ప్రజాశక్తి-కాకినాడ : తెలుగు భాష పరిరక్షణ, ప్రాచుర్యానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డా.కతికా శుక్లా పిలుపునిచ్చారు. వ్యవహారిక బాషా ఉద్యమ పితామహుడు, విద్యావేత్త గిడుగు రామ్మూర్తి జయంతి పురస్కరించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలను అధికారులు, సాహితీ వేత్తలు మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాలులో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై తెలుగు తల్లి, గిడుగు రామ్మూర్తి చిత్ర పటాలకు పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు మాట్లాడే వాడుక భాష గొప్పదనాన్ని చాటి చెప్పి, వ్యవహారిక భాషోద్యమం ద్వారా సమాజంలో సర్వజనావళికి సాహిత్య మాధుర్యాన్ని, విద్య, విజ్ఞానాలను చేరువలోకి తెచ్చిన మహనీయునిగా గిడుగు రామ్మూర్తిని కొనియాడారు. గిరిజన ప్రజలు మాట్లాడే సవర భాషకు లిపి రూపొందించి, వారి సముద్దరణ కోసం ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. గిడుగు రామ్మూర్తి చేసిన కృషి తెలుగు భాషా వికాసానికి, తెలుగు ప్రజలను ఐక్యపరచి ప్రగతి పధంవైపు ఏకోన్ముఖంగా నడిపించేందుకు ఎంతగానో దోహదం చేయాలన్నారు. అందుకే యేటా ఆగష్టు, 29వ తేదీన ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తోందని కలెక్టర్ తెలిపారు. ఎన్ని భాషలు, విద్యలు నేర్చినా మాతభాష గొప్పదనాన్ని మరచి పోకూడదని, మధురమైన తెలుగు భాషను, సాహిత్యాన్ని పరిరక్షించి, పరిపుష్టం చేసి రానున్నతరాలకు అపురూప సంపదగా అందించాల్సిన గురుతర బాద్యత నేటి తరం ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అలాగే తెలుగు భాషా దినోత్సవ వేడుకలలో భాగంగా పద్య, వచన, గేయ, కధ, విమర్శ, అవధారణ, శతక, బాల సాహిత్య ప్రక్రియలలో విశేష సేవలు అందిస్తున్న 9 మంది లబ్దప్రతిష్టులైన కవులను జిల్లా కలెక్టర్ సముచిత రీతిలో సత్కరించి వారి భాషా సేవలను అభినందించారు. ప్రముఖ కవులు గొట్టిముక్కల వెంకట లక్ష్మీ నరశింహ శాస్త్రి, టి.విశ్వనాధరావు, మాకినీడి సూర్య భాస్కర్, అద్దేపల్లి ప్రభు, తంత్రవహి శ్రీరామమూర్తి, అద్దేపల్లి జ్యోతి, అంగర కృష్ణశ్రీ, కాకరపర్తి దుర్గాప్రసాద్, శ్రీపాద సూర్యప్రకాశరావులు ఈ సత్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ కె.శ్రీధరరెడ్డి, కాకినాడ ఆర్డిఓ ఎన్.వి.వి.సత్యన్నారాయణ, పిడి డిఆర్డిఏ కె.శ్రీరమణి, జిల్లా సమాచార పౌర సంబంధ అధికారి డి.నాగార్జున, సమాచార ఇంజనీరు సి.బాబూరావు, పిఆర్‌ఓలు కె.రవి, ఎస్.అజరు, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు శివ, రవిచంద్ర, కలెక్టరేట్ సిబ్బంది, తెలుగు భాషాభిమానులు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.










