
తమ కులాలకు చెందిన అమ్మాయిలను చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసి వయసు పెరిగిపోయి ఇక పెళ్లి జరగదేమో అని సందిగ్ధంలో పడిన వారు ఈ తరహా వివాహాలకు సిద్ధమవుతున్నారు. తమ ప్రాంతంలోని దిగువ కులాల అమ్మాయిలను చేసుకోవడానికి కుల హోదా అడ్డువచ్చి దూర ప్రాంతాల అమ్మాయిలను చేసుకుంటున్నారు. వ్యవసాయం మీద ప్రధానంగా ఆధారపడిన కుటుంబాలకు తమ అమ్మాయిలను ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడంలేదు. అనేక దశాబ్దాలుగా పంటలు పండకపోవడం, ఒకవేళ పండినా గిట్టుబాటు కాకపోవడం, అప్పులు పెరిగిపోవడం, ఎక్కువ సమయం కాయకష్టం చేయాల్సి వుండడంతో వీరికి అమ్మాయిలను ఇవ్వడానికి తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిని వివాహం చేసుకోవడానికి అమ్మాయిల్లో తీవ్రమైన నిరాసక్తత వుంది.
అనంతపురం జిల్లా లోని మిడుతూరు గ్రామంలో జరిగిన ఓ వివాహంలో పెళ్లి కుమారునికి కన్నడం రాదు. పెళ్లి కూతురికి తెలుగు రాదు. వారిద్దరికీ పెద్దల సమక్షంలో వివాహం అయ్యింది. గుత్తి మండలంలోని ఒక గ్రామంలోని రాముడు (పేరు మార్చబడింది) అనే రైతుకు తొమ్మిది ఎకరాల చినీ తోట వుంది. ఒక్కడే కుమారుడు. పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఏ అలవాట్లు లేవు. 32 సంవత్సరాల వయసు వచ్చినా పెళ్లి కాలేదు. మొదట్లో తమ కులం అమ్మాయి కోసం వెతికి చూశారు. చివరకు ఏ కులమైనా పర్వాలేదు అనుకున్నారు. చిట్టచివరకు కర్ణాటక లోని గుల్బర్గా ప్రాంతానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండే కాదు, మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, తెలంగాణ లోని అదిలాబాద్ లాంటి సుదూర జిల్లాల అమ్మాయిలతో పెళ్ళిళ్లు జరుగుతున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అనంతపురం జిల్లాలో పరిశీలించిన ఏడు మండలాల్లో గత రెండు సంవత్సరాల్లో సుమారు ఈ తరహా వివాహాలు 600 పైగా జరిగాయి. రాష్ట్రంలో వేల సంఖ్యలో జరుగుతున్నాయి. పురుషుల కంటే స్త్రీలు తక్కువ వున్న హర్యానా, పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కోస్తా ప్రాంతాల్లో కూడా ఈ తరహా పెళ్లిళ్లు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి. కాని లింగ నిష్పత్తి చాలా రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా వుందని లెక్కలు చెబుతున్న ఆంధ్ర ప్రదేశ్‌లో పొరుగు రాష్ట్రాలు, సుదూర జిల్లాలకు చెందిన అమ్మాయిలను ఎందుకు చేసుకుంటున్నారు? సాధారణంగా జరిగే పెళ్ల్లిళ్ల లాంటివి కాదు ఇవి. లక్షల రూపాయలను పెళ్లిళ్ల బ్రోకర్లకు, అమ్మాయిల తల్లిదండ్రులకు అప్పచెప్పి ఇరుపక్షాల పెద్దలు అంగీకరించి చేసుకుంటున్న వివాహాలు. అన్నిటికంటే దారుణం అబ్బాయిల కంటే అమ్మాయిల వయసు 15 నుండి 20 సంవత్సరాలు తక్కువగా వుండడం. ఇలాంటి వివాహాలు ఎందుకు జరుగుతున్నాయి ?
పిల్లనివ్వట్లా...
పొరుగు రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి పెళ్లికూతుళ్లను తెచ్చుకుంటున్న అబ్బాయిల కుటుంబాల్లో ఎక్కువ భాగం అగ్రకులాలకు చెందిన వారు వుంటున్నారు. దీనికి ముఖ్య కారణం ఈ పెళ్లిళ్లకు సిద్ధపడుతున్న అబ్బాయిల్లో ఎక్కువమంది మధ్యలోనే చదువులు నిలిపేసి, వ్యవసాయం మీద ఆధారపడి గ్రామాల్లోనే వుంటున్నారు. కుటుంబాల్లో కుల కట్టుబాట్లు, పెత్తందారీ లక్షణాలు పుష్కలంగా వుండి...తమ కులాలకు చెందిన అమ్మాయిలను చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసి వయసు పెరిగి ఇక పెళ్లి జరగదేమో అని సందిగ్ధంలో పడిన వారు ఈ తరహా వివాహాలకు సిద్ధమవుతున్నారు. తమ ప్రాంతంలోని దిగువ కులాల అమ్మాయిలను చేసుకోవడానికి కుల హోదా అడ్డువచ్చి దూర ప్రాంతాల అమ్మాయిలను చేసుకుంటున్నారు. వ్యవసాయం మీద ప్రధానంగా ఆధారపడిన కుటుంబాలకు తమ అమ్మాయిలను ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడంలేదు. అనేక దశాబ్దాలుగా పంటలు పండకపోవడం, ఒకవేళ పండినా గిట్టుబాటు కాకపోవడం, అప్పులు పెరిగిపోవడం, ఎక్కువ సమయం కాయకష్టం చేయాల్సి వుండడంతో వీరికి అమ్మాయిలను ఇవ్వడానికి తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారిని వివాహం చేసుకోవడానికి అమ్మాయిల్లో తీవ్రమైన నిరాసక్తత వుంది. ఒకనాడు ఎంతో గౌరవప్రదమైన వృత్తిగా కీర్తించబడి, కోట్లాది మందికి అన్నం పెట్టిన వ్యవసాయదారునికి వధువు దొరకని పరిస్థితి ఎందుకు వచ్చింది ?
ఈ తరహా వివాహాలకు అమ్మాయిలు, అమ్మాయిల కుటుంబాలు ఎందుకు అంగీకరిస్తున్నాయి. ఈ కుటుంబాలు కూడా వ్యవసాయం మీద ఆధారపడినవే. ఈ కుటుంబాల పేదరికం అమ్మాయిలకు శాపంగా మారింది. ఇతర రాష్ట్రాలు లేదా సుదూర జిల్లాల నుండి చేసుకుంటున్న అమ్మాయిల్లో ఎక్కువ మంది కర్ణాటక లోని గుల్బర్గా, మంగళూరు, మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణ లోని అదిలాబాద్ వారు వుంటున్నారు. ఈ ప్రాంతాలు వ్యవసాయం మీద ఆధారపడి శతాబ్దాలుగా వెనుకబడి వుండడం, సామాజిక వెనుకబాటు, పేదరికం, నిరక్షరాస్యత, గ్రామాల్లో సరైన పనులు దొరకకపోవడం వీటికి తోడు ఆడపిల్లల పట్ల వున్న వివక్ష ఈ రకమైన పెళ్లిళ్లకు ప్రధాన కారణాలు. ఈ పెళ్లిళ్లు చేసుకుంటున్న అమ్మాయిల్లో అత్యధికమంది వెనుకబడిన కులాలకు చెందిన మైనర్ అమ్మాయిలు కావడం విషాదం. పేదరికం, లింగ వివక్షకు తోడు సామాజిక సమస్యలు కూడా ఇందుకు కారణమౌతున్నాయి. ఈ తరహా వివాహాలకు మూలాలు వ్యవసాయ సంక్షోభంలో, భూస్వామ్య భావజాలంలో వున్నాయి.
వ్యవసాయ సంక్షోభం
వ్యవసాయం మీద ప్రధానంగా ఆధారపడిన భారతదేశం నేడు తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. పెట్టుబడిదారీ వ్యవసాయ పద్ధతులు పెరిగే కొద్ది చిన్న, సన్నకారు రైతులు ఈ సంక్షోభంలో మరింతగా కూరకుపోతున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పరికరాలు సాగుదార్ల స్వంతం లేదా ఆ గ్రామంలోనే పొరుగువారి నుండి సహాయం తీసుకునే సౌలభ్యం వుండేది. ప్రభుత్వ, సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా రుణ సదుపాయం వుండేది. ప్రభుత్వం మార్కెట్ యార్డ్స్, ఇతర కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల పంటలు సేకరిస్తుండడంతో కొంతమేరకైనా గిట్టుబాటు ధర దక్కేది. 1991 తరువాత ఈ పరిస్థితులన్నీ వేగంగా మారాయి. వ్యవసాయానికి కీలకమైన విత్తనాలు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. వ్యవసాయ పని ప్రారంభించన రోజు నుండి చేతిలో నగదు వుంటే తప్ప సేద్యం చేయలేని స్థితికి రైతును దిగజార్చారు. బ్యాంకులు, సహకార సంస్థలు చిన్న, మధ్యతరగతి రైతులకు అప్పులు ఇవ్వడంకంటే ధనిక రైతులకు, వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వారికి అప్పులు ఇవ్వడం పెరిగింది. అలాగే కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, సినీయాక్టర్లు, సాఫ్ట్‌వేర్ నిపుణులు మొదలగువారు వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా లేదా తమ వ్యాపార లావాదేవీలను చక్కదిద్దుకునే మార్గంగా భావించి పెద్దసంఖ్యలో ఇక్కడ చొరబడ్డారు. అందువల్ల ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయంలో వచ్చే ప్రతి మార్పును వీరు తమ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకుంటూ మరింత బలపడ్డారు. నగదు అందుబాటులో లేని పేద రైతులు ఫెర్టిలైజర్ షాపుల యజామానుల మీద, వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడాల్సిన స్థితికి నెట్టబడ్డారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంటకు అవసరమైన పెట్టుబడి అప్పుగా ఇచ్చి పంటకు ముందస్తు ధర నిర్ణయించుకునే వ్యాపారస్థుల కబంధ హస్తాల్లో చిక్కుకొని రైతులు విలవిలలాడుతున్నారు. ఈ పరిణామాలన్నీ వ్యవసాయాన్ని పూర్తిగా దివాళా తీయించాయి. వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకొని గ్రామాల్లో జీవిస్తున్న రైతులు మరింత పేదలుగా దిగజారారు. వీటికి తోడు పెళ్లి లాంటి సామాజిక సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. పాత బానిస వ్యవస్థ రూపమైన మనుషులను అమ్మడం, కొనడం పెళ్లిళ్ల పేరుతో పున:ప్రతిష్ట జరుగుతుంది. ఈ సమస్యపై ప్రభుత్వాలు లోతుగా పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకోకపోతే వ్యవసాయ సంక్షోభం, సామాజిక సంక్షోభంగా మారుతుంది.
వ్యాపార సరుకు
పెళ్లి సంబంధాలు కుదిర్చే మ్యారేజి బ్యూరోలు గత దశాబ్దంలో బాగా పెరిగాయి. వీరు కులం, గోత్రం చూసి తగిన వారితో సంబంధాలు కుదిర్చే కమీషన్ వ్యాపారం చేస్తున్నారు. కాని పొరుగు రాష్ట్రాల, జిల్లాల అమ్మాయిలతో పెళ్లి సంబంధాలు ఏర్పాటు చేసే ఆధునిక బ్రోకర్ల స్టైలే వేరు. అమ్మాయి పేరు, ఊరు ఏమీ తెలియకుండానే అక్కడి బ్రోకర్ల ద్వారా ఫోటోలు తెప్పించి, ఆ ఫోటోలు ఇక్కడ చూపించి, తమ కమీషన్, అమ్మాయి కుటుంబానికి ఇవ్వాల్సిన మొత్తం ముందుగా నిర్ణయించుకొంటారు. కొన్ని సందర్భాల్లో ఒకేసారి అబ్బాయి కుటుంబాన్ని వెంట తీసుకెళ్లి పెళ్లి తంతు ముగించేస్తారు. బ్రోకర్‌కు రెండు నుండి నాలుగు లక్షలు, అమ్మాయి కుటుంబానికి రెండు లక్షలు అబ్బాయి కుటుంబం చెల్లించి పెళ్లి కూతురుని తెచ్చుకుంటున్నారు. అత్తవారి ఇంటికి వచ్చిన అమ్మాయి తిరిగి తన పుట్టింటికి ఎప్పుడు వెళుతుందో తెలియదు. తనకు మెట్టినింట వచ్చే కష్టసుఖాలు చెప్పుకోవడానికి తన దగ్గరి బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఎవ్వరూ అందుబాటులో లేని జీవితంలోకి తోయబడుతుంది. ఈ తరహా పెళ్లిళ్లు తాడిపత్రి ప్రాంతంలోని ఒక గ్రామంలో గత ఏడాదిన్నర కాలంలో 12 జరిగాయి. వధూవరుల మధ్య వయోబేధం 15 నుండి 20 సంవత్సరాలు వుండడం ఆశ్చర్యం, ఆందోళనకరం. ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన దుర్భర పేదరికం అమ్మాయిల జీవితాన్ని ఇంతటి వికృత పరిస్థితికి చేర్చింది. అలాగే వ్యవసాయం మీద ఆధారపడినందుకు జీవిత భాగస్వామి కోసం సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సుదూర ప్రాంతాలకు పయనం కావాల్సిన పరిస్థితులు అబ్బాయిలకు ఏర్పడుతున్నాయి. పాలకులకు ఇవేమీ పట్టడమే లేదు.
/వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు /
వి. రాంభూపాల్