Nov 16,2022 07:23

          విత్తనం నుంచి విక్రయం వరకూ అన్నింటా తానై అన్నదాతకు భరోసా కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు ఆర్భాటంగా వున్నా అమలు అంతంతమాత్రంగానే వుంది. వరి, ఉల్లి, టమోటా, నిమ్మ... ఇలా ఏ పంటకైనా మద్దతు ధర కోసం ఆందోళన చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో నేటికీ ప్రధాన పంట వరి. దీనిని పండించే వారిలో అత్యధికులు కౌలు రైతులే. నిజమైన ఈ సాగుదార్ల పేర్లు ఇ- క్రాప్‌ బుకింగ్‌లో ప్రభుత్వం నమోదు చేయడం లేదు. భూయజమానుల పేర్లు అందులో నమోదు చేయడంతో కౌలుదారులు పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకోలేక కమిషన్‌ ఏజెంట్లు, మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తోంది. చిన్న, సన్నకారు రైతులకూ ప్రభుత్వ భరోసా అందడం లేదు. వాలంటీర్లే రైతుల వద్దకు వచ్చి పరిశీలించి ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, అది అంతంతమాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ వారం రోజుల క్రితమే ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ సుమారు ఐదు వేల టన్నులే కొనుగోలు చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రోజుకు వెయ్యి టన్నులు కూడా కొనుగోలు చేయలేదన్న మాట. అక్టోబర్‌ చివరి వారంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, కృష్ణాలోని కొన్ని ప్రాంతాల్లోనూ కోతలు ప్రారంభమయ్యాయి. నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకుని, ఆరబెడుతున్నారు. తరచూ మబ్బులు కనిపిస్తుండటంతో, ఆకాశం వైపు ఆందోళనగా చూస్తూ.. వర్షాలు, తుపానులు వస్తాయేమోనని అన్నదాతలు భయపడుతున్నారు. ఆర్‌బికెలకు సరిపడినన్ని సంచులు కూడా రాకపోవడం గమనార్హం. ఏలూరు జిల్లా ఉంగుటూరులో గోనె సంచుల కోసం రైతులు తాజాగా ఆందోళన చేసి, వచ్చిన లోడులోని సంచులన్నీ దించేసుకోవడం పరిస్థితికి అద్దంపడుతోంది. ఇ-క్రాప్‌ బుకింగ్‌ యాప్‌ ద్వారా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం ప్రయత్నిస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. ఈ యాప్‌తో ధాన్యం కొనుగోళ్ల అనుసంధానంలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. అన్ని ఖర్చులూ భరిస్తామని సర్కారు ప్రకటించినా, కాటా వేయించినందుకు, వేబ్రిడ్జి వద్దకు తీసుకెళ్లినందుకు క్వింటాకు రూ.50 వరకూ ఖర్చవుతోందన్నది క్షేత్రస్థాయి పరిస్థితి. తేమ పేరుతో బస్తాకి రెండు నుంచి మూడు కిలోల తరుగు తీసేస్తున్నారన్న ఫిర్యాదులూ ఉన్నాయి. ఇంటా బయటా అప్పులు చేసి, పసిడి తాకట్టుపెట్టి పెట్టుబడులు పెట్టిన అన్నదాతల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సర్కారు డబ్బులు ఎప్పుడు ఇస్తుందన్న స్పష్టత లేక తలలు పట్టుకుంటున్నారు.
       అష్టకష్టాలు పడి పండించిన టమాటాలను మార్కెట్‌కు తీసుకుపోయి అమ్మితే దారిఖర్చులూ రావడం లేదంటూ రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో కిలో రూ.2 కూడా రాకపోవడంతో కొందరు రైతులు రోడ్లపై పోసేసిన, మరికొందరు పొలాల్లోనే ఉంచేసిన వార్తలు ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఉల్లి ధరలు సైతం అమాంతం పడిపోయాయి. మధ్యస్థ, కనిష్ట రకాలకు క్వింటా ధర రూ.వెయ్యిలోపే ఉండటంతో పెట్టిన పెట్టుబడులుసైతం రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులంతా సిండికేట్‌ అయి ధరలు దిగ్గోస్తున్నారని టమోటా, ఉల్లి రైతులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. గూడూరు నిమ్మ మార్కెట్‌లో కిలో రూ.10 ధర మాత్రమే వస్తుండటంతో, కాయలు కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నామని పలువురు రైతులు తెలిపారు. నిమ్మ, టమోట లాంటి వాటి కోసం కోల్డ్‌ స్టోరేజిలు, ఆహార శుద్ధి పరిశ్రమల లాంటి వాటిని ఏర్పాటు చేయాలన్న రైతన్నల గోడును పట్టించుకునే తీరిక పాలకులకు ఉండటం లేదు. రైతు ప్రభుత్వమని ఊరూవాడా చాటుకుంటున్న పాలకులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి నికరంగా అన్నదాతల తరపున నిలబడాలి. అన్ని పంటలకు మద్దతు ధర దక్కేలా, ముఖ్యంగా సకాలంలో సక్రమంగా కొనుగోళ్లు జరిపించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే.