Dec 11,2022 07:31

ఈ కాషాయీకరణ చర్యల ప్రభావం మైనారిటీ ముస్లిం టీచర్లు, విద్యార్ధులపై పడుతోంది. వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. కర్ణాటక లోని ప్రభుత్వ కాలేజీల్లో హిజాబ్‌లు ధరించిన విద్యార్ధినులు ప్రవేశించకుండా నిషేధించడం, అలాగే మధ్యప్రదేశ్‌ లోని ప్రభుత్వ లా కాలేజీలో ముస్లిం టీచర్లను డిబార్‌ చేయడం, పైగా వారిపై క్రిమినల్‌ అభియోగాలు మోపడం...వంటివన్నీ కూడా బిజెపి పాలిత రాష్ట్రాల్లో అధికారికంగా జరుగుతున్నాయనేది సుస్పష్టం.

ఇండోర్‌లో గవర్నమెంట్‌ న్యూ లా కాలేజ్‌, మరికొన్ని చోట్ల జరిగిన సంఘటనలు ఆందోళన కలిగించేవిగా వున్నాయి. సమాజంలో తీవ్రంగా పాతుకుపోయిన మతోన్మాద పోకడలు, ధోరణులు ప్రస్తుతం విద్యా వ్యవస్థను ఏ విధంగా దెబ్బ తీస్తున్నాయనడానికి ఇవి ఉదాహరణలుగా వున్నాయి.
           ఇండోర్‌లోని గవర్నమెంట్‌ న్యూ లా కాలేజ్‌లో అత్యంత అధ్వాన్నమైన సంఘటన చోటు చేసుకుంది. బోధనా ఫ్యాకల్టీలో ముస్లిం మత ప్రక్షాళన చేసే కార్యక్రమంగా దీన్ని పిలవవచ్చు. కాలేజీ లోని నలుగురు ముస్లిం ఉపాధ్యాయులు మతపరమైన ఛాందసవాద ఆలోచనా ధోరణిని పెంచి పోషిస్తున్నారంటూ కాలేజీలోని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ (ఎబివిపి) శాఖ ఆరోపిస్తూ నిరసనలు చేపట్టింది. పైగా కాలేజీలో ముస్లిం ఫ్యాకల్టీ సభ్యులు ఎక్కువమంది వుండడాన్ని కూడా వారు ప్రశ్నించారు. వాస్తవానికి, మొత్తంగా 28 మంది టీచర్లు వుంటే కేవలం నలుగురు మాత్రమే ముస్లింలు.
             కాలేజీ కేంపస్‌లో ముస్లిం, ఇస్లామిక్‌ సంస్కృతీ సాంప్రదాయాలను పెంచి పోషిస్తున్నారంటూ ముస్లిం టీచర్లపై ఆరోపణలతో ఎబివిపి శాఖ అధ్యక్షుడు ఒక మెమోరాండం కూడా సమర్పించారు. ఈ టీచర్లు విద్యార్ధినులను రెస్టారెంట్లకు, పబ్‌లకు తీసుకెళుతూ లవ్‌ జిహాద్‌ను కూడా పెంపొందిస్తున్నారని వారు ఆరోపించారు. ఫిర్యాదులు చేయబడిన నలుగురు ముస్లిం టీచర్లు, మరో ఇద్దరిని కాలేజీ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఇనమూర్‌ రహమాన్‌ ఐదు రోజుల పాటు బోధనా బాధ్యతల నుండి తొలగించారు. రిటైర్డ్‌ జిల్లా న్యాయమూర్తిచే విచారణకు ఆదేశించారు. ఇంత చేసిన ఆయన కూడా ముస్లిమే.
           కానీ, ఈ చర్యతో సంతృప్తి చెందని ఎబివిపి విద్యార్ధులు కొత్త అభియోగాలు మోపారు. డాక్టర్‌ ఫర్హాత్‌ ఖాన్‌ రాసిన 'కలెక్టివ్‌ వయొలెన్స్‌ అండ్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌' అనే పుస్తకాన్ని కాలేజీ లైబ్రరీలో వుంచారని వారు ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, హిందువుల గురించి ఆ పుస్తకంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని వారు చెప్పారు. 2019లో తాను ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించగా, 2014 లోనే ఈ పుస్తకాన్ని లైబ్రరీలో పెట్టారని ప్రిన్సిపల్‌ వివరణ ఇచ్చారు. అయినా, ఆందోళనకారులు ఆయననే లక్ష్యంగా చేసుకుని తమ నిరసనలు కొనసాగించారు. అంతిమంగా ఆయన రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చారు.
          ఎబివిపి విద్యార్ధులు చేసే ఆందోళనకు, వారి ఫిర్యాదులకు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా మద్దతు పలికారు. వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. ప్రిన్సిపల్‌, మరో టీచర్‌ మీర్జా మోజిజ్‌, పుస్తకం రచయిత, ప్రచురణకర్తలపై ఐపిసి లోని వివిధ సెక్షన్ల కింద స్థానిక పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్షన్‌ 153-ఎ (రెండు గ్రూపుల మధ్య శతృత్వాన్ని పెంచి పోషించడం), 295-ఎ (ఒక గ్రూపు మతపరమైన భావాలను రెచ్చగొట్టేందుకు ఉద్దేశ్యపూర్వక, తప్పుడు చర్యలు చేపట్టడం) వంటి సెక్షన్లపై కూడా కేసులు నమోదయ్యాయి.
రచయిత డాక్టర్‌ ఫర్హాత్‌ ఖాన్‌ను, మరో ముగ్గురిని అరెస్టు చేయడానికి పోలీసులు చూస్తున్నారు. ఆ ముగ్గురికి ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి జిల్లా కోర్టు తిరస్కరించడంతో మాజీ ప్రిన్సిపల్‌ సహా ముగ్గురిని అరెస్టు చేసే అవకాశం వుంది.
          ఆ రకంగా, కొద్ది రోజుల్లోనే, ప్రిన్సిపల్‌తో సహా ముస్లిం టీచర్లందరినీ వారి పదవుల నుండి తొలగించారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం తన మౌనంతోనే ఈ చర్యకు అంగీకారం తెలిపింది. ఎబివిపి శాఖ లేవనెత్తిన ఫిర్యాదుల ఆధారంగా ఉన్నత విద్య డైరెక్టరేట్‌ ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. మత తీవ్రవాదం, ఇంకా ఇటువంటి ఇతర అభియోగాలపై ఈ కమిటీ దర్యాప్తు జరుపుతుంది.
          ఇలా మైనారిటీ టీచర్లను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు బిజెపి పాలిత మధ్య ప్రదేశ్‌లో ఇంకా చాలా వున్నాయి. విదిష లోని ఒక స్కూల్‌ ముస్లిం ప్రిన్సిపల్‌ షాయినా ఫిర్దోస్‌ను ఈ ఏడాది అక్టోబరులో తొలగించారు. ఆమెపై బజరంగ్‌ దళ్‌ సభ్యులు వివిధ ఆరోపణలు చేశారు. ఒక విద్యార్ధి ఫిర్యాదు ఇచ్చారని పేర్కొంటూ, గుణ జిల్లాలో మరో క్రైస్తవ మిషనరీలో ఇద్దరు టీచర్లు జస్టిన్‌, జాస్మిన్‌ ఖతూన్‌లపై ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
        ముస్లిం విద్యార్ధులు లేదా టీచర్లపై ప్రదర్శిస్తున్న మతోన్మాద సంఘటనలు ఇతర రాష్ట్ల్రాల్లో కూడా వెలుగు చూశాయి. ఇటీవలే, కర్ణాటక లోని మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన ముస్లిం విద్యార్ధి పేరు కసబ్‌ అయినందుకు ఆ కాలేజీ ప్రొఫెసర్‌ ఆ విద్యార్ధిని అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌ లోని బర్మార్‌లో ఒక క్లాస్‌ టీచర్‌ ఏకైక ముస్లిం విద్యార్ధినిపై దాడి చేసి ఆమెపై ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. ఆ విద్యార్ధి ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఆ సంబంధిత టీచర్‌పై ఎలాంటి చర్య తీసుకోలేదు.
            విలువలతో కూడిన విద్యను నేర్పాలన్న సాకుతో నూతన విద్యా విధానం ద్వారా విద్యా వ్యవస్థలో మతోన్మాదాన్ని చొప్పించడమనేది మోడీ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటి. అయితే, ఈ కాషాయీకరణ చర్యల ప్రభావం మైనారిటీ ముస్లిం టీచర్లు, విద్యార్ధులపై పడుతోంది. వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. కర్ణాటక లోని ప్రభుత్వ కాలేజీల్లో హిజాబ్‌లు ధరించిన విద్యార్ధినులు ప్రవేశించకుండా నిషేధించడం, అలాగే మధ్యప్రదేశ్‌ లోని ప్రభుత్వ లా కాలేజీలో ముస్లిం టీచర్లను డిబార్‌ చేయడం, పైగా వారిపై క్రిమినల్‌ అభియోగాలు మోపడం...వంటివన్నీ కూడా బిజెపి పాలిత రాష్ట్రాల్లో అధికారికంగా జరుగుతున్నాయనేది సుస్పష్టం. ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా కుదించడమనేది ప్రభుత్వ విద్యా వ్యవస్థలోనూ ప్రతిబింబిస్తోంది.
           'ఒక భూగోళం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్‌' అనే నినాదంతో అధికారికంగా వచ్చే ఏడాదికి జి-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టింది. వసుధైక కుటుంబంలో సామరస్యతను పెంచి పోషించడానికి భారత్‌ బాసటగా వుందని ప్రధాని మోడీ చాలా ఆర్భాటంగా వ్యాఖ్యానించారు. కానీ మరోపక్క దేశంలో మాత్రం వర్గ, మత దృక్పథంతో భారతీయ కుటుంబాన్ని విభజించడానికి జరగాల్సినదంతా జరుగుతోంది.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వివిధ నగరాల్లో జి-20 కి సంబంధించిన పలు సమావేశాలు, సభలను ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఒక జి-20 సమావేశం ఇండోర్‌లో జరగనుంది.
      స్టాండప్‌ కమెడియన్‌ మున్వర్‌ ఫరూకిని ఈ నగరంలోనే అరెస్టు చేశారు. ఆయనిచ్చే ప్రదర్శనలు హిందువుల సున్నితమైన మత మనోభావాలను దెబ్బతీస్తున్నాయంటూ హిందూత్వ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు కారణంగా ఈ అరెస్టు జరిగింది. హిందువుల ప్రాంతాల్లో గాజులు అమ్ముతున్నందుకుగాను తస్లీం అలీ అనే గాజుల వ్యాపారిని గతేడాది ఇదే ఇండోర్‌లో అరెస్టు చేశారు. అలా అరెస్టయి జైల్లో 107 రోజులు గడిపాడు. కేవలం ముస్లింలు అయినందున గౌరవనీయులైన న్యాయ కోవిధులు, మేథావులు, ఉపాధ్యాయులను వెంటాడిన నగరం ఇది.
ఇండోర్‌లో జి-20 కార్యక్రమం జరిగినపుడు... హిందూత్వ పాలన నిజ స్వరూపం, వసుధైక కుటుంబం అంటూ చేసిన కపట ప్రకటన బట్టబయలవుతుంది.

/'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం/