Oct 16,2022 07:10

మానవుని జీవితంలో ఆహారం ప్రాముఖ్యర గురించి అందరికీ తెలిసిందే. ఈ భూమిపై జీవి మనుగడ కొనసాగడానికి ఆహారం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. అలాగే ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవించడం సాధ్యం కాదు.. జీవితంలో ఆహారం ప్రాముఖ్యతను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అయితే ఉత్పత్తి తగ్గుదల, ప్రభుత్వ విధానాలు, కోవిడ్‌-19 మహమ్మారి, పరిణామాలు, వాతావరణ మార్పులు, అసమానతలు, పెరుగుతున్న ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలతో సహా అనేక సవాళ్లు ప్రజలకు పౌష్టికాహారాన్ని దూరం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు ఈ ప్రతి సవాళ్లను ఎదుర్కొనే దిశగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ఏటా ఓ నిర్దిష్ట లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అలా ఈ ఏడాది 'ఎవరినీ వదిలిపెట్టవద్దు' .(థీమ్‌) అనే లక్ష్యంతో 'ప్రపంచ ఆహార దినోత్సవం' నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం..

ఆహారం ప్రాథమిక మానవహక్కుగా పరిగణించబడుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ తొమ్మిది మందిలో ఒకరు దీర్ఘకాలిక ఆకలిని అనుభవిస్తున్నారు. ఇదే ప్రస్తుతం అందరికీ ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎందుకంటే ఇది భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అంచనా. సంపన్నులు మరింత సంపన్నులుగా.. పేదలు మరింత పేదలుగా మారుతున్న ఆర్థిక విధానాలు అమలు జరుగుతున్న నేపథ్యం ఒక ముఖ్య కారణం. ఓ వైపు కోవిడ్‌-19 మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులను తీవ్రంగా దెబ్బతీసింది. అనేక మంది ఉపాధి కోల్పోయి సరైన పోషకాహారం అందని పరిస్థితి. ఇదిలా ఉంటే ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గుదల, పోషకాహారం లోపం నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఆహారాన్ని ఆదా చేయడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం మనముందున్న తక్షణ కర్తవ్యం. అయితే ఆహారం విలువ తెలియజెప్పడంతో పాటు ప్రతి ఒక్కరికీ సరైన పోషకాహారం అందించాలన్న లక్ష్యంతో, భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోపం సమస్యలను నిర్మూలించాలనేది కూడా ఈ వరల్డ్‌ ఫుడ్‌ డే ప్రధాన ఉద్దేశం.
ప్రపంచ ఆహార దినోత్సవం చరిత్ర..

food


ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) 1945లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయి. 1979 నుండి ఏటా అక్టోబర్‌ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆహారం విలువ ఏంటో చాటి చెప్పటానికే. హంగేరియాకు చెందిన మాజీ వ్యవసాయ, ఆహార మంత్రి డాక్టర్‌ పాల్‌ రోమానీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
గ్లోబల్‌ సమస్యగా..
గత మూడేళ్లుగా.. 'సార్స్‌'.. 'కరోనా'.. 'మంకీ పాక్స్‌'..వంటి మహమ్మారులను ఎదుర్కొంటున్నాం.. కానీ వీటన్నింటికన్నా 'ఆకలి' పెద్ద మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే అత్యంత పెద్ద మహమ్మారి ఇదే. మనిషి ఏం చేసినా ఈ ఆకలి తీర్చుకోటానికే. జానెడు పొట్ట నింపుకోవటానికి కాయకష్టం చేసే కూలీల నుంచి కోట్లకు పడగలెత్తినవారు కూడా ఆకలి తీరందే ఏ పనీ చేయలేరు. ఆ కడుపు నింపుకోవటానికే ఇన్ని పాట్లు. ఈ ఆకలి అనేక పేద దేశాల్లోనే కాదు.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలను సైతం వెంటాడుతోంది.. అయితే అన్నిరకాల ఆహారం, ఇంకా చెప్పాలంటే మితిమీరి తినగలిగే వారు కొందరుంటే.. పట్టెడన్నం లేక ఆకలితో చనిపోయే దారుణ స్థితిలో అత్యధిక పేదలున్నారు. ఈ అసమానత సరికావాల్సి ఉంది. ఎయిడ్స్‌, మలేరియా, క్షయ వ్యాధుల వల్ల జరిగే మరణాల కంటే.. ఆకలి వల్ల జరిగే మరణాల రేటే ఎక్కువగా ఉందనే విషయం అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఈ మరణాల స్థాయి ఎంతగా ఉందంటే.. ప్రతిరోజూ 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు.
అయితే ఓ పక్క పెరుగుతున్న జనాభా. మరోపక్క తగ్గుతున్న వ్యవసాయం. అసమానతను పెంచే పాలకుల విధానాలు.. దీంతోనే అధికమవుతున్న ఆకలి చావులు. ఈ క్రమంలో 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో ఆహార ఉత్పత్తిని పెంచడం అంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తే కొంతలో కొంత ఆహార సంక్షోభాన్ని నివారించవచ్చు. కానీ వ్యవసాయం చేసే పద్ధతులు ముఖ్యంగా సేంద్రీయ పద్ధతులనే అనుసరించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నా అది ఆచరణలో ఫలితాలు ఇవ్వవనేది.. తక్షణ సమస్యను పరిష్కరించలేవనేది శ్రీలంక పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. మెరుగైన పంట, నిల్వ, ప్యాకింగ్‌, రవాణా, మౌలిక సదుపాయాలు, మార్కెట్‌ యంత్రాంగాలతో పాటు, సంస్థాగత చట్టపరమైన చర్యలు అవసరం. వీటితో పాటు అనేక కార్యక్రమాల ద్వారా ఆహార నష్టాలను తగ్గించే ప్రయత్నాలు చేయాలి.

ggh

జిహెచ్‌ఐలో దిగజారిన భారత్‌..
మరోవైపు గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ మరింత దిగజారింది. పోషకాహార లోపం, చిన్నారుల్లో వయసుకు తగిన బరువు, ఎత్తు లేకపోవడం, మరణాలు.. అనే నాలుగు సూచికల ఆధారంగా ఈ జాబితా రూపొందిస్తారు. ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్‌ఐ) 2022లో 121 దేశాల్లో భారత్‌ 107వ స్థానానికి పడిపోయింది. అంతకు ముందు నివేదిక ప్రకారం 101వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 107కి దిగజారడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ కంటే కూడా భారత్‌ వెనుకబడి ఉందని తెలుస్తోంది. బ్రెజిల్‌, చిలీ, చైనా, క్యూబా, కువైట్‌ సహా 18 దేశాలు జీహెచ్‌ఐ స్కోరు తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. ఈ వివరాలు ఆకలి, పోషకాహార లోపాలను లెక్కించే జిహెచ్‌ఐ వెబ్‌సైట్‌ గతేడాది వెల్లడించింది.
ఆహార ధాన్యాల సంక్షోభం..
ప్రపంచవ్యాప్తంగా 852 మిలియన్ల మంది దీర్ఘకాలంగా అతి పేదరికం కారణంగా ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా ప్రభుత్వాలు అనుసరించే విధానాలు అసమానతలను పెంచేలా ఉండటం. విపరీతమైన జనాభా పెరుగుదల, వాతావరణ మార్పు, ఆహార ధాన్యాలను జీవ ఇంధనాల కోసం ఉపయోగించడం, మౌలిక ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గించి లాభదాయకమైన వాణిజ్య పంటలవైపు మొగ్గుచూపడం... ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, చట్టాలు చేయడం.. సరైన ప్రోత్సాహకాలు లేకపోవడం.. గిట్టుబాటు ధర లేకపోగా.. కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో నష్టాలతో కూడిన వ్యవసాయం చేయలేక ప్రతీ ఏటా రైతులు తగ్గిపోతున్నారు. చదువుకున్నవారు వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మరికొద్ది రోజుల్లో ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి తీవ్రం కావొచ్చు. వీటన్నింటి పర్యవసానంగా ఆహారధాన్యాల ధరలు ఆకాశాన్నంటటం మరో సమస్య.

cild

మహిళలపై ఎక్కువ ప్రభావం..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 821 మిలియన్ల ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. తద్వార వీరు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 99 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన ప్రజలే కావటం గమనించాల్సిన విషయం. ఆకలి అంటే అమ్మే గుర్తుకొస్తుంది. అటువంటి అమ్మ తాను ఆకలితో అలమటిస్తున్నా బిడ్డల కడుపు నింపాలనే చూస్తుంది. అటువంటి మహిళలే ఇప్పుడు ఎక్కువగా ఆకలితో బాధపడుతున్నారు. ఏ ఒక్క సమస్య వచ్చినా అది ముందు మహిళలపైనా, వారి ఆరోగ్యాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అలాగే ఆకలి, పోషకాహార సమస్య కూడా మహిళలనే ఎక్కువగా వెంటాడుతోంది.
ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60 శాతం మంది మహిళలే ఉండటం గమనించాల్సిన విషయం. మహిళలు ఆకలితో ఉంటే ముఖ్యంగా గర్భిణులకు ఇలాంటి సమస్య ఉంటే పుట్టే పిల్లల మీదా ఆ ప్రభావం పడుతుంది. దీంతో అనారోగ్యకరమైన పిల్లలు జన్మిస్తారు. ప్రస్తుతం జరిగేదీ అదే.. ఏటా దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారనే గణాంకాలే దీనికి నిదర్శనం. ఇందులో కూడా 96.5 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండటం గమనార్హం. వీరిలో ప్రతి ఐదు జననాలలో ఒక బిడ్డ సరైన వైద్య సదుపాయం లేకపోవటం వల్లే ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి. దీంతో పిల్లల మరణాలలో 50 శాతం మంది ఐదు సంవత్సరాల లోపు వారే ఉండటం గమనించాల్సిన విషయం.
కారకులు ఎవరు..?
ప్రకృతితో సహజీవనం చేస్తున్నప్పుడు అనూహ్యంగా సమస్యలు వస్తుంటాయి. అటువంటి సందర్భాల్లోనూ ఆహారం అత్యవసరం. ఆ దిశలో పాలకుల ధ్యాస ఉండాలి. అందుకు తగ్గ ప్రణాళికలు చేయాలి. ఇలాంటి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నట్లనిపిస్తున్నా ఎక్కడో ఏదో లోపం ఉందనిపిస్తుంది. అందుకు నిదర్శనమే ఈ నాటికీ అన్నం లేక విలవిల్లాడుతున్న దేశాలు. కారణం కరువు కావచ్చు. వరదలు కావచ్చు. ఆర్థిక వెనుకబాటుతనమూ కావచ్చు. వీటన్నింటికీ మూలం ప్రభుత్వ విధానాలేనన్న విషయం మరిచిపోకూడదు. ఏదేమైనా ఇది మానవాళి ఎదుర్కొనే తీవ్రమైన బాధ.
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉందని ఓ నివేదిక పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం ప్రభుత్వాల విధి. మరి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే దేశంలో పౌరులందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వటంలేదనేదీ మరో వాదన.

food waste

కలుషిత ఆహార బాధితులు..
తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఏది దొరికితే అది తిని, ఆకలి తీర్చుకోవాల్సిన దుస్థితి ఓ పక్క అయితే.. ధనార్జనే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు ఆహారాన్ని కల్తీ చేయడం వల్ల, అక్రమ నిల్వలు చేసేందుకు క్రిమిసంహారకాలు కలపడం, నిల్వ ఆహారం తినడం వల్ల కూడా ఆహారం కలుషితం అవుతోంది. దీనికితోడు అపరిశుభ్రమైన వాతావరణం, కలుషిత నీరు, మురికి కూపాలుగా మారుతున్న మురికివాడలు.. వెరసి.. ప్రపంచంలో ప్రతి10 మందిలో ఒకరు కలుషిత ఆహార బాధితులుగా మారుతున్నారు. పిల్లల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. ఏటా ఐదేళ్ల లోపు పిల్లలైన 1,25,000 మంది కలుషిత ఆహారం కారణంగా మరణిస్తున్నారు. సురక్షిత, శుభ్రమైన ఆహారాన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, కలుషిత ఆహారం ద్వారా కలిగే అనారోగ్యం తదితర అంశాలపై అవగాహన పెరగాలి.

table

అడుగంటుతున్న నిల్వలు..
ఆహారకొరత దేశాన్ని కూడా చుట్టుముడుతోంది.. తాజా పరిణామాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో బియ్యం నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి దేశంలో 78.6 మిలియన్‌ టన్నుల బియ్యం నిల్వలు ఉండగా, ఈ ఏడాది నిల్వలు 44 మిలియన్‌ టన్నులకు పడిపోయాయి. రానున్న రోజుల్లో ఈ అననుకూల వాతావరణ పరిస్థితుల్లో ఆహార కొరత ఏ స్థాయిలో విరుచుకుపడనుందో ఈ సంఖ్యలే తేటతెల్లం చేస్తున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది ధాన్యం సేకరణ కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని, నిర్ధేశించిన లక్ష్యాలు అందుకోవడం దాదాపు అసాధ్యమనే అంచనాలు వెలువడుతున్నాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటే దేశంలో తిండి గింజలకు సంబంధించి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టే! అదే జరిగితే సామాన్యుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టే! ఈ ఏడాది ప్రారంభంలో గోధుమలకు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. అంతకన్నా తీవ్రగానే బియ్యం కొరత రానుందని 'డౌన్‌ టు ఎర్త్‌' తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది.
వృథా అరికట్టడం అవసరం..
ఈ రోజుల్లో అన్నం విలువ కొంతమందికే తెలుస్తుంది. ఎందుకంటే అన్నం తినేవాడికన్నా దానిని పండించేవారికే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఆహారం పారేయడానికి ఒక్క నిమిషం చాలు. కానీ ఆ ఆహారాన్ని పండించడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ విషయం తెలియక చాలా మంది దానిని వృథా చేస్తారు.
అయితే ఏటా సుమారు 900 మిలియన్‌ టన్నుల (90 కోట్ల టన్నులు) ఆహారం వృథా అవుతోందని ఓ గ్లోబల్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. ఇళ్లు, దుకాణాలు, రెస్టారెంట్లతో కలిపి మనుషులు తినే ఆహారంలో 17% చెత్తకుండీల్లోకి వెళుతోందని యునైటెడ్‌ నేషన్స్‌ పర్యావరణ కార్యక్రమం (యుఎన్‌ఈపి) కి చెందిన ఆహార వృథా సూచి (ఫుడ్‌ వేస్ట్‌ ఇండెక్స్‌) రిపోర్ట్‌ వెల్లడించింది.
అయితే ఈ సమస్య గతంలో కేవలం ధనిక దేశాలకే పరిమితమైందని అనుకునేవారు. ఆ దేశాల్లో కస్టమర్లు తమకు కావాల్సిన దానికన్నా ఎక్కువ కొని, వృథా చేసేవారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి ప్రతిచోటా కనిపిస్తోందని నివేదిక చెబుతోంది. అయితే ఏ దేశంలో ఎక్కువ, ఏ దేశంలో తక్కువ అనేది ధనిక, పేద దేశాల మధ్య కాస్త అటూ ఇటుగా మారుతోందని నివేదిక చెప్పింది. ఇందులో ఉద్దేశపూర్వకంగా పడేసేది, అనుకోకుండా వృథా అయ్యేది ఎంత అన్నది అంచనా వేయడమూ కష్టమే.
వృథా అవుతున్న ఆహారంలో 60% జన నివాసాల నుంచే వస్తోందని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఆహార ధాన్యాల కృత్రిమ కొరత సృష్టించేం దుకు కార్పొరేట్‌ కంపెనీలు అక్రమ నిల్వలు చేయడం (ఫ్యూచర్‌ ట్రేడింగ్‌) వల్ల ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల ముక్కిపోవడం, పాడైపోవడం ద్వారా మిగతా 40% వృథా అవుతోందనేదీ కొన్ని సర్వేల ఫలితాలు.

food

వారధులు.. స్వచ్ఛంద సంస్థలు..
మరో అభినందించదగ్గ విషయం ఏమిటంటే ప్రపంచంలో పోషకాహారం అందక ప్రాణాలు కోల్పోకుండా ప్రయత్నించడం. వీరు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు మొదలైన వాటి దగ్గర మిగిలిన ఆహారం అవసరమైన వారికి అందేలా ప్రయత్నం చేస్తున్నారు. కొంతకాలంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు.. ఆహారాన్ని వృథాగాకుండా ఆయా హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లతో సంప్రదించి దాన్ని సేకరిస్తున్నారు. వాటిని ప్యాకింగ్‌ చేసి పేదలకు చేరేలా కృషి చేస్తున్నారు. ఆహారం పడవేసే వాళ్లకి పోషకాహారం అందక ఎంతమంది చిన్నారులు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో, ఆహారం ప్రాముఖ్యత ఏంటో అవగాహన కల్పిస్తున్నారు..
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి అలాంటి దాన్ని ఎందుకు పడేస్తారు. అందుకే మనకి కావాల్సినంత మాత్రమే తిని, మిగతా దాన్ని కావాల్సిన వారికి చేరుద్దాం. మన భవిష్యత్‌ తరాలని కాపాడుకుందాం.

రోజువారీ ఆహార ప్రణాళిక
రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఆహారం చాలా ముఖ్యం. అన్నం, పప్పు, కూరతో ముగించకుండా.. ఎనిమిది రకాల పదార్థాలు మన భోజనంలో భాగం కావాలి. రోజువారీ ఆహారంలో 350 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు, 150 గ్రాముల పండ్లు, 90 గ్రాముల పప్పులు లేదా మాంసాహారం, 30 గ్రాముల ఎండు పండ్లు, గింజలు, 27 గ్రాముల నూనెలు, బియ్యం, గోధుమలతో పాటు చిరుధాన్యాలు 240 గ్రాములు, పాలు లేదా పెరుగు 300 మిల్లీలీటర్లు ఉండేలా చూసుకోవాలి. ఇలా మొత్తంగా చూసుకుంటే కనీసం 1187 కిలో క్యాలరీలు ఆహారంగా తీసుకోవాలి. మినిమమ్‌ డైటరీ ఎనర్జీ రిక్వైర్‌మెంట్‌ (ఎండిఈఆర్‌) ప్రకారం అయితే 1,798 కిలో క్యాలరీల ఆహారం తీసుకోవాలని గణాంకాలు చెబుతున్నాయి.

ఇవీ తక్షణ కర్తవ్యాలు..

  • ఆహార భద్రత, పౌష్టికాహారం అంటే ఏమిటో తెలిపి, వాటి అవసరం గురించి వివరించడం.
  •  జాతీయ ఆహార భద్రత చట్టంపై ప్రజలకు, అధికారులకు అవగాహన, రాష్ట్రంలో చట్టం అమలు క్రమంలో సంభవించిన మార్పులపై తెలపడం.
  •  ఈ చట్టం వల్ల కలిగే లాభాలు, ఎంత అవసరమైనవో తెలపటంతో పాటు లబ్ధిదారులు, వారి హక్కులు, బాధ్యతలు గుర్తుచేయడం.
  •  చట్టం అమలు.. ఏర్పాట్ల తీరు, ఎలా ఉండాలో సమగ్రంగా తెలియజేయడం.
  • ప్రజాపంపిణీ వ్యవస్థ, సమగ్ర శిశుఅభివృద్ధి పథకం, మధ్యాహ్న భోజన పథకం అమలు, అమల్లో ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలు కనుగొనేలా లఘు వీడియోలను తయారు చేయాలి.

- ఉదయ్ శంకర్‌ ఆకుల ఫోన్‌ : 7989726815