ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈ నెల 15న విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పర్యటనకు త్వరితగతిన అన్ని ఏర్పాట్లూ చేయాలని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్తు చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులకు ఆదేశించారు. బుధవారం జేఎన్‌టీయూ సమీపంలోని హెలీప్యాడ్ స్థలాన్ని, వైద్యకళాశాలలో పనులను వారు పరిశీలించారు. ఇప్పటి వరకూ చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. హెలీప్యాడ్ ప్రదేశం నుంచి కళాశాలకు వచ్చే వరకూ ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. జిల్లా ప్రజల చిరకాల కోరికైన వైద్యకళాశాలను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసేలా వివిధ కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యకళ, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ పద్మలీల, ఇతర అధికారులు ఉన్నారు.ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, జోనల్ ఇన్‌చార్జిలు, ముఖ్యనాయకులతో తన నివాసం వద్ద బుధవారం సమావేశమయ్యారు. నాయకులకు దిశానిర్దేశం చేశారు.










