Aug 17,2022 06:54

బీజేపీ, సంఫ్‌ుపరివార్‌ శక్తులు సృష్టించిన మనువాద వాతావరణం, కులోన్మాద ఫ్యూడల్‌ శక్తులకు (ఎలాంటి శిక్షలు లేకుండా) దళితులు, గిరిజనులకు వ్యతిరేకంగా దాడులు చేసేందుకు ప్రోత్సాహాన్నిచ్చింది. తరచుగా జరుగుతున్న కులపరమైన దౌర్జన్యాలు... మనువాద, బ్రాహ్మణవాద హింసను బీజేపీ పాలన ఎలా ప్రోత్సహిస్తుందో ప్రతిబింబిస్తాయి. అధికారుల మౌనం కూడా... సంఫ్‌ుపరివార్‌ రక్షక సమూహాలు... దళితులు, మైనార్టీలపై యథేచ్ఛగా దాడులు చేసేందుకు అనుమతి ఇస్తున్నది.

న దేశం ఇప్పుడు డెబ్భై ఐదేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా, స్వాతంత్య్ర పోరాటంలో ఏ విధంగానూ భాగస్వామ్యం లేని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం, ఒకవైపు మన స్వాతంత్య్రోద్యమ మహోన్నత విలువలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, ఫెడరలిజంలను బలహీనపరుస్తూనే, మరోవైపు 'ఆజాదీ కా అమృతోత్సవ్‌'ను జరుపుకోవాలని పిలుపునివ్వడం మన దురదృష్టం. గత ఎనిమిది సంవత్సరాలుగా ఫాసిస్ట్‌ హిందూత్వ మతోన్మాద శక్తుల అదుపులో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రతి విషయంలో దేశానికి ముప్పుగా తయారవుతున్నది. సాధించిన కొద్దిపాటి సామాజిక న్యాయానికి సంబంధించిన విజయాలను కూడా మోడీ మతోన్మాద-కార్పొరేట్‌ విధానాలు రద్దు చేస్తున్నాయి.
    1947లో స్వాతంత్రం సాధించిన తర్వాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ రచించిన ప్రజాస్వామిక, లౌకిక రాజ్యాంగం, దళితులు, గిరిజనులకు అనుకూలంగా అనేక అంశాలపై సానుకూలమైన పరిష్కారాలను సమకూర్చి, అంటరానితనాన్ని రద్దు చేసింది. చట్టం ముందు అందరూ సమానులేనని ప్రకటించింది. కులం, ఇతర ఏ విధమైన సామాజిక బేధాలతో నిమిత్తం లేకుండా 'ఒక వ్యక్తి, ఒక ఓటు'ను రాజ్యాంగం మనకిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో, చట్టసభల్లో రిజర్వేషన్లను కల్పించింది. కులపరమైన దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసేందుకు' ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎట్రాసిటీస్‌ యాక్ట్‌' (అకృత్యాల నిరోధక చట్టం) తెచ్చారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది. భూసంస్కరణల విషయంలోనూ కొన్ని పైపైన ప్రయత్నాలు జరిగాయి.
ఈ అనుకూల చర్యలు...సామాజిక న్యాయం సాధించ బోతున్నామనీ, కుల వ్యవస్థ అంతమవుతుందని ఒక ప్రాథమికమైన ఆనందాన్ని సృష్టించాయి. గడచిన ఏడు దశాబ్దాల కాలంలో ఈ విధానాల అమలు ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, ఎంతో కొంత మేరకు ప్రయోజనం చేకూర్చాయి. ఈ సమూహాల నుండి వచ్చిన వ్యక్తులకు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, చట్ట సభల్లో రిజర్వేషన్లను కల్పించడం ద్వారా కొంత వరకు సామాజిక చలనానికి అవకాశం ఏర్పడింది. సామాజికంగా అణగారిన వర్గాల్లో రిజర్వేషన్లు విద్యా వ్యాప్తికి కూడా దోహదం చేశాయి. కొన్ని కుటుంబాలు పేదరికాన్ని అధిగమించడానికి ఉద్దేశించబడిన పథకాల ద్వారా లబ్ధి పొందాయి. కానీ మొత్తంగా, మానవ హక్కులు, గౌరవం, విద్య, సమాన అవకాశాల కల్పనల్లాంటి ఎజెండాలు ఇంకా వాస్తవరూపం దాల్చలేదు. సామాజికంగా అణచివేతకు గురవుతున్న ప్రజానీకాన్ని పెద్ద సంఖ్యలో పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, నిరుద్యోగం, అణచివేత, వివక్షతలు రోజువారీ జీవితంలో ఇంకా వెంబడిస్తూనే ఉన్నాయి. మన రాజ్యాంగం కల్పించిన అనుకూల నిబంధనల అమలు ద్వారా, గతంలో నిర్వహించిన అనేక పోరాటాల ద్వారా సాధించిన ఈ కొద్దిపాటి అభివృద్ధి కూడా ఇప్పుడు మోడీ పాలనలో గత ఎనిమిది సంవత్సరాలుగా బలహీనపడుతూ వస్తున్నది.
 

                                                              పెరుగుతున్న అణచివేత, దౌర్జన్యాలు

దళితులకు వ్యతిరేకంగా జరుగుతున్న కులపరమైన దౌర్జన్యాలు బీజేపీ పాలనలో పెరుగుతున్నాయి. బీజేపీ, సంఫ్‌ుపరివార్‌ శక్తులు సృష్టించిన మనువాద వాతావరణం, కులోన్మాద ఫ్యూడల్‌ శక్తులకు (ఎలాంటి శిక్షలు లేకుండా) దళితులు, గిరిజనులకు వ్యతిరేకంగా దాడులు చేసేందుకు ప్రోత్సాహాన్నిచ్చింది. తరచుగా జరుగుతున్న కులపరమైన దౌర్జన్యాలు...మనువాద, బ్రాహ్మణవాద హింసను బీజేపీ పాలన ఎలా ప్రోత్సహిస్తుందో ప్రతిబింబిస్తాయి. అధికారుల మౌనం కూడా, సంఫ్‌ుపరివార్‌ రక్షక సమూహాలు దళితులు, మైనార్టీలపై యథేచ్ఛగా దాడులు చేసేందుకు అనుమతి ఇస్తున్నది. ఏడుగురు దళితులను వివస్త్రలను చేసి, కొట్టిన ఉన్నావ్‌ ఉదంతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ దిగంబర ఎజెండాను తెలియజేస్తుంది. హత్రాస్‌లో జరిగిన అఘాయిత్యం, ఈ కుల హింసలో భాగంగా దళిత మహిళలను ఎలా లక్ష్యంగా చేస్తున్నారో బహిర్గతం చేస్తుంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు...దళితులపై హింసాత్మక దాడుల పెరుగుదలను సూచిస్తున్నాయి. దళితులపై నేరపూరిత చర్యలు 2011లో 33,719 ఉంటే, 2020 నాటికవి 50,291కి పెరిగాయి. దళితులు, గిరిజనులపై దాడులు 2017లో 20.3 శాతం పెరిగితే, 2018లో 27.3 శాతం పెరిగాయి. కానీ ఈ సంఖ్యలు వాస్తవ సంఖ్యల కంటే తక్కువే. నమోదు కాని, బయటకు తెలియజేయని సంఘటనలు అనేకం ఉన్నాయి.
       ఈ అఘాయిత్యాల పెరుగుదల రేటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. గడచిన దశాబ్ద కాలంలో అధికంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 95,751, బీహార్‌లో 63,116, రాజస్థాన్‌లో 58,945, ఆంధ్రప్రదేశ్‌లో 26,881 కేసులు నమోదయ్యాయి. ఎస్సీ జనాభా ప్రకారం నేరాలు అధికంగా నమోదైన రాష్ట్రాలు రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌, బీహార్‌. 'ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎట్రాసిటీస్‌ యాక్ట్‌' కింద నమోదైన కేసులు 2019లో 94 శాతం పెండింగ్‌లో ఉంటే, 2020 నాటికి 90.5 శాతం పెండింగ్‌లో ఉన్నాయి. బీహార్‌లో 49,008 ఎట్రాసిటీ కేసులు విచారణలో ఉంటే, 48,953 (99.9 శాతం) కేసులను పెండింగ్‌లో పెట్టి కేవలం 55 కేసులను మాత్రమే 2020లో పరిష్కరించారు. ఈ 55 కేసుల్లో 53 కేసులను కొట్టివేశారు.
       గడచిన దశాబ్ద కాలంగా గ్రామీణ భారతంలో వికృత రూపాల్లో తిరిగి ఊపందుకున్న కుల అణచివేత, బీజేపీ పాలనలో పెరిగిన మనువాద దురభిమానానికి సాక్ష్యంగా నిలిచింది. 2010లో గుజరాత్‌ లోని 1589 గ్రామాల్లో 'నవసర్జన్‌ ట్రస్ట్‌' వారు నిర్వహించిన సర్వే, దళితులు 98 రూపాల్లో అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపింది. గ్రామీణ పాఠశాలల్లో పిల్లలను ఘోరంగా వేరుచేసి కూర్చోపెట్టడం, ఇప్పటికీ ప్రత్యేకమైన కులాల వారీగా నివాస ప్రాంతాలు, గూడెంలు లేదా వాడలు ఉండడం, రోడ్ల వెంట నిర్వహించబడే టీ బడ్డీలలో దళితులకు ప్రత్యేకమైన గ్లాసుల వాడకం, నేటికీ దళితులు మురికి ప్రాంతాల్లో నివాసం ఉండడం, దళితులను అవమానిస్తూ, వారిపై దాడులు చేయడం కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఈ అణచివేత చర్యలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఎస్సీలకు వ్యతిరేకంగా 32 శాతం కేసులు పెరిగాయని, 2013-2017 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో వారి వ్యతిరేకులు 55 శాతం పెరిగారని 2018లో ఆ రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా శాసనసభలో అంగీకరించింది.
 

                                                                               రిజర్వేషన్ల రద్దు

మోడీ ప్రభుత్వం ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో దూకుడుగా చేపట్టిన ప్రైవేటీకరణ కార్యక్రమం, రిజర్వేషన్లకు మృత్యు ఘంటికలు మోగిస్తున్నది. నీతి ఆయోగ్‌ సుమారు 250 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించేందుకు నాలుగు సంవత్సరాల రోడ్‌ మ్యాప్‌ను తయారు చేసింది. దానిలో భాగంగానే ముఖ్య రంగాలైన రైల్వేలు, రక్షణ రంగం, ఎలక్ట్రిసిటీ, ఆయిల్‌, ఫైనాన్షియల్‌ రంగం, బ్యాంకులు మొదలగు వాటి ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ రంగం బలహీన వర్గాలకు రిజర్వేషన్లను కల్పించే పెద్ద వనరు. పై రంగాలను ప్రయివేటీకరించడమంటే దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారికి ప్రయోజనాలు కలుగజేసే రిజర్వేషన్లపై చేస్తున్న ప్రత్యక్ష దాడిగా పరిగణించాలి. దశాబ్ద కాలంగా ప్రయివేటీకరణ కారణంగా ప్రభుత్వ రంగంలో విద్య, ఉద్యోగ అవకాశాలు చాలా వేగంగా కుంచించుకుపోయాయి. ఆ విధంగా రిజర్వేషన్లను అమలు చేయడానికి ఉన్న అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. పరిమితమైన రిజర్వేషన్ల ప్రయోజనాలు కూడా చాలా వేగంగా తగ్గిపోయాయి. ఐఐటీ, ఐఐఎమ్‌ లాంటి ఉన్నత విద్యా సంస్థలు కూడా రిజర్వేషన్లను అమలు చేయడంలో తప్పిదాలకు పాల్పడుతున్నాయి. రిజర్వేన్లను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే వాగ్దానాలు చేసి కూడా ఏమీ చేయలేదు. 23 ఐఐటీలలో 6043 మంది బోధనా సిబ్బందికి గాను, కేవలం 146 మంది ఎస్సీలు, 21 మంది ఎస్టీ లు అంటే కేవలం 3 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఉన్నారు. మొత్తం 13 ఐఐఎంలలో పని చేస్తున్న బోధనా సిబ్బంది 642 మందికి కేవలం నలుగురు ఎస్సీలు, ఒక్కరే ఎస్టీ ఉన్నారు. ఏఐఐఎంఎస్‌లో మొత్తం 1,111 బోధనా సిబ్బందికి గాను 275 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, 92 ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ తెలిపింది. తగిన అర్హత, అనుభవం, సామర్థ్యం ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను నియమించడం లేదని ఆ కమిటీ గుర్తించింది. అదే విధంగా ఢిల్లీ యూనివర్సిటీలో మంజూరైన 264 ప్రొఫెసర్‌ పోస్టులకు, 2019లో ఎస్సీలను కేవలం ముగ్గుర్ని నియమించి, ఎస్టీలను ఎవ్వరినీ నియమించలేదు. భారతీయ జనతా పార్టీ ముందుకు తెచ్చిన నూతన విద్యా విధానం పేద వర్గాలకు చెందిన వారిని ముఖ్యంగా దళితులకు మరింత ప్రమాదం కలిగించబోతోంది. ఎందుకంటే ఇది విద్యలో వ్యాపారీకరణ, ప్రైవేటీకరణను, కాషాయీకరణను ప్రోత్సహిస్తుంది.
      మోడీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక సబ్‌ప్లాన్‌ చట్టాలను ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చింది. ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రకారం వారి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంది. ఐదు సంవత్సరాలకు 2015-16 నుండి 2019 వరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కోసం చేసిన కేటాయింపులు 51శాతం. కేటాయించిన నిధులలో కూడా కేవలం 21శాతం నిధులు మాత్రమే నేరుగా లబ్ధి పొందే పథకాల నిమిత్తం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2017-18లో ప్లాన్‌, నాన్‌ ప్లాన్‌ బడ్జెట్‌లను కలిపి సబ్‌ ప్లాన్‌ ఆలోచనను వంచించిన ఫలితంగా ఎస్సీ ఎస్టీల వాస్తవ ఖర్చులకు కోత పడింది.
 

                                                                        కొనసాగుతున్న పేదరికం

మోడీ పాలనలో, గడచిన దశాబ్ద కాలంగా దళితులు, గిరిజనులకు, ఇతరుల మధ్య, పేదరికం స్థాయి మరింతగా పెరిగింది. 'ఆక్స్‌ఫర్డ్‌ పావర్టీ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇనీషియేటివ్‌' ప్రకారం, 2021లో పేదరికం స్థాయి ఎస్టీల్లో అధికంగా 50.6 శాతం, ఎస్సీలలో 33.3 శాతం, ఓబీసీల్లో 27.2 శాతం ఉంది. దీనికి భిన్నంగా ఇతరులలో పేదరికం స్థాయి బాగా తక్కువగా 15.6 శాతం ఉంది. 'మల్టీ-డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌' ప్రకారం 2021లో, మొత్తం 109 దేశాల్లో భారతదేశం 66వ స్థానంలో ఉంది. 2013లో మొత్తం దేశ సంపదలో 45 శాతం సంపద, జనాభాలో 21 శాతంగా ఉన్న ఉన్నత కులాల వారి చేతిలో ఉండగా, జనాభాలో 16 శాతంగా ఉన్న ఎస్సీల చేతిలో కేవలం 7 శాతం సంపద మాత్రమే ఉంది. ఎస్సీలలో నిరుద్యోగం 2017-18లో 6.3 శాతం ఉంటే, అది 2018-19కి 6.4 శాతానికి పెరిగింది. ఎస్టీలలో అది 4.3 శాతం నుండి 4.5 శాతానికి పెరగ్గా, సాధారణ నిరుద్యోగం 6.1 శాతం నుండి 5.8శాతానికి తగ్గింది.
      ఎస్సీ, ఎస్టీ, ఇతర పేద ప్రజల ప్రయోజనాలను కాపాడే చట్టాలను బలహీన పరచి, నిర్వీర్యం చేసే ప్రత్యక్ష, పరోక్ష చర్యలకు మోడీ ప్రభుత్వం పూనుకుంటున్నది. భూసంస్కరణల చట్టాలను సవరించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నది. పరిశ్రమలు, రియల్‌ ఎస్టేట్‌తో పాటు వ్యవసాయేతర వ్యాపారాలకు అనుగుణంగా రాష్ట్రాలు భూమి స్వభావాన్ని మార్చడానికి వీలుగా 2014 నుండి సవరణలను వేగవంతం చేస్తున్నాయి. 2013 భూసేకరణ చట్ట సవరణ విఫలం చెందిన తరువాత రాష్ట్రాలు రైతు అనుకూల నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్టాలను చేయడం ద్వారా భూసేకరణ చట్టంలో జోక్యం చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నది. ఇది గిరిజనులను కూడా వదిలి పెట్టలేదు. మన దేశంలోని అడవుల్లోకి కార్పొరేట్‌లు, ప్రయివేటు కంపెనీలు ప్రవేశించి, వాటిని అదుపు చేసేందుకు అనుమతించడానికి కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్ట నిబంధనలను సవరించింది. గ్రామసభలు, గిరిజన ప్రజలు, సాంప్రదాయంగా అటవీ ప్రాంతంలో నివసించే ఇతర ప్రజల హక్కుల పైన చేస్తున్న బహిరంగ దాడి ఇది. గతంలో దళితులకు, గిరిజనులకు ఇచ్చిన భూములను అనేక సాకులతో తిరిగి లాక్కోవడానికి దారి తీసే విధంగా భూ బ్యాంకు (ల్యాండ్‌ బ్యాంక్స్‌) లను నెలకొల్పాలని కేంద్రం రాష్ట్రాలను తొందర పెడుతున్నది. ఈ విధానాలు, ఇప్పటికే భూ యాజమాన్యంలో ఉన్న తేడాలను మరింత తీవ్రం చేస్తున్నాయి. ఎస్సీ కుటుంబాలు మొత్తం భూమిలో కేవలం 9.5 శాతం భూమిని మాత్రమే కలిగి ఉన్నాయని 2018-19లో ఎన్‌ఎస్‌ఓ వారి డేటా తెలియజేస్తుంది. ఎస్సీ జనాభాతో పోలిస్తే వారు చాలా కొద్ది భాగం భూమిని మాత్రమే కలిగి ఉన్నారు. ఓబీసీలు, ఉన్నత కులాలకు చెందిన వారు (వారి జనాభాతో పోలిస్తే) మొత్తం భూమిలో వరుసగా 48 శాతం, 29 శాతంగా భూమిని కలిగి ఉన్నారు.
      ఆయా సందర్భాలలో ప్రధాని, నరేంద్ర మోడీ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నప్పటికీ, గత ఎనిమిదేళ్లుగా ఆయన ప్రభుత్వ విధానాలు, వాటి అమలు సామాజిక న్యాయానికి సంబంధించిన కార్యక్రమాలను ధ్వంసం చేసే విధంగా, లింగ, కుల, ఇతర సామాజిక అసమానతలకు ఊతమిచ్చే దిశగా పయనిస్తున్నాయి. మనం ఈ మతోన్మాద, కార్పొరేట్‌, మనువాద ప్రమాదాలతో కూడిన బీజేపీ పాలనను ప్రతిఘటించకుంటే...సామాజిక న్యాయం అనేది దళితులకు, గిరిజనులకు, ఇతర బలహీన వర్గాలకు గతానికి సంబంధించిన అంశం గానే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం దేశ ప్రజలందరి కోసం మనం మన రాజ్యాంగంలో లిఖించబడిన మన స్వాతంత్య్రోద్యమ విలువలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయాలను కాపాడేందుకు పోరాట సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

/ వ్యాసకర్త : సిపిఐఎం పొలిట్‌బ్యూరో సభ్యులు /
బి.వి. రాఘవులు

బి.వి. రాఘవులు