Sep 28,2023 19:20

'ప్రతి రెండు గంటలకు దేశంలో ఏదో ఓ మూలన మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. వార్తల్లో ఇలాంటి ఘటనలు చూసిన ప్రతిసారి నా రక్తం మరిగిపోతోంది. ఈ దారుణాలు ఇంకెప్పుడు ఆగుతాయి? మహిళలపై ఈ అఘాయిత్యాలు ఆగాలంటే మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ప్రతి బిడ్డకు సెల్ఫ్‌ డిఫెన్స్‌తో పాటు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి దారుణాలు తట్టుకుని ఈ సమాజంలో నిలడాలంటే మన పిల్లలకు జరుగుతున్న ఘటనలపై చర్చించాలి. ఇవి చిన్నపిల్లలతో చర్చించడం కష్టమైనప్పటికీ, వారి భవిష్యత్తు కోసం మన మారాల్సిందే. మన భవిష్యత్‌ తరాల పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మహిళలంతా ఇలాంటి దారుణాలపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాల'ని ఇన్‌స్టాలో నటి రితికాసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 12 ఏళ్ల బాలికపై దారుణ ఘటనను ఉద్దేశించి ఆమె ఈ పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన రితికా.. చిన్న వయసు నుంచే మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రితికా సింగ్‌, మహిళలపై జరిగే దారుణాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. మహిళలకు కచ్చితంగా సెల్ఫ్‌ డిఫెన్స్‌ రావాలని చాలాసార్లు ప్రస్తావించారు. 'గురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రితికా పలు హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.