Dec 17,2022 09:32
  • లెక్కలు 'సరి'చేస్తున్న ఆర్థికశాఖ
  • ఆదాయ, వ్యయాలు సమానమేనట.. అయినా భారీలోటు
  • మొత్తం రుణాలు రూ.53,440 కోట్లు
  • అక్టోబర్‌ నాటికి అదే ద్రవ్య లోటుగా ఎజి ప్రకటన

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఏడు నెలల ఆర్థిక గణాంకాలు అధ్యయనం చేస్తే రాష్ట్ర ఖజానా కష్టాల్లో ఉన్నట్లు తేటతెల్లమౌతోంది. తాజాగా అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం అక్టోబర్‌ వరకు ఆర్ధిక పరిస్థితిపై విడుదల చేసిన లెక్కల మేరకు భారీగా లోటు ఉన్నట్లు తేలింది. రాష్ట్ర ఆర్థికశాఖ నుంచి అందిన సమాచారం మేరకే ఈ లెక్కలు విడుదల చేయగా.. ఆదాయ, వ్యయాలు సమానంగా ఉన్నట్లు నివేదికలో చూపించడం విశేషం. అక్టోబర్‌ వరకు 1,37,368 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు పేర్కొనగా.. ఖర్చును కూడా అంతే మొత్తంగా చూపించడం విశేషం. ఆదాయంలో పన్నుల రూపేణా రూ.60,814 కోట్లు రాగా.. పన్నేతర ఆదాయం రూ.2,287 కోట్లు వచ్చింది. కేంద్రం నుంచి గ్రాంట్లు రూపేణా రూ.20,809 కోట్లు వచ్చింది. వ్యయానికి సంబంధించి రూ.1,37,368 కోట్లు వచ్చినట్లు చూపించగా.. అందులో రెవెన్యూ వ్యయమే రూ.1,29,981కోట్లుగా గుర్తించారు. పెట్టుబడి వ్యయంగా రూ.5,876 కోట్లు పేర్కొన్నారు. ఆదాయ, వ్యయాలను సమానంగానే చూపించినప్పటికీ లోటు మాత్రం భారీగా నమోదు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏడు నెలల్లో రెవెన్యూ లోటు రూ.46,071 కోట్లు రికార్డయ్యింది. ఇతర వ్యయం కోసం రూ.53,441 కోట్లు రుణంగా తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇదే మొత్తాన్ని ద్రవ్యలోటుగా కూడా నమోదు చేశారు.
 

                                                                      అప్పులు భారీగానే..

ఏడు నెలల కాలంలో రూ.53,441 కోట్లను రుణంగా తీసుకున్నట్లు ఏజీ కార్యాలయం వెల్లడించింది. ఇందులో పబ్లిక్‌ రుణాల ద్వారా రూ.40,245 కోట్లు సేకరించగా.. ఇతర రుణాల ద్వారా మిగిలిన నగదు సేకరించినట్లు నివేదికగా తేల్చారు. ఈ ఏడాదికి మొత్తర రుణ పరిమితి రూ.48 వేల కోట్ల వరకు ఖరారు చేయగా, ఏడు నెలల కాలరలోనే రూ.53 వేల కోట్లు దాటిపోవడం గమనార్హం.

22