Apr 02,2023 06:34

రాహుల్‌ గాంధీపై పార్లమెంట్‌ అనర్హత వేటు వెయ్యడం అనుచితం. పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే వెంటనే ఆ తీర్పుని, శిక్షని ఒక నెల పాటు అమలు కాకుండా సస్పెండ్‌ చేసింది. ఆ తీర్పుపై అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోర్టు ఉద్దేశ్యం. అది ముద్దాయి హక్కు కూడా. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ఎవరైనా చట్టసభల్లోని సభ్యుడు ఏదైనా కేసులో రెండేళ్లు, అంతకు మించి జైలు శిక్షకు గురైతే వెనువెంటనే ఆ సభ్యత్వానికి అనర్హుడు అయ్యే వీలుంది. ఇక్కడ రాహుల్‌ గాంధీ విషయంలో జరిగింది తప్పు అనలేం. ఎందుకంటే చట్టం ప్రకారం అనర్హత అవకాశం ఉంది. అలా అని సమర్ధించలేం. ఎందుకంటే కోర్టు చెప్పిన సగం మాటని పరిగణన లోకి తీసుకుని మిగతా సగం వదిలేయబడ్డది. శిక్షని గమనం లోకి తీసుకున్న పార్లమెంట్‌, ఆ శిక్షపై అదే కోర్టు విధించిన ఒక నెల గడువుని విస్మరించింది. ఆగమేఘాల మీద ఆయనని అనర్హుడిని చేసింది. ఈ అత్యుత్సాహం అవసరం లేదు. ఎందుకంటే అవినీతి, కరడుగట్టిన నేరం లాంటి సీరియస్‌ కేసులో ఆయనకు శిక్ష పడలేదు. మరో వైపు ఆయన ఎదుర్కొన్న కేసులో రెండేళ్ళన్నది గరిష్ట శిక్ష. పార్లమెంట్‌లో అనర్హుడు అవ్వడానికి కనీస శిక్ష అది. ఆ రకంగా చూసినా కేసుకి సంబంధించి ఆయన గరిష్ట శిక్షకు పాత్రుడయ్యే విషయంలో కోర్టు పరిశీలించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ బేరీజు వేసుకుని పార్లమెంట్‌ తొందర పడకుండా ఉండాల్సింది. శిక్షపై ఉన్న సస్పెన్షన్‌ గడువు తీరేవరకైనా ఆగాల్సింది.
- డా.డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం.