అనగా అనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. ఆ కోతి రోజూ చెట్ల మీద ఆడుకుంటూ చెట్లకున్న పండ్లు తింటూ ఉండేది. అలా రోజులు గడిచాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ కోతిని 'ఏ పనీ లేకుండా ఆడుతూ పాడుతూ తిరుగుతుంది!' అని వెక్కిరించాయి. అడవిలో ఉన్న జంతువులు అలా అన్న మాటలు విని కోతి చాలా బాధపడింది.
ఒకరోజు అడవిలో వెళుతుంటే అక్కడ కొన్ని జంతువులు ఒక వరుస కట్టి నిలబడి ఉన్నాయి. కోతి వెళ్లి అక్కడ వరుసలో ఉన్న నక్కను'నక్క బావా! నక్క బావా! అందరూ ఏంటి వరుసలో నిలబడి ఉన్నారు. ఏమైంది?' అని అడిగింది కోతి.
'ఇక్కడ ఒక కుందేలు ఉంది. అది దెబ్బ తగిలిన వాళ్లకి ఔషధం ఇస్తుంది. ఔషధం తాగిన వారికి రెండు మూడు రోజుల్లో దెబ్బ తగ్గిపోతుంది' అని నక్క కోతితో చెప్పింది.
'నా కాలికీ దెబ్బ తగిలింది. అందుకనే నేను ఆ ఔషధం ఇచ్చే కుందేలు దగ్గరికి వెళ్త్తున్నాను' అని నక్క చెప్పింది. అది విన్న కోతి ఆ కుందేలు దగ్గరికి వెళ్లింది. 'కుందేలు మామా! కుందేలు మామా! మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇవ్వరా?' అని అడిగింది కోతి. అది విన్న కుందేలు 'నా దగ్గర ఏ పనీ లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు' అని అన్నది.
కోతి అక్కడి నుండి వెళ్లింది. కానీ రోజూ కోతి పని ఇవ్వమని కుందేలు దగ్గరికి వచ్చేది. ఒకరోజు కుందేలు కోతితో 'నువ్వు బాగా పట్టుదలతో ఉన్నావు. నీకు నా దగ్గర పని ఇస్తా' అని చెప్పి కోతికి పని ఇచ్చింది. కుందేలుకి పనిలో సహాయం చేసేది కోతి. ఒకరోజు కోతి 'అయ్యా ! మీ ఔషధాల రహస్యం నాకు చెప్పండి. మీ తర్వాత నేనే కదా ఔషధాలు వీటికి ఇచ్చేది' అని అన్నది.
'మిత్రమా! అక్కడ ఉన్నపెట్టెలో డబ్బులు ఉన్నాయి. తీసుకొని ఎక్కడికైనా వెళ్లి, వ్యాపారం చేసుకుని బతుకు'.
'అదేంటి గురువుగారు మీరు ఔషధ రహస్యం చెబుతారనుకుంటే డబ్బులు ఇచ్చి వెళ్లమంటున్నారు'. అంది కోతి.
'ఔషధ రహస్యం ఏమీ లేదు. ఈ అడవిలో ఉన్న జంతువులు నా మీద పెట్టుకున్న నమ్మకమే. ఆ నమ్మకంతోనే వాటి గాయాలు మానిపోయాయి!' అని చెప్పింది కుందేలు. ఇదే విషయాన్ని అడవిలోని జంతువులకు కూడా చెప్పింది కుందేలు.
'ఇకనైనా మీరు నమ్మకంతో ఉండండి. గాయాలు వాటంతటవే తగ్గుతాయి' అని కుందేలు చెప్పింది. అలా కొంత కాలానికి కాలం చేసింది కుందేలు.
- షేక్ రిజ్వాన
63053 93291