ప్రజాశక్తి-దేవనకొండ (కర్నూలు) : ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి, నకిలీ విత్తనాలు తదితర కారణాలతో ప్రతి ఏటా పత్తి రైతు నష్టాలను చవిచూస్తున్నాడు. గత రెండేళ్లుగా పత్తి రైతు అప్పుల ఊబిలోనే కోరుకుపోయాడు. ఈ ఖరీఫ్ సీజన్ లోనైనా అప్పుల ఊబి నుండి బయట పడుతానన్న ఆశతో జూన్ నెలలో కురిసిన తొలకరి వర్షాలకు దేవనకొండ మండలంలో పత్తి పంటను 33 వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అయితే పత్తి పంటకు ఎర్ర తెగుళ్లు సోకడంతో పత్తి పేరు గిడస బారి వడ తెగుళ్ళతో పత్తి మొలకలు దెబ్బతింటున్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు దున్నకాలు, విత్తనాలు, ఎరువులకు, కూలీలకు ఎకరా పత్తి సాగుకు రూ.20000 పెట్టుబడి వస్తుందని తెగుళ్లు బారిన పడడంతో పెట్టిన పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా గత 20 రోజుల నుండి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు కురవక పత్తి పేర్లు వాడ ముఖం పడుతున్నాయని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
వాతావరణ మార్పుతోనే తెగుళ్లు: సురేష్ బాబు ఏవో
పత్తి పంటకు సోకుతున్న తెగుళ్లపై మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్లగా వాతావరణ మార్పుల వలన ఎర్ర తెగులు, వడలు తెగులు వ్యాపించడం జరిగిందన్నారు. ఈ తెగుళ్ళు సోకిన రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదనిపంటను కాపాడుకోవడానికి 19-19-19 లేదా 14-0-35 5 గ్రా. 1 ఒక లీటర్ నీటి కలుపుకొని మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారి చేసుకోవాలన్నారు. వడలు తెగులు నివారణకు కాపర్‌ఆక్సిక్లోరైడ్(బ్లైటాక్స్) 3గ్రా'' 1 ఒక లీటర్ నీటి కలుపుకొని మొక్కల మొదల దగ్గర వేసుకోవాలన్నారు.










