనుబంధ రంగాలు బాగానే ఉన్నాయి. క్రాప్ సెక్టార్లో అభివృద్ధి ఒకశాతం మాత్రమే ఉంది. అందులోనూ వ్యవసాయ కార్మికులకు ఒక హెక్టారుకు ఆదాయం 600 మాత్రమే ఉంది. ఇదే ఆదాయం ఒక రాష్ట్రంలో కొంత ఎక్కువగానూ మరికొన్ని రాష్ట్రాల్లోనూ తక్కువగా ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్ అయితే చాలా తక్కువగా ఉంది. అందువల్లే ఆయా రాష్ట్రాల నుండి వలసలు ఎక్కువగా ఉన్నాయి.
మద్దతు ధరలు అమలవుతున్నాయా ?
దేశంలో మద్దతు ధరలు ఇంకా లభించడం లేదు. ప్రభుత్వం కూడా రైతాంగానికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. కోవిడ్ వల్ల అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ఆదాయం తగినంత కనిపించడం లేదు. యంత్రాలు పెరగడంతో కూలీలకు ఉపాధి తగ్గింది. అయితే చాలా దేశాల్లో వ్యవసాయ అనుబంధంగా పారిశ్రామిక రంగం పెరగడం వల్ల అక్కడ ఆదాయం మెరుగ్గా ఉంది. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అలా లేదు. మహారాష్ట్రంలో హార్టికల్చర్ అభివృద్ధి జరిగి ఆగ్రో ప్రాసెసింగ్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ కొంత గిట్టుబాటు అవుతోంది. అది అన్ని ప్రాంతాల్లోనూ ఒకేలా ఉండకపోవచ్చు.
ధర లభించకపోవడానికి కారణం ఏమంటారు ?
మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలను దళారులు నియంత్రిస్తున్నారు. ఉదాహరణకు టమోటా రైతు దగ్గర కిలో రూపాయికి కొంటున్నారు. అదే టమోటా బొంబాయిలోగానీ, విశాఖపట్నంలోగానీ కొనుగోలు చేయాలంటే కిలో రూ.40 ఉంటోంది. ఆగ్రో ఉత్పత్తులను నిల్వ చేసేందుకు కోల్డ్‌చైన్ కావాలి. బెంగాల్లో బంగాళాదుంపల విషయంలో ఇది మంచి ఫలితాలు ఇచ్చింది. పాల ఉత్పత్తుల్లో కొన్ని కంపెనీలు రైతులకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. హార్టికల్చర్‌లో అది 20 శాతం లోపే ఉంటోంది. దాన్ని ప్రవేశపెడితే బాగానే ఉంటుంది.
ప్రకృతి విపత్తులు వ్యవసాయాన్ని దెబ్బతీస్తున్నాయి కదా ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా ?
నిజమే. ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలబడగలిగే వంగడాలను తయారు చేయాలి. దీనికి సంబంధించి పరిశోధన మన దేశంలో చాలా తక్కువగా ఉంది. ఉత్తర భారతంలో వేడిగాలులు పంటలను దెబ్బతీస్తున్నాయి. మన రాష్ట్రంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో వరదలు, భారీ వర్షాలు నష్టం కలిగిస్తున్నాయి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాటిని తట్టుకుని నిలబడగలిగే విధంగా వంగడాలను తయారు చేయాలి. కానీ ఆ ప్రయత్నం జరగడం లేదు. ఇది రైతును తీవ్రంగా కుంగదీస్తోంది. ఏమి చేయాలన్నా సొంత పెట్టుబడితో చేయాల్సి వస్తోంది. విపత్తుల ఫలితంగా పంటలు దెబ్బతిని పోతే తీవ్ర కుంగుబాటుకు గురవుతున్నారు. అందుకనే రైతులకు ప్రభుత్వ మద్దతు చాలా ఎక్కువగా ఉండాలి. ప్రభుత్వం ఆదుకోకపోతే మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. ఇది సామాజిక వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చు.
పారిశ్రామిక రంగం పరిస్థితిపై మీ అంచనా ఏమిటి ?
వ్యవసాయం ఒక్కటే చాలదు. పరిశ్రమల్లో ఉద్యోగాలు చేసుకోవడం ద్వారా అది కూడా అర్బన్ ఏరియాలతో కనెక్టివిటీ పెరిగితే దానివల్ల ఉపాధి పెరుగుతుంది. పెట్టుబడులకూ ఇబ్బంది ఉండదు. అంటే ఒకవైపు వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి సమంగా జరగాలి. థారులాండ్, ఆసియన్ దేశాల్లో ఇది ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ అభివృద్ధి పెరుగుతోంది.
ప్రైవేటు పెట్టుబడుల వల్ల దేశానికి వచ్చే ఉపయోగం ఏమిటి ?
ఇక్కడ ప్రైవేటు పెట్టుబడులు అంటే అదానీ, అంబానీ కాదు. అది క్రోనీ కాపిటలిజం. మన దేశంలో అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పెట్టే పెట్టుబడి 10 నుండి 20 శాతంలోపే ఉంటుంది. మిగిలినదంతా ప్రైవేటు వ్యక్తులు పెట్టేది. ఇక్కడ వ్యవసాయం కూడా ప్రైవేటు రంగమే కదా. ప్రైవేటు అంటే చిన్న తరహా పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు ఇలాంటి వాటిని మరింత ప్రోత్సాహించాల్సి ఉంది. ఇది ఉత్పత్తుల ధరను నియంత్రించడమే కాకుండా వినియోగదారులకూ అందుబాటులో ఉంటుంది. ఉపాధి కారకంగానూ నిలుస్తుంది.
ఉపాధి హామీ పథకం దెబ్బతింటోంది. దీనికి కారణం ఏమిటి ?
దేశంలో ఉపాధి హామీకి కేంద్రస్థాయిలో కేటాయించాల్సిన నిధులు కేటాయించడం లేదు. వేతనాలు 15 రోజుల్లో ఇవ్వకపోతే సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో అసలు పనిదినాలనే తగ్గించే పరిస్థితి ఉంది. దీనికి బడ్జెట్లో కేటాయింపులు పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకోగలం. అంతేకాదు ఇది మారకం రూపంలో అన్ని రంగాల అభివృద్ధికి ఉపయోగపడుతోంది. ఉపాధి హామీలో జాన్‌రీజ్ అనే నిపుణుడు చెబుతున్న లెక్కల ప్రకారం పనిచేసిన వారికి వేతనాలు ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల రెండు సంవత్సరాలు కూడా ఉపాధి ఇవ్వడం లేదు. బడ్జెట్లో అంత పెడతాము. ఇంత పెడతాము అని చెబుతున్నా అంచనాలు పెట్టేప్పటికి కోతలు పెడుతున్నారు. పెద్దపెద్ద రంగాలకు ప్రభుత్వాల నుండి ఇచ్చే ఉచితాలను తగ్గించాలి. ఇలా ఇచ్చుకుంటూ పోతే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని పోతుంది. ఉచితం అంటే పేదలకు ఇచ్చే ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాలుకాదు.
అసంఘటిత రంగాన్ని ఆదుకోవడానికి ఏ చర్యలు తీసుకోవాలి ?
ప్రస్తుతం ప్రభుత్వాలు ఎక్కువగా సంఘటిత రంగం గురించే ఆలోచిస్తుంటాయి. అది పదిశాతం మాత్రమే ఉంటుంది. మిగిలిన 90 శాతం అంఘటిత రంగం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. బడ్జెట్లో సగం సంఘటిత రంగానికే పోతే మిగిలిన వారికి ఏమిస్తాము. సంఘటితంలోనూ డాక్టర్లు, టీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రూ.600 కూలీతో పనిచేసే వ్యవసాయ కార్మికులు, రైతుల పరిస్థితి ఏమిటి. వారికోసం బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. కేటాయింపుల్లో సగం 10 శాతం మందికిపోతే ఎలా అనేది నా ప్రశ్న. భవిష్యత్‌లో అసంఘటిత రంగం ప్రధానంగా మారుతుంది. ఇప్పటి నుండి ఆదుకుంటే తప్ప దాన్ని కాపాడుకోలేము. సంఘటిత రంగం కొంతకాలమే ఉంటుంది. వ్యవసాయ కూలీలు, గిగ్ వర్కర్లకు ఏమీ రావు. వారికి సామాజిక భధ్రత ఉండదు.










