
ఈ నెల 6-19 వరకు ఈజిప్టులో షర్మ్-ఎల్ -షేక్‌లో ఐక్యరాజ్య సమితి పరిధిలో గల వాతావరణ మార్పుల సదస్సు (కాప్-27) కంటి తుడుపుకే పరిమితమైంది. ఎప్పటిలాగానే వాతావరణ కాలుష్యానికి కారణమైన పెట్టుబడిదారీ ధనిక దేశాలు అందుకు పూచీ పడకుండా నేరాన్నంతా అభివృద్ధి చెందుతున్న పేద దేశాలపై నెట్టేందుకు శక్తి వంచన లేకుండా పని చేశాయి. గత భేటీల్లో ఇచ్చిన హామీలైన కర్బన వాయు ఉద్గారాల తగ్గింపు, పేద దేశాలకు ఆర్థిక సహాయం వంటి ప్రధానాంశాల ఉల్లంఘనపై అమెరికా, యూరప్ దేశాలు ప్రాయశ్చిత్తం చేసుకోవడం అటుంచి కనీస ప్రస్తావన సైతం చేయకపోవడం ప్రపంచంపై వాటి దాష్టీకాన్ని తెలుపుతుంది. కాగా వాతావరణ ప్రభావాల మూలంగా నెలకొంటున్న విపత్తులనెదుర్కొంటున్న దేశాలకు నష్ట పరిహార నిధిని నెలకొల్పే అంశాన్ని కాప్-27 కాన్ఫరెన్స్ ఎజెండాలో ఒక ప్రతిపాదిత అంశంగా చివరి నిమిషంలో చేర్చగా, దాన్ని ఆమోదించడం, వచ్చే ఏడాది జరిగే కాప్-28 సమావేశంలో వివరంగా చర్చించాలనుకోవడం ఒక సానుకూల చర్య. గత అనుభవాల నేపథ్యంలో నష్ట పరిహార నిధి (లాస్ అండ్ డ్యామేజి ఫైనాన్స్ ఫెసిలిటీ)పై ఏ మేరకు చర్చ జరుగుతుందో ఏ స్థాయిలో సాకారమవుతుందో అనుమానమే. ఇప్పటికైతే నిధికి ఏ దేశం ఎంత చెల్లించాలి మొత్తం ఎంత సమీకరించాలి అనే ప్రాథమిక విషయాలు కూడా ప్రతిపాదనల్లో లేవు. ఈ మాత్రం దానికే భారత ప్రభుత్వం హర్షం ప్రకటించింది.
కాప్-27 సమావేశంలో దాదాపు 200 దేశాల ప్రతినిధులు పాల్గొనగా, వాతావరణ మార్పుల పర్యవసానాలపై తీవ్ర హెచ్చరికలే వెలువడ్డాయి. భూ ఉష్ణోగ్రతల (గ్లోబల్ వార్మింగ్) పెరుగుదలను 1.5 డిగ్రి సెల్సియస్‌కు పరిమితం చేసే లక్ష్య సాధనకు కర్బన వాయు ఉద్గారాల విడుదలను తగ్గించుకోల్సి ఉండగా, ప్రస్తుతం అదనంగా 1.1 డిగ్రి సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పెరిగాయని 'ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్' తాజా నివేదిక వెల్లడించింది. అయినా కాప్-27లో గ్రీన్ హౌస్ వాయువుల కట్టడిపై ధనిక దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం వాటి దౌర్జన్య వర్గ స్వభావానికి నిదర్శనం. బొగ్గు వినియోగాన్నే తగ్గించాలనడానికి ప్రాతిపదిక లేదు. సహజ వాయువు, చమురు సైతం కర్బన ఉద్గారాలను విపరీతంగా వెదజల్లుతుండగా బొగ్గును మాత్రమే తగ్గించాలనడంలోనూ పెట్టుబడిదారీ దేశాల కుట్ర దాగుంది. నష్టపరిహారం విషయంలో.. కొన్ని శతాబ్దాల క్రితం పారిశ్రామిక విప్లవం సాధించిన దేశాలను, ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగా వృద్ధి చెందుతున్న భారత్, చైనా వంటి దేశాలను ఒకే గాటన కట్టడమూ ధనిక దేశాల కుతంత్రమే. ఈ కుట్రను చైనా, భారత్ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించడం, పలు దేశాలు మద్దతివ్వడం మంచి పరిణామం.
పారిశ్రామికీకరణతో ప్రపంచం మీదికి కాలుష్య కారకాలను పంప్ చేసి లాభాలు పోగేసుకున్న పెట్టుబడిదారీ దేశాలు, ప్రకృతి వినాశాలతో నష్టపోతున్న పేద దేశాలకు నష్ట పరిహారం చెల్లించడం సహజ న్యాయ సూత్రం. కాగా తమ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయి. కాప్-27కు బొగ్గు ఆధారిత కంపెనీలు, ఆయిల్, గ్యాస్ సంస్థలకు చెందిన లాబీయిస్టులు వందల సంఖ్యలో హాజరయ్యారంటే వారు ఎంత ప్రభావవంతంగా పని చేశారో అర్థమవుతుంది. నష్ట పరిహార నిధిపై చర్చల్లో ప్రతిష్టంభన వలన ఒక రోజు సమావేశాన్ని పొడిగించాల్సి వచ్చింది. వచ్చే భేటీలో చర్చ కోసం తయారు చేసిన ముసాయిదాలో ఆ అంశాన్ని చేర్చడానికి పేద దేశాల ఒత్తిడే కారణం. నిధి విషయంలో సమ న్యాయం ప్రాతిపదికన పెట్టుబడిదారీ దేశాల బాధ్యతను నెరవేర్చేలా పేద దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాలి. విపరీత వర్షాలు, వరదలు, వడగాలులు, కరువు కాటకాలు వాతావరణ కాలుష్యం వల్లనే సంభవిస్తున్నాయి. పాకిస్తాన్, నైజీరియాలో భారీ వరదలు, యూరప్, అమెరికా, చైనాలో తీవ్ర కరువు చూస్తున్నాం. అడ్డూ అదుపు లేకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రకృతి వనరులను కొల్లగొట్టడం వలన వినాశకర పరిస్థితులకు దారి తీస్తోంది. మానవ మనుగడకే ముప్పు కలిగించే కాలుష్యాన్ని నివారించడం తక్షణావసరం.